Take a fresh look at your lifestyle.

దీర్ఘకాలిక పోరాటానికి టిఆర్‌ఎస్‌ ‌సిద్ధం: షాద్‌నగర్‌ ‌టోల్‌గేట్‌ ‌వద్ద మంత్రి కెటిఆర్‌ ‌నిరసన

అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. రైతులు ప్రకటించిన భారత్‌ ‌బంద్‌కు టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పూర్తి మద్దతు తెలుపగా టీఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణులు రైతులకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు, రైతులు ఆందోళనలకు దిగారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టణ కేంద్రాల్లో బైక్‌ ‌ర్యాలీలు నిర్వహించారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. ప్రధాన కూడళ్లలో రాస్తారోకోలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రైతుల తరపున దీర్ఘకాలికంగా పోరాడేందుకు టీఆర్‌ఎస్‌ ‌పార్టీ సిద్ధంగా ఉందని  పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తేల్చిచెప్పారు.

రైతులకు ఎవరు ద్రోహం చేసినా టీఆర్‌ఎస్‌ ఎం‌డగడుతుందని స్పష్టం చేశారు. షాద్‌నగర్‌ ‌బూర్గుల టోల్‌గేట్‌ ‌వద్ద రైతులకు మద్దతుగా కేటీఆర్‌, ‌కెకె, శ్రీనివాసగౌడ్‌, ‌మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు  భారత్‌ ‌బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. ‘కడుపు మండిన రైతన్నలు గత 13 రోజులుగా ఢిల్లీ పురవీధుల్లో, ఎముకలు కొరికే చలిలో, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతు బాగుంటేనే మనమంతా బాగుంటాం. ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుండదు.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు.. కానీ దేశ వ్యాప్తంగా రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. రైతన్న ఏడ్వడం ఈ దేశానికి, ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ ‌శక్తుల వైపే మొగ్గు చూపుతుంది. కానీ కర్షకుల వైపు మొగ్గు చూపకుండా.. వారి నెత్తిపై మూడు నల్లచట్టాలను రుద్దుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదని అర్థమంవుతుంది’ అని అన్నారు.

Leave a Reply