Take a fresh look at your lifestyle.

దేవన్నపేట రైతుల పంట భూముల్లో టిఆర్‌ఎస్‌ ‌సభను నిర్వహించే దౌర్జన్యపూరిత నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలి

నవంబరు మూడో తారీఖున టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పోలీసుల సహాయంతో దేవన్నపేట, ఉనికిచెర్ల గ్రామాల శివారులోని 500 ఎకరాల వ్యవసాయ భూమిలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ 20 ఏళ్ల విజయోత్సవ సభ నిర్వహించుకోవడానికి సభా స్థలిగా ఎన్నకుని, సర్వే నిర్వహించటానికి వెళ్ళారు. ఈ విషయంలో జరిగిన వివాదం నేపథ్యంలో మా మానవ హక్కుల వేదిక ఆరుగురు సభ్యుల బృందం గురువారం దేవన్నపేట, ఉనికి చర్ల శివారులో గల రైతులను కలిసి, వారితో విస్తృతంగా మాట్లాడి, వారి పంట చేలను స్వయంగా పరిశీలించడం జరిగింది. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సభ కోసం తమ చేండ్లను,పంటలను నేలమట్టం చేస్తూ, భూముల హద్దులను చెరిపేస్తూ మైదానంగా మార్చటం మా జీవితాల్ని అల్లకల్లోలం చేస్తాయని రైతులు ఆందోళన పడుతున్నారు.

రెండు గ్రామాల శివారు మధ్య కనీసం ఐదు వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో కనీసం నాలుగు వందల ఎకరాల భూమిలో రెండు పంటలూ పండుతున్నాయి. 250 నుండి 300 మంది రైతులు ఆ భూములపై ఆధారపడి జీవనం గడుపుతున్నారు. ఈ నాలుగు వందల ఎకరాల వ్యవసాయ భూముల్లో ఈరోజు పత్తి ,మిరప, వరి పంటలు పూత, కాత దశలో ఉన్నాయి. ఈ స్థలాన్ని సభా వేదికగా, పార్కింగ్‌ ‌స్థలంగా నిర్ణయిస్తే రైతులందరూ ఈ పంటలను నష్ట పోవడమే కాక,తమ భూముల్లో ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ నీటి పారుదల వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయితాయని బాధపడుతున్నారు. సభకు వచ్చే లక్షలాది మంది ప్రతినిధుల వల్ల పర్యావరణ నష్టం జరుగుతుందని, తిరిగి ఆ భూములను వ్యవసాయ యోగ్యం చేసుకోవటానికి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. అలాగే ఈ ప్రాంతంలో రైతుల స్వంత భూముల్లో సభ నిర్వహణ పేర చేసే కార్యక్రమం వెనుక రియల్‌ ఎస్టేట్‌ ‌భూ కబ్జాదారుల కుట్ర కూడా ఉందని వారు చెబుతున్నారు. ఈ భూముల్లో సభను నిర్వహిస్తే భూముల హద్దులు చెరిగిపోతాయని, తదనంతరం ఈ భూములన్నీ వివాదాల్లోకి వెళ్లి, రియల్టర్ల పాలయితాయని వారు భయపడ్తున్నారు. ఇదే ప్రాంతంలో కనీసం వంద ఎకరాల పైబడిన స్థలంలో 1000 నివాస ప్లాట్లు ఉన్నాయి. వాటి హద్దులు కూడా చిరిగిపోయి చాలా గందరగోళం ఏర్పడుతుంది.

గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను, ప్రజా సంఘాలను వంద గజాల స్థలంలో నిరసనలకు, సమావేశాలకు కూడా అవకాశం ఇవ్వకుండా ధర్నా చౌక్‌ ‌లను కూడా ఎత్తివేస్తూ పాలన సాగించి ఇప్పుడు తన సొంత మీటింగును భారీ ఎత్తున జరుపుకోవడమే అనైతికం. అందుకోసం వందలాది ఎకరాల రైతుల సొంత భూములను ఆక్రమించడం అంతకంటే సిగ్గుచేటు. అలాగే, రాష్ట్రంలో, దేశంలో కొరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ స్థితిలో లక్షలాది మంది ప్రతినిధులతో మంద బలాన్ని ప్రదర్సించడానికి సభలు నిర్వహించడం ప్రమాదకరం. ప్రభుత్వం ఒకవైపు కొరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్తూ, మరోవైపు ప్రభుత్వమే ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే అంతకంటే మతిలేని పని ఇంకేం ఉండదు.

రైతుల ఆందోళనను ,పంట చేల పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటూ ..
1.దేవన్నపేట గ్రామ శివారులో నిర్వహించ తలపెట్టిన టిఆర్‌ఎస్‌ ‌విజయోత్సవ సభను ఈ ప్రాంతంలో నిర్వహించకూడదని మేము డిమాండ్‌ ‌చేస్తున్నాం.
2. టిఆర్‌ఎస్‌ ‌విజయోత్సవ సభను కొరోనా పెరగటానికి అవకాశం కల్పించకుండా నిరవధికంగా వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం.
3. ఈ ప్రాంత రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ తక్షణమే ఈ ప్రాంతంలో సభ నిర్వహించబోవడం లేదని ప్రకటించాలని డిమాండ్‌ ‌చేస్తున్నాం.
4. రైతులను అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారని వారు చెప్తున్నారు. అటువంటి కార్యక్రమాల్ని తక్షణమే మాన్పించాలి.
మా నిజనిర్ధారణ బృందంలో డాక్టర్‌ ఎస్‌ ‌తిరుపతయ్య, బదావత్‌ ‌రాజు, అద్దునూరి యాదగిరి,వి వెంకట నారాయణ, వి. దిలీప్‌, ‌పి. శ్రీనివాస్‌ ‌లు లు పాల్గొన్నారు.

– మానవ హక్కుల వేదిక

Leave a Reply