Take a fresh look at your lifestyle.

దుబ్బాకలో టిఆర్‌ఎస్‌ ‌వోటమి…స్వయంకృపరాధమే..!?

ఆ చేరికలేమాయే…రైతుబంధు, పింఛన్లు ఎటుపాయే
పరాయిల పెత్తనాన్ని సహించని దుబ్బాక నేతలు
గు‘లాబీ’ల పట్ల వ్యతిరేకత మొదలైందా?
రఘునంన్‌ ‌గెలుపు ఎవరి భవితవ్యాన్ని మారుస్తుంది?
ఒక వోటమి.. సవా‘లక్షా’ కారణాలు
2014 తర్వాత టిఆర్‌ఎస్‌కు తొలిదెబ్బ
ఫలించని హరీష్‌రావు శ్రమ
దుబ్బాక బై ఎలక్షన్‌ ‌పోస్టుమార్టం

ఎ.సత్యనారాయణ రెడ్డి / సిద్ధిపేట,
టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి పుట్టినిల్లు సిద్ధిపేటనే కావచ్చు. పార్టీకి, ఉద్యమానికి మాత్రం దుబ్బాక గుండెకాయ అని చెప్పాలి. టిఆర్‌ఎస్‌కు అత్యంత బలమైన నియోజకవర్గాలలో దుబ్బాక నియోజకవర్గం ఒకటి. అటువంటి దుబ్బాకలో ఈ నెల 3న జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత ఓడింది. అనూహ్యంగా బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు గెలిచాడు. దుబ్బాకలో బిజెపి గెలిచి టిఆర్‌ఎస్‌ ‌ఘోర పరాజయాన్ని చవి చూడటానికి ఆ పార్టీ చేసుకున్న స్వయంకృపరాధమనే చెప్పాలి. ఎంతో ఉత్కంఠభరితంగా, నరాల తెగే విధంగా జరిగిన పోరులో కారు పంక్చరైంది. ఏమీలేదన్న చోట కమలం వికసించింది. దుబ్బాక టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి సిట్టింగ్‌ ‌సీటు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో వొచ్చిన దుబ్బాక ఉప ఎన్నికను టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, సీఎం కేసీఆర్‌, ఎన్నికల స్పెషలిస్ట్‌గా పేరొందిన మంత్రి హరీష్‌ ‌రావు సొంత జిల్లాలో టిఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు షాక్‌కు గురయ్యారు. అనేక ఉప ఎన్నికల్లో రికార్డు సృష్టించిన చరిత్ర టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఉంది. 2014 సాధారణ ఎన్నికల అనంతరం అధికారంలోకి వొచ్చిన అనంతరం జరిగిన ప్రతీ ఎన్నికలోనూ టిఆర్‌ఎస్‌ ‌సంచలన విజయాలు నమోదు చేసింది. 2014లో కేసీఆర్‌ ‌గజ్వేల్‌ ఎమ్మెల్యేగా, మెదక్‌ ఎం‌పీగా ఒకే సారి విజయం సాధించారు. ఎన్నికల అనంతరం ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో మెదక్‌ ఎం‌పీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వొచ్చిన అనంతరం మెదక్‌ ఎం‌పీ స్థానానికి మొదటి ఉప ఎన్నిక వొచ్చింది. ఆ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి 3, 61, 286 వోట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డిపై ఘన విజయం సాధించారు. ప్రతి ఎన్నికల్లోనూ దుబ్బాక నియోజకవర్గం టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కంచుకోటగా ఉంటూ వొస్తుంది. అంతెందుకు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గం నుంచి దివంగత, ఎమ్మెల్యే రామలింగారెడ్డి సుమారుగా 63వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అటువంటి దుబ్బాకలో ఇప్పుడు కమలం వికసించింది. లక్ష వో్ల• మెజారిటీయే లక్ష్యంగా పని చేసిన టిఆర్‌ఎస్‌కు దుబ్బాక వోటర్లు పరాయి నేతల పెత్తనం తమపై ఎందుకు అనుకున్నారో ఏమో కానీ, మొత్తానికి టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి, అభ్యర్థికి చుక్కలు చూయించారు. గత ఆగస్టు 6న రామలింగారెడ్డి చనిపోయింది మొదలుకుని ఈ ఉప ఎన్నికల్లో సోలిపేట కుటుంబానికి టికెట్‌ ఇవ్వొద్దంటూ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, క్యాడర్‌ ‌పార్టీ అధినేతకు చేరేలా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ, క్యాడర్‌ ‌మాటను పార్టీ నాయకత్వం చెవికెక్కించుకోలేదు. దీని ఫలితమే దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ వోటమికి ప్రధాన కారణమనీ పార్టీకి చెందిన నేతలు అంతర్గత చర్చల్లో మాట్లాడుకుంటుండటం గమనార్హం.
