Take a fresh look at your lifestyle.

రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ధర్నాలు.. నిరసనలు

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ..

  • మార్మోగిన మోడీ వ్యతిరేక నినాదాలు
  • నిరసనల్లో పాల్గొన్న మంత్రులు..భారీగా పాల్గొన్న కార్యకర్తలు
  • సిరిసిల్లలో కెటిఆర్‌, ‌సిద్దిపేటలో హరీష్‌ ‌ధర్నా
  • ఇందిరాపార్క్ ‌వద్ద డిప్యూటీ సిఎం, మంత్రులు ధర్నా

రాష్ట్ర వ్యాప్తంగా మోడీ వ్యతిరేక నినాదాలు మార్మోగాయి. ధాన్యం కొనాల్సిందేనంటూ టిఆర్‌ఎస్‌ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు కదలి వొచ్చాయి. ప్రతి నియోజకవర్గ స్థాయిలో టిఆర్‌ఎస్‌ ఆం‌దోళనలకు ఊరూవాడా కలసి రావడంతో ధర్నాలు సక్సెస్‌ అయ్యాయి. మంత్రులంతా తమతమ నియోజకవర్గాల్లో ఆందోళనలకు దిగారు. హైదరాబాద్‌ ఇం‌దిరాపార్కు వద్ద జరిగిన ధర్నాలో మంత్రులు, నగర ఎమ్మెల్యేలు, ఇతరప్రతినిధులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టింది. సిరిసిల్లలో మంత్రి కెటిఆర్‌, ‌సిద్దిపేటలో మంత్రి హరీష్‌ ‌రావు, నిర్మల్‌లో ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, వరంగల్‌లో ఎర్రబెల్లి దయాకర్రావు, నిజామబాద్‌లో ప్రశాంత్‌ ‌రెడ్డి, ఖమ్మంలో మంత్రి పువ్వాడ, ఎంపి నామా నాగేశ్వరరావు తదితరులు ధర్నాల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగానే..టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు పెద్ద ఎత్తున ఇందిరాపార్కు వద్ద చేరుకున్నారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌తదితరులు పాల్గొన్నారు. ఇందిరా పార్క్ ‌ధర్నాలో ఎమ్మెల్యే సుధీర్‌ ‌రెడ్డి,దానం నాగేందర్‌ ‌తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయిస్తామన్నారు. తెలంగాణను అంటరాని రాష్ట్రంగా కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. విశాఖ ఉక్కుతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటోందని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. వడ్లు కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేడ్చల్‌లో నిర్వహించిన ధర్నాలో మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం సర్వ నాశనం అయిపోతుందన్నారు. బండి సంజయ్‌ ఓ ‌మెంటల్‌ ‌సంజయ్‌ అని…ఎప్పుడు ఏం మాట్లాడు తాడో ఆయనకే తెలియదని వ్యాఖ్యానించారు.

సంజయ్‌ ‌మగాడైతే కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు చేపించాలని మంత్రి మల్లారెడ్డి సవాల్‌ ‌విసిరారు. నిర్మల్‌లో నిర్వహించిన ధర్నాలో మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్‌ ‌పట్టణంలోని మున్సిపల్‌ ‌కార్యాలయం ముందు భారీ ఎత్తున రైతులతో ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన రైతులు టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదించారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వరి సాగు, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసిస్తూ ధర్నా చేపట్టామన్నారు. ధాన్యం కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తుందని తెలిపారు.

