Take a fresh look at your lifestyle.

పాత, కొత్త కలయికతో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు

పాత కొత్త కలయికతో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ తన ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. ఎంతో మంది ఆశలు పెట్టుకున్న ఈ పదవుల కోసం అభ్యర్థులను ఎంపిక చేయడంలో టిఆర్‌ఎస్‌ అధినేత అనూహ్య జాబితాను ప్రకటించారు. ముఖ్యంగా ఈ అభ్యర్థుల ఎన్నికకు కావాల్సినంత మెజార్టీ టిఆర్‌ఎస్‌ ‌దగ్గర ఉండడంతో ఎవరైనా సులభంగా ఎన్నిక అయ్యే అవకాశాలు ఉండడంతో ఈ పదవులకు పోటీ కూడా పెరిగింది. ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల్నే నామినేషన్‌ ‌దాఖలు చేసేందుకు మంగళవారం చివరి రోజు కావడంతో టిఆర్‌ఎస్‌ ‌తన అభ్యర్థులను చివరి నిమిషంలో  ప్రకటించింది. కాగా స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఒకేసారి నోటిఫికేషన్‌ ‌జారీ కావడంతో, ఎమ్మెల్యే కోటాలో చోటు దొరకని ఆశావహుల చూపు ఇప్పుడు అటువైపు మళ్ళింది.

కాగా ఎమ్మెల్యే కోటాలో అప్పటి వరకు ప్రచారంలో ఉన్న పేర్లకు భిన్నంగా  మాజీ కలెక్టర్‌ ‌వెంకట్రామరెడ్డి, బండ ప్రకాశ్‌ల పేర్లను ప్రకటించడాన్ని ఎవరూ ఊహించలేదు. బండ ప్రకాశ్‌ ‌రాజ్యసభ పదవీ కాలం ఇంకా పూర్తి కాకున్నా ఆయన్ను అనుకోకుండా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. అంతటితోనే కాకుండా ఆయనకు కేబినెట్‌లో  చోటు కల్పించే అవకాశాలుకూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ముదిరాజ్‌ ‌సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్‌కు మంత్రి వర్గంలో చోటు కల్పించడం ద్వారా ఆ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుందన్నది కెసిఆర్‌ అభిప్రాయంగా తెలుస్తున్నది. ఖాళీ ఏర్పడిన బండా ప్రకాశ్‌ ‌స్థానంలో అంటే రాజ్యసభకు కల్వకుంట్ల కవితను పంపే అవకాశాలున్నట్లు కూడా వార్తలు వొస్తున్నాయి.

కాగా అందరూ మొదటి నుండి ఊహిస్తున్న పేర్లలో అత్యంత ప్రముఖంగా వినిపిస్తున్నది కడియం శ్రీహరి పేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్సీగా కొనసాగిన శ్రీహరి అంతకు ముందు ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో తొమ్మిదేళ్ళపాటు మంత్రిగా కొనసాగిన వ్యక్తి. అయనకు కూడా ఈసారి మంత్రి పదవి దక్కనుందా లేక ఏదైనా కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌పదవితో సరిపుచ్చుతారా అన్నది తేలాల్సి ఉంది. హుజురాబాద్‌ ఎన్నికల సందర్భంగా అక్కడి కాంగ్రెస్‌ ‌నాయకుడు కౌశిక్‌ ‌రెడ్డిని కారెక్కించుకున్న గులాబీ పార్టీ ఆయనకు హామీ ఇచ్చిన మేరకు గవర్నర్‌ ‌కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నిక చేసే ప్రయత్నం చేసినా అది ఫలవంతం కాలేదు. దాంతో ఆయన్నిప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేశారు. కొత్తగా వొచ్చిన పేరు సిద్ధిపేట మాజీ కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డి. అటు కెసిఆర్‌, ఇటు కెటిఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావుకు అత్యంత సన్నిహితుడిగా మెదలిన వెంకట్రామిరెడ్డిని మొదట గవర్నర్‌ ‌కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేస్తారనుకున్నారు. కాని చివరి నిమిషంలో ఆయన్ను కూడా ఎమ్మెల్యే కోటా కిందనే ఎంపిక చేశారు.

ఇదిలా ఉంటే వరంగల్‌ ‌జిల్లానుండి ముగ్గురికి ఒకేసారి అవకావం లభించింది. కడియం శ్రీహరితోపాటు, బండా ప్రకాశ్‌, ‌తక్కళ్ళపల్లి రవీందర్‌రావులకు అవకాశం లభించడం ఒక విధంగా వరంగల్‌పై కెసిఆర్‌ ‌ప్రత్యేక దృష్టి సాధించినట్లు అయింది. తెరాస అవిర్భావం నుండి పార్టీ పరంగా ఇచ్చిన అనేక కార్యక్రమాలను విజయవంతం చేయడంలో తక్కళ్ళపల్లి రవీందర్‌రావు కృషి చేశారు. ఈ ఏడేళ్ళ కాలంలో అనేక సార్లు ఆయనకు అవకాశం లభించినట్లే లభించి దూరం అయింది. ఈసారి మాత్రం ఆయన్ను ఎమ్మెల్సీ పదవి వరించింది. స్థానిక సంస్థల కోటా ఎంఎల్సీ ఎన్నికకు మంగళవారం నోటిఫికేషన్‌ ‌విడుదల కావడంతో అక్కడ భర్తీ కావాల్సిన పన్నెండు స్థానాలకు కూడా తీవ్ర పోటీ ఏర్పడింది. నవంబర్‌ 23 ‌వరకు నామినేషన్‌ల స్వీకరణ ఉండడంతో ఇప్పుడప్పుడే ఎవరిని పార్టీ ఎంపిక చేసేది ఇంకా స్పష్టత లేదు. ఈ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఇంత వరకు కొనసాగిన వారిలో పురాణం సతీష్‌కుమార్‌, ‌భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు, భూపాల్‌రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి  నారాయణరెడ్డి, కూచుకుళ్ళ దామోదర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత ఉన్నారు.

ఇందులో ఎందరికి రెండవ అవకావం లభిస్తుందన్న దానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేక తీర్పు రావడంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో తన సన్నిహితులతో కెసిఆర్‌ ‌పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల్లో అధిక శాతం టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన వారే కావడంతో గెలుపు ఖాయం అన్న ఉద్దేశ్యంగా ఎలాగైనా తమ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం పరిగణనలోకి తీసుకునే విధంగా తమ గాడ్‌ ‌ఫాదర్స్‌తో ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Leave a Reply