Take a fresh look at your lifestyle.

టిఆర్‌ఎస్‌ ‌సెల్ఫ్‌గోల్‌ ‌చేసుకుంటోందా !

గోలకొండపైన కాషాయ జండా ఎగురవేయాలని ఉత్సాహపడుతున్న భారతీయ జనతాపార్టీకి రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఈసారి ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటినుండే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా మూడు పార్టీలు ఈ విషయంలో పోటీ పడేందుకు సిద్ధపడుతున్నాయి. కేంద్రం అండదండలతో రాష్ట్రంలో అధికారంలోకి వొస్తామన్న ప్రగాఢ విశ్వాసంతో స్థానిక భారతీయ జనతాపార్టీ నేతలున్నారు. దానికి తగినట్లు గత నెల ఆ పార్టీ కేంద్ర సీనియర్‌ ‌నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షాను రాష్ట్ర బిజెపి నాయకులు కలిసినప్పుడు ఆయన వారిలో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపి పంపించడంతో వారికిక్కడ పట్ట పగ్గాలు లేకుండా పోయాయి. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు పోవాలని అమిత్‌ ‌షా చెప్పినప్పటినుండి రాష్ట్ర నాయకత్వం దూకుడు మరింతగా పెంచింది.

ప్రజా సమస్యలకు సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని విడిచిపెట్టకుండా ప్రతీ అంశాన్ని ఒక ఆయుధంగా మలుచుకోవడం ద్వారా ఒక పక్క టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమంతోపాటు , దీని ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుపోయే అవకాశాలను ఏర్పరుచుకుంటోంది. వరి ధాన్య కొనుగోలు విషయంలోనైతేనేమీ, ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారిన 317 జీఓ అయితేనేమీ వారికిప్పుడు ప్రధాన ఆయుధాలుగా మారాయి. వరి ధాన్యం విషయంలో తమపై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ప్రజలనుండి అనుకున్న మేర స్పందన రావడం లేదు. వరి ధాన్యాన్ని కేంద్రం కొంటుందో లేదో కాని, ప్రస్తుతం కళ్ళాల్లో, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్న విషయాన్ని ప్రజలు నమ్ముతున్నారు. కోట్లాది రూపాయలను వివిధ ప్రాజెక్టులు, పథకాల మీద వెచ్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలుపైన వ్యయం చేసి అన్నదాతలను ఎందుకు ఆదుకోవటంలేదన్న ప్రశ్న ఇప్పుడు తెలంగాణలోని ప్రతీ ఒక్కరి ప్రశ్నగా మారింది.

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్నా, ముందుగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, దానికి అధికారులు స్పందించిన తీరు ప్రజలను మాత్రం ఇబ్బందులకు గురిచేసిందనడం నిర్వివాదాంశం. దాన్ని ఏ మేరకు వాడుకోవాలో బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలు వాడుకోగలిగాయి. అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలపై ఇచ్చిన 317 జీఓ కూడా వివాదస్పదంగా మారింది. వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయలు తీవ్ర మనోవేదనకు గురి కావాల్సిన పరిస్థితి దీనివల్ల ఏర్పడింది. అటు రైతాంగానికి, ఇటు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను ఇబ్బందులకు గురిచేయడంద్వారా టిఆర్‌ఎస్‌ ‌సెల్ఫ్‌గోల్‌ ‌చేసుకుంటోందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తగినట్లు టిఆర్‌ఎస్‌ ‌మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. అది బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అరెస్టు. ఆయన తన పార్టీ కార్యాలయంలో లోపల తాళం వేసుకుని దీక్ష చేస్తున్న సందర్భంలో పోలీసులు గ్యాస్‌ ‌కట్టర్‌లు, గడ్డపారలతో తలుపులను ఊడగొట్టి ఆయన్ను అరెస్టు చేయడంతోపాటు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్‌కు కారణంగా మారడం ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతుందనుకుంటున్న టిఆర్‌ఎస్‌కు ఇబ్బందికరమైన విషయమే.

రాష్ట్ర అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్న బిజెపికి అనూహ్యంగా ఈ విషయాలన్నీ కలిసి వొచ్చినట్లు అయింది. బిజెపి మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కూడా ఇదే సమయంలో మూడు రోజుల పాటు సమన్వయ కమిటి సమావేశాలను రాష్ట్ర రాజధానిలో నిర్వహిస్తోంది. బిజెపికి దిక్సూచి లాంటి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సమావేశాలకు హాజరయ్యే హేమాహేమీలంతా ఇదే సమయంలో ఇక్కడ సమావేశం అవుతున్నారు. వీరంతా తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేసే విషయంలో తీసుకోవాల్సిన కార్యక్రమాలపై క్షుణ్ణంగా చర్చించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ ప్రధాన నేతలంతా టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా తాయు చేపడుతున్న ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం పాశవికంగా అణిచివేస్తున్న తీరును వివరిస్తూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ‌చుగ్‌ ‌పత్రికా సమావేశాల ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అలాగే బండి సంజయ్‌పై పెట్టిన కేసులు, వాటిపై హైకోర్టు న్యాయాధిపతి స్పందించిన తీరుపైన కూడా వారు మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నంలో దాదాపు సఫలీకృతం మైనారనే చెప్పవొచ్చు. దీన్ని టిఆర్‌ఎస్‌ ‌కౌంటర్‌ ‌చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నది.

Leave a Reply