Take a fresh look at your lifestyle.

టీఆర్‌ఎస్‌లో అసమ్మతి రాగం

  • అధినేతకు వ్యతిరేకంగా సీనియర్ల సమావేశాలు
  • సొంత దారి వెతుక్కుంటున్న జూపల్లి, తుమ్మల, పొంగులేటి
  • కేసీఆర్‌ ‌వనపర్తి సభ రోజే అసంతృప్త నేతల భేటీ

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో అసమ్మతి నేతలు వొక్కటవుతున్నారు. గత కొంత కాలంగా తమకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని భావిస్తున్న నేతలు సొంత దారి వెతుక్కుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ఱారావు గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ అధికార, అనధికార కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గత అసెంబ్లీ ఎన్నికలలో వోటమి పాలయ్యారు. ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షవర్ధన్‌ ‌రెడ్డి చేతిలో వోటమి పాలయ్యారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో హర్షవర్ధన్‌ ‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ‌గూటికి చేరారు. దీంతో పార్టీలో జూపల్లికి ప్రాధాన్యత తగ్గింది. కొల్లాపూర్‌ ‌మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలలో సైతం టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ‌జూపల్లి వర్గానికి చెందిన నేతలకు టికెట్టు ఇవ్వకుండా ఎమ్మెల్యే చెప్పిన నేతలకే టికెట్టు ఇచ్చారు.

దీంతో జూపల్లి తన అనుచరులను రెబల్‌ అభ్యర్థులుగా నిలబెట్టడంతో పాటు వారిని గెలిపించుకుని తన సత్తా చాటారు. దీంతో ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డికే అధిష్టానం వెన్నుదన్ను ఉన్నట్లు స్పష్టమైంది. మరోవైపు, జిల్లా మంత్రి నిరంజన్‌రెడ్డితో సైతం జూపల్లికి విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల వనపర్తిలో సీఎం కేసీఆర్‌ ‌నిర్వహించిన బహిరంగ సభకు సైతం జూపల్లి హాజరు కాలేదు. పార్టీలోనే వోపికతో వేచి ఉంటే కనీసం ఎమ్మెల్సీ పదవి అయినా వొస్తుందని వేచి చూసిన జూపల్లికి నిరాశే ఎదురైంది. దీంతో ఇక సొంత భవిష్యత్తు వెతుక్కోక తప్పదని భావించిన జూపల్లి ఖమ్మం జిల్లాకు చెందిన మరో పార్టీ సీనియర్‌ ‌నేత, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో వనపర్తిలో సీఎం కేసీఆర్‌ ‌సభ నిర్వహించిన రోజే అసమ్మతి సమావేశం నిర్వహించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాకే చెందిన మరో సీనియర్‌ ‌నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సైతం తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తుమ్మల సొంత నియోజకవర్గమైన పాలేరులో ప్రస్తుతం కందాళ ఉపేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్‌ ‌పార్టీ టికెట్‌పై గెలిచి టీఆర్‌ఎస్‌ ఆకర్ష పథకంలో భాగంగా టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో అక్కడ కూడా పార్టీ పరంగా తుమ్మలకు ప్రాధాన్యం తగ్గింది. ఈ నేపథ్యంలోనే అసంతృప్త నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. జూపల్లికి కాంగ్రెస్‌తో ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి. ఆదివారం కొల్లాపూర్‌లో టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి నిర్వహించనున్న మన ఊరు, మన పోరు బహిరంగ సభలో జూపల్లి కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఇక పొంగులేటి, తుమ్మల సైతం తమ రాజకీయ భవిష్యత్తు కోసం త్వరలోనే కాంగ్రెస్‌, ‌లేదా బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ ‌వర్గాలలో జోరుగా చర్చలు వినిపిస్తున్నాయి.

Leave a Reply