ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం టిఆర్ఎస్ పార్టీ 20 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సాదా సీదాగా నిర్వహించారు. కొరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఏలాంటి హంగామా లేకుండా గ్రామ గ్రామనా జెండాలు ఆవిష్కరించి వేడుకలను జరుపుకున్నారు. పలు ప్రాంతాల్లో కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులు రక్తశిబిరాన్ని నిర్వహించి రక్తాన్ని దానం చేశారు. హన్మకొండలో అమరవీరుల స్థూపం వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండా ప్రకాశ్, ఎమ్మెల్యే నరేందర్, మాజీ ఎంపి సీతారాంనాయక్ తదితర ప్రముఖులు అమరులకు నివాళులర్పించారు. పరకాలకు వెళ్ళి వస్తున్న వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి రోడ్డు ప్రమాదానికి గురికావడంతో టిఆర్ఎస్ శ్రేణుల్లో కొంత విషాదం నెలకొంది.
కాగా పలు ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను టిఆర్ఎస్ శ్రేణులు ఉల్లంఘించి పార్టీ వేడుకలను జరుపుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. రెడ్ క్రాస్ సొసైటీ రక్త నిది కేంద్రంలో రక్తదానం ఏర్పాటు చేశారు. ఈ రక్త దాన శిబిరానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఆయన రక్తదానం చేశారు. శిబిరంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పార్లమెంట్ మాజీ సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్, కూడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తానన్నారు.
ఈ శిబిరంలో వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ విజయచందర్ రెడ్డి, కోశాధికారి నాగయ్య, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు ఈవీ శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు బొమ్మెనేని పాపి రెడ్డి, 50 డివిజన్ కార్పొరేటర్ దాస్యం విజయభాస్కర్ తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేటలో…: 24వ డివిజన్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెరాస నాయకులు అప్పరాజు రాజు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ మాస్కూలు అందచేశారు. ఈ సందర్భంగా అప్పరాజు రాజు మాట్లాడుతూ 2004 నుంచి పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నామని కరోన వ్యాప్తి దృష్ట్యా పార్టీ ఆదేశాలమేరకు లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు పంపిణీ చేయటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక అభినందనలు తెలియచేసారు.
హసన్ పర్తిలో..: మండల కేంద్రములో టిఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు బండి రజిని కుమార్ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరూ లాక్ డౌన్‌ను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేత పాక సునీత రాజు, వైస్ ఎంపీపీ బండా రత్నాకర్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కందుకూరి చంద్రమోహన్, జన్ను కిషన్, యాదగిరి, తిరుపతి, చేరాలు గరిగే మురళి, కేయు టిఆర్ఎస్వి ఇంచార్జి జెట్టి రాజేందర్, యూత్ నాయకులు బిక్షపతి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.