అభ్యర్థిని మార్చాలంటూ ఎన్ని వొత్తిళ్లు తేవాలో అన్ని వొత్తిళ్లు తెచ్చినా చివరకు అదే కుటుంబం నుంచి పార్టీ అధినేత అభ్యర్థిని ఖరారు చేయడం, ఎన్నిక బాధ్యతను మంత్రి హరీష్‌రావు తీసుకోవడంతో అప్పటి దాకా నిరసన గళమెత్తిన వారందరూ సైలెంటయ్యారు. పార్టీలోకి కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలకు చెందిన అనేక మందిని నేతలను తీసుకువచ్చారు. వీటికి తోడుగా నియోజకవర్గంలో రైతుబంధు, ఉచిత కరంటును, పింఛన్లు పొందుతున్న వారు సుమారుగా 70వేల వరకు ఉంటారు. వీరి అందరి వోట్లు కూడా గంపగుత్తగా తమకే పడుతాయనీ భావించారు. కానీ, టిఆర్‌ఎస్‌ ‌నేతల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. 2018లో రామలింగారెడ్డికి 63వేల మెజారిటీ వొచ్చింది. ఆయన మరణంతో సానుభూతి, దుబ్బాక నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, కొత్తగా ఇచ్చిన పింఛన్లు కలిపి మెజారిటీ 63వేల నుంచి 73వేలు, 83వేలు పెరగాలి. కానీ, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి వోడి…బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు గెలిచాడు. దీనికి కారణం..ఫస్టు చెప్పుకోవాలంటే అభ్యర్థి ఎంపిక. ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి ఎన్నికల వేళ తీసుకువచ్చిన నేతలకు పెద్దపీట వేయడం, ప్రాధాన్యత ఇవ్వడం. ఇంకో కారణం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలను స్థానిక నాయకులపై  ఇంఛార్జులుగా నియమించడాన్ని స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోయారు. అభ్యర్థిని మార్చాలని మొత్తుకుంటుంటే వినకపోగా..ఎన్నికల ప్రచారానికి మమ్మల్ని కాదనీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలతో ప్రచారం చేయించడాన్ని స్థానికంగా ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు అవమానంగా భావించారనీ సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఓటమికి అనేక కారణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టిఆర్‌ఎస్‌ ‌నాయకత్వం అనుకున్నట్లుగా రైతుబంధు, పింఛన్లు తీసుకునే వోట్లు కూడా ఆ పార్టీకి ఆశించినంతగా పడకపోగా…యువత వన్‌సైడ్‌గా పార్టీలకతీతంగా బిజెపికి వోట్లు వేయడం.. ఇవన్నీ చూసినప్పుడు, లోతుగా అధ్యయనం చేస్తే అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత దుబ్బాక నుంచి మొదలైనట్లుగా కనబడుతుంది.
రఘునందన్‌ ‌గెలపు ఎవరి భవిత్యావన్ని మారుస్తుంది?
గులాబీ కోటలో కమలం వికసించింది. కొన్నేళ్లుగా దుబ్బాకను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతోన్న టిఆర్‌ఎస్‌ ఆధిపత్యానికి రఘునందన్‌ ‌రావు గండి కొట్టారు. దుబ్బాక ప్రచారం మొత్తమూ మంత్రి హరీష్‌రావు చుట్టే తిరిగింది. ఎంతలా అంటే…. ‘నన్ను చూసి వోటెయ్యండి….నేను చూసుకుంటా’ సిద్ధిపేట, దుబ్బాక నాకు రెండు కళ్లు. సిద్ధిపేటను ఎలాగైతే అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానో దుబ్బాక నియోజకవర్గంను అంతేస్థాయిలో అభివృద్ధి చేస్తానంటూ పదే పదే ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్థి సుజాత అయినప్పటికీ మంత్రి హరీష్‌రావే అభ్యర్థి కంటే ఎక్కువగా నియోజకవర్గంలో పర్యటించారు. ప్రచారం చేశారు. చివరకు పండుగ(సద్దుల బతుకమ్మ) పూట కూడా మంత్రి హరీష్‌రావు దౌల్తాబాద్‌ ‌మండలంలో ప్రచారాన్ని చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసిన  టిఆర్‌ఎస్‌ అధిష్ఠానం కూడా పూర్తి బాధ్యతలను హరీష్‌రావు భుజ స్కంధాలపైనే మోపింది. అయినా సరే… దుబ్బాక ప్రజలు టిఆర్‌ఎస్‌ను తిరస్కరించి… కమలాన్ని నెత్తికెత్తుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా… హరీష్‌రావునే అధిష్ఠానం పంపేది. అహోరాత్రులు కష్టపడి హరీష్‌పార్టీని విజయ తీరాలకు చేర్చేవారు. కానీ, ఎందుకో ఏమో కానీ దుబ్బాక వోటర్లు మంత్రి హరీష్‌రావును కాదనీ, బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు వైపు మొగ్గు చూపి వోట్లేసి గెలిపించారు. అయితే, ఈఉప ఎన్నిక ఫలితం ఎవరి రాజకీయ భవితవ్యాన్ని మారుస్తుందన్నా చర్చ అప్పుడే రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఏది ఏమైనా ఈ ఉప ఎన్నిక ఫలితం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు, చేర్పులు తేవడం మాత్ర తథ్యమనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఫలించని హరీష్‌రావు కృషి..అందరికంటే నష్టం హరీష్‌రావుకే…