తెలుగు వార్తలు, Telugu News Headlines Breaking News Now, Today Hilights, Prajatantra News, Telugu Kavithalu, Telangana updates

ఓ వైపు వరి ధాన్యం కొనమని కేంద్రం చెప్పుతుంటే, స్థానికి బీజేపీ నేతలు వరి సాగు చేయాలని రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్‌ ‌చేశారు. నిజామాబాద్‌ ‌జిల్లా బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని వేల్పూర్‌ ఎక్స్ ‌రోడ్‌ ‌వద్ద భారీ ఎత్తున రైతులతో ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన రైతులు టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి ప్లకార్డ్ ‌ప్రదర్శిస్తూ ధర్నాలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు హోరెత్తించారు. రాష్ట్ర రైతులపై కేంద్రం కక్ష్య కట్టిందని మంత్రి జగదీష్‌ ‌రెడ్డి అన్నారు. యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో సూర్యపేటలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ చేపట్టిన రైతు ధర్నాలో మంత్రి పాల్గొని మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌ ‌రైతుల జేబులు నింపుతుంటే ప్రధాని మోదీ కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. రైతుల ధాన్యం కొనుగోలు చేస్తామని బీజేపీ పాలిత కేంద్రం ప్రకటించేంత వరకు పోరాటం కొసాగిస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులకు నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉంటే డ్రామాలు ఆపి బియ్యం కొంటామని కేంద్రంతో ఒక్క ప్రకటన చేపిస్తే చాలు ఆందోళనలను విరమించుకుంటామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్‌ ‌తో వరంగల్‌- ‌ఖమ్మం హైవేపై రాయపర్తి మండల కేంద్రం వద్ద టీఆర్‌ఎస్‌ ‌ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. కేంద్రం యాసంగి వరి ధాన్యాన్ని కొనేవరకు ఆందోళనలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ‌జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌ ‌ముందు ధర్నా చౌక్‌లో టిఆర్‌ఎస్‌ ‌నేతలు మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌, ఎం‌పీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి స్థానిక నేతలు పాల్గొన్నారు. ధర్నా చౌక్‌కు మంత్రి పువ్వాడ. ఎంపీ నామా, మాజీ ఎంపీ పొంగులేటి ఎడ్లబండిపై వొచ్చారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనాలంటూ టీఆర్‌ఎస్‌ ‌నాయకులు వరి నారుతో నినాదాలు చేశారు.

బిజెపికి రాజకీయాలు తప్ప రైతులపై ప్రేమలేదు : ధర్నాలో మండిపడ్డ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప రైతాంగం మిద ప్రేమ లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాలతో ప్రధాని మోదీ రైతుల మెడలకు ఉరితాళ్లు పేనుతున్నాడని నిరంజన్‌ ‌రెడ్డి విమర్శించారు. రైతుల నుంచి యాసంగి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు చేపట్టిన రైతు ధర్నాలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ..యాసంగి వడ్లు కొంటామని కేంద్రంతో రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పించాలని సవాల్‌ ‌చేశారు. లేదంటే కారణాలు చెప్పాలనన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రైతుల మిద మనస్సులేదు. వ్యవసాయం అంటే తెలివి లేదు. దేశ ప్రజల ఆస్తులు అమ్మడం తప్ప రైతుల వడ్లు కొనే విధానం లేదని ఘాటుగా విమర్శించారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను మించిన రాష్ట్రం లేదని మంత్రి పేర్కొన్నారు. దేశంలో పండిన పంటను కేంద్రం కొనుగోలు చేయాలని రాజ్యాంగం చెబుతున్నది. అయినా బీజేపీ ప్రభుత్వం మొండిగా ప్రవరిస్తున్నదని మండిపడ్డారు. దేశ ఆస్తులన్నీ అంబానీ, ఆదానీలకు తాకట్టు పెడుతూ రైతుల నోళ్లలో మట్టికొట్టే చట్టాలు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం తీరు వల్ల దేశంలో 600 మంది రైతులు చనిపోయారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని డిమాంచ్‌ ‌చేశారు. టీఆర్‌ఎస్‌ ‌రైతు సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీకి నూకలు చెల్లడం ఖాయమన్నారు. కేంద్రం ధాన్యం కొనేంత వరకు ఉద్యమిస్తామని మంత్రి తెలిపారు.

Leave a Reply