ఎన్నికల ప్రచారంలో వెనక్కి తగ్గిన కెసిఆర్, కెటిఆర్
ప్రజాతంత్ర, మహబూబ్‌నగర్: పాలమూరు ప్రచారంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డా।। లక్ష్మణ్ నల్లధనంతో ఎన్నికలను శాసించే సంస్క•తికి టీఆర్ఎస్ తెరలేపిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఎన్నికల్లో టిఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్యాయని అన్నారు. పాలమూరును ఎంఐఎంకు కట్టబెట్టాలని చూస్తున్నారని సిఎం కెసిఆర్‌పై మండిపడ్డారు. శుక్రవారం ఆయన పాలమూరు,భూత్పూర్లో ప్రచారం నిర్వహించారు. మాజీమంత్రులు డికె అరుణ, పి.చంద్రశేఖర్లతో కలసి జోరుగా ప్రచారం నిర్వహించారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హాలను అమలు చేయకపోవటంతోనే కేసీఆర్, కేటీఆర్‌లు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారని దుయ్యబట్టారు. దొడ్డిదారిన మేయర్,మున్సిపల్ చైర్మన్ పదవులను దక్కించు కోవాలనే కుట్రతో ప్రభుత్వం ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లటం లేదని వ్యాఖ్యానించారు. మద్యం, మైనింగ్,ఇసుక మాఫియాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే అభ్యర్ధులు అమ్ముడు పోతారని, టీఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లీస్ కు తాకట్టు పెడతారని మండిపడ్డారు. ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీని గెలిపిస్తే కేంద్రం నిధులతో పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు.రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీఆర్ఎస్ ఆరేళ్ల పాలనపై బీజేపీ చార్జ్‌షీట్ విడుదల చేసింది. ఆరేళ్లలో టీఆర్ఎస్ పాలనలో పురపాలికలు నిధులు లేక పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఆరోపించింది.
ఇప్పటివరకు సీఎం కేసీఆర్ మాయమాటలు నమ్మి ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లు వేశారని, ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్కు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నిస్తూ బీజేపీ ముందుకు వెళ్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. కనీసం ఈ ఎన్నికల్లోనైనా మోసపోకుండా ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని కోరుతున్నామన్నారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో టీఆర్ఎస్ వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్రంలో పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం టీఆర్ఎస్ అండతోనే ఇప్పుడు మున్సిపాలిటీలపై కన్నేసిందన్నారు. ఎంఐఎం అజెండాను అమలు చేస్తున్న టీఆర్ఎస్కు ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయవద్దన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే సమస్య లేదని, కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేయాలన్నారు. పట్టణాలను డల్లాస్‌లా తయారు చేస్తామని, హుస్సేన్‌సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా చేస్తామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని లక్ష్మణ్ ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులే పట్టణాలను ఆదుకుంటున్నది వాస్తవమా.. కాదా.. అన్నది కేటీఆర్ చెప్పాలన్నారు.
Tags: trs party, mim party, municipal results, bjp leader k lakshman