పెద్దల సభలో ప్రవేశం కోసం టీఆర్ఎస్లో పోటీ పెరుగుతున్నది. ఏప్రిల్‌లో తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండగా అందుకోసం ఆ పార్టీ నుంచి దాదాపుగా 15 మంది నేతలు పోటీ పడుతున్నారు. రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తుండటంతో సదరు నేతలలో టెన్షన్ నెలకొంది. తెలంగాణలో ఏప్రిల్‌లో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా ఈనెల 6న నోటిఫికేషన్ వెలువడనుంది. టీఆర్ఎస్ పార్టీకి ఉన్న సంఖ్యా బలం దృష్ట్యా ఖాళీ కానున్న రెండు స్థానాలూ గులాబీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. దీంతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎవరిని పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ప్రాతినిద్యం వహిస్తున్న కేకేకు మరోసారి అవకాశం అనుమానమేనని పార్టీ నేతలు భావిస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో అప్పటి ఖమ్మం ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పోటీ చేసే అవకాశం దక్కలేదు.
అప్పటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయన స్థానంలో మాజీ టీడీపీ నేత నామా నాగేశ్వరరావును టీఆర్ఎస్ నుంచి ఎన్నికల బరిలో దింపి ఎంపీగా గెలిపించుకున్నారు. నామాను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా పొంగులేటికి భవిష్యత్తులతో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఈసారి ఆయనకు రాజ్యసభ బెర్తు ఖాయమనే ప్రచారం పార్టీలో బలంగా సాగుతోంది. మరోవైపు, కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు రాజ్యసభ అవకాశం ఇచ్చే ఆలోచనలో పార్టీ అధినేత ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజామాబాద్‌లో ఓడిపోయినప్పటి నుంచి ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో సైతం ఆమె ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు, కనీసం అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ జోక్యం చేసుకోలేదు.
తాను సొంతంగా స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థ నుంచి కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. దీంతో ఆమెను క్రియాశీల రాజకీయాలలో పాల్గొనేలా చేయాలంటే రాజ్యసభకు పంపించాల్సిన అవసరం ఏర్పడిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కవిత పేర్లు రాజ్యసభ ఆశావహుల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. •గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, కేసీఆఆర్‌కు అత్యంత సన్నిహితుడు అయిన కరీంనగర్ మాజీ ఎంపి వినోద్‌కుమార్ పేరుతో పాటు మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్, •భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. తాజాగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త కేసీఆర్‌కు సన్నిహిడుడైన దామోదరరావు, ఖమ్మం చెందిన పారిశ్రామికవేత్త ప్రకాశ్ రెడ్డి పేర్లు సైతం రాజ్యసభ ఆశావహుల జాబితాలో వినిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో ఖాఠీ కానున్న రెండు సీట్లలో ఒకటి సామాజిక సమీకరణాల ప్రకారం ఒకటి అగ్ర కులానికి కేటాయిస్తారనీ, మరొకటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయిస్తారన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే, రాజ్యసభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇంకా ఎలాంటిని నిర్ణయమూ తీసుకోలేదని సమాచారం. ఇప్పుడే అభ్యర్థులను ప్రకటించినట్లయితే మిగతా వారు అసంతృప్తికి గురవుతారనీ, అంతేకాకుండా ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉన్నందున ఇప్పుడే అభ్యర్థుల ప్రకటన దిశగా పార్టీ అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీనికితోడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఇంకా ఎమైనా రాజకీయ సమీకరణాలు మారిన పక్షంలో దానికి అనుగుణంగా అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం చేసే లేకపోలేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.