Take a fresh look at your lifestyle.

టీఆర్‌ఎస్‌లోరాజ్యసభ సీటుకు పోటాపోటీ

kavitha kk mandava

  • కేకేకు మరోసారి అవకాశం దక్కేనా ?
  • రేసులో పొంగులేటి, కవిత, సురేశ్‌రెడ్డి, మండవ
  • అధినేత మనసులో ఏముందో తెలియక
  • నేతల అయోమయం

టీఆర్‌ఎస్‌లో రాజ్యసభ రేసు మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీలో రాజ్యసభ సీటుకోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.ఏప్రిల్‌ ‌రెండో వారంలో రాజ్యసభ సభ్యులు గరికపాటి రామ్మోహనరావు, కేవీపీ రాంచందర్‌రావు పదవీ కాలం ముగియనుంది. ఈ రెండు స్థానాల భర్తీకి ఈసీ ఈ నెలాఖరులో నోటిఫికేషన్‌ ‌విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో ఈ సారి టీఆర్‌ఎస్‌ ‌నుంచి అవకాశం ఎవరికి దక్కనుందో అని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆశావహులు అధినేత అనుగ్రహం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాజ్యసభ రేసులో టీఆర్‌ఎస్‌ ‌నుంచి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్‌ ‌మాజీ ఎంపీ, కేసీఆర్‌ ‌కుమార్తె కవితతో పాటు ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ ‌పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గత పార్లమెంటు ఎన్నికలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుంచి ప్రయత్నం చేసినప్పటికీ ఆయనకు టికెట్‌ ‌దక్కలేదు. అక్కడి నుంచి నామా నాగేశ్వరరావుకు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అవకాశం కల్పించారు. దీంతో పొంగులేటి అలిగినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. దీంతో పొంగులేటికి రాజ్యసభ అవకాశం కల్పిస్తామని కేసీఆర్‌ ‌హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో త్వరలో ఖాళీ అయ్యే రెండు రాజ్యసభ స్థానాలలో ఒకటి పొంగులేటికి దక్కుతుందనే ప్రచారం పార్టీ వర్గాలలో వినిపిస్తోంది. ఇక గత ఎన్నికలలో నిజామాబాద్‌ ఎం‌పీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన కుమార్తె కవిత కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలలో ఓటమి పాలైనప్పటి నుంచి ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. టీఆర్‌ఎస్‌ ‌నిర్వహించే కార్యక్రమాలలోనూ పాల్గొనడం లేదు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికలలో సైతం కవిత ఎక్కడా కనిపించలేదు.

నిజామాబాద్‌లో ఓటమి పాలైనప్పటి నుంచి కవిత పార్టీపై అలిగారనీ ఒక దశలో ఆమె అమెరికాకు సైతం వెళ్లిపోయారన్న ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఉన్న కవిత తన సంస్థ కార్యకలాపాలు సైతం నిర్వహించడం లేదు. దీంతో ఆమెను తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావాలంటే రాజ్యసభ సీటు ఇవ్వాలని నిజామాబాద్‌ ‌జిల్లా నేతలు కోరుతున్నారు. ఇదే జిల్లా నుంచి గత ఏడాది కాంగ్రెస్‌ ‌నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ స్పీకర్‌ ‌సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు సైతం రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన మాజీ స్పీకర్‌ ‌మధుసూధనాచారి సైతం రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, ఎస్సీ వర్గం నుంచి మందా జగన్నాథం, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ ‌కూడా రాజ్యసభ సీటును ఆశిస్తున్న వారిలో ఉన్నట్లు తెలిసింది. మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సైతం పార్టీ నుంచి పెద్దల సభకు వెళ్లాలని ఆశిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కేకే పదవీ కాలం కూడా త్వరలో ముగియనుంది. దీంతో తనకు మరోసారి అవకాశం కల్పిస్తారా ? లేదా అనే ఆయోమయంలో ఆయన కొట్టుమాట్టాడుతున్నట్లు సమాచారం. ఇటీవల కేసీఆర్‌ ‌జన్మదినం సందర్భంగా కేకే ప్రగతి భవన్‌లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆయనకు మరోసారి పదవి పొడగింపు ఉంటుందా ? లేదా అనే అంశంపై ఇప్పుడు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. కాగా, రాజ్యసభ సీటు కోసం టీఆర్‌ఎస్‌లో ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అధినేత వైఖరి ఏమిటో అంతు•ట్టక నేతలు అయోమయానికి గురవుతున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాలా ? రాజకీయ అవసరాలా ? వీటిని దేనిని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్‌ ‌పెద్దల సభకు వెళ్లే అవకాశం కల్పిస్తారనేది పార్టీలో మిలియన్‌ ‌డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

Leave a Reply