ఈ ఉప ఎన్నికల్లో అందరికంటే ఇంకా చెప్పాలంటే అభ్యర్థి సోలిపేట సుజాత కంటే ఎక్కువగా నష్టపోయింది ఎవరైనా ఉన్నారంటే…అది రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అని చెప్పాలి. ఈ ఎన్నికల్లో ఆయన ఊరూరు తిరిగారు. ఎన్నిక బాధ్యతను ఆయన భుజాపై వేసుకున్నారు. అయినప్పటికీ ఆయన కష్టానికి ఫలితం రాకుండా పోయింది. అయితే, ఇదే హరీష్‌రావు 2016లో నారాయణఖేడ్‌ ‌కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పటోళ్ల కృష్టారెడ్డి మరణించడంతో అక్కడ ఉప ఎన్నికల వొచ్చింది. అభ్యర్థి చనిపోతే ఆ స్థానాన్ని వారి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయాన్ని కాదని ఆ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌బరిలోకి దిగింది. ఈ ఎన్నికల బాధ్యతను నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ ‌రావు భుజాలకు ఎత్తుకున్నారు. ఊరూరా తిరిగి, సెంటిమెంట్‌కు ఎదురెళ్లి టిఆర్‌ఎస్‌ ‌కు భారీ విజయాన్ని అందించారు. ఆ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌ ‌రెడ్డి 53, 451వోట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇలా ఆయన వెళ్లిన ప్రతి చోటా ఘన విజయాలు సాధించిన హరీష్‌రావు… తాజా దుబ్బాక ఉప ఎన్నికల్లో వోటమిని మూటగట్టుకోవల్సింది. ఏదేమైనా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం హరీష్‌రావుకు విపరీతమైన నష్టమేననీ అని చెప్పాలి.
టిఆర్‌ఎస్‌ ‌పోస్టుమార్టం?
ఎవరూ ఊహించని విధంగా వచ్చిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అప్పుడే పోస్టుమార్టం మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.  ఎన్నికల వేళ…ఆ గ్రామాలు, మండలాలకు నియమించిన ఇంఛార్జుల నుంచి పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు కల్వకుంట్ల తారక రామారావు నివేదికను కోరినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. టిఆర్‌ఎస్‌, ‌బిజెపి మధ్య హోరాహోరీగా జరిగిన పోరులో చివరకు బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు 1470వోట్ల మెజారిటీతో గెలుపొందడంతో..అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకత్వంకు మింగుడుపడటం లేదనీ అత్యంతమైన విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తుంది.
నిజమైన విజయశాంతి వ్యాఖ్యలు….
దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సినీ నటి విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. సిఎం కేసీఆర్‌కు చేసిన హెచ్చరిక అచ్చంగా నిజమైంది. ఎవరు తీసిన గోతిలో వారే పడుతారనీ ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ‌పార్టీని బలహీనపర్చడానికి కేసీఆర్‌ ఆ ‌పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి, భయపెట్టి టిఆర్‌ఎస్‌లోకి చేర్చుకున్నారనీ, దీంతో మరో జాతీయ పార్టీ అయిన బిజెపి తెలంగాణలో బలపడిందన్నారు. కేసీఆర్‌కు సవాల్‌ ‌విసిరే స్థాయికి ఎదిగిందనీ, తాజాగా..మంగళవారం వెలువడిన దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని బట్టి చూస్తే విజయశాంతి అంచనా నిజమైందనీ చెప్పాలి.  కాంగ్రెస్‌ ‌భవిష్యత్‌ ‌కూడా ప్రశ్నార్థకంగా మారిందంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థికి కేవలం 21వేల వోట్లు మాత్రమే వొచ్చాయి. డిపాజిట్‌ ‌కూడా దక్కలేదు.

Leave a Reply