Take a fresh look at your lifestyle.

ఎన్నికల వేళ రెండు పార్టీలకు టిఆర్‌ఎస్‌ ‌చెక్‌

త్వరలో హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు జరుగనుండగా కాంగ్రెస్‌, ‌తెలుగుదేశం పార్టీలను గందరగోళంలో పడేసింది టిఆర్‌ఎస్‌. ఆ ‌పార్టీలకు చెందిన ముఖ్యనేతలను చేర్చుకోవడం ద్వారా ఒక విధంగా ఆ పార్టీలకు చెక్‌ ‌పెట్టినట్లైంది. అధికార పార్టీకి చెందిన ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుండి బర్తరఫ్‌ ‌చేయడంతో, ఆయన పార్టీ సభ్యత్వానికి, ఇతర పదవులతోపాటు శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఆ నియోజకవర్గంలో నిన్నటి వరకు తిరుగులేని నాయకుడిగా చెలామణి అవుతున్న ఈటల రాజేందర్‌ ఇప్పుడు భారతీయ జనతాపార్టీలో చేరడం, ఆ పార్టీ పక్షాన తిరిగి శాసనసభ్యత్వానికి పోటీపడుతుండడంతో ఇక్కడ రాజకీయాలు అనూహ్యమలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు ఈటలకు సమ ఉజ్జీగా ఉంటాడనుకున్న కాంగ్రెస్‌ ‌నేత పాడి కౌశిక్‌ ‌రెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో మరో అభ్యర్థి కోసం కాంగ్రెస్‌ ‌వెతుకులాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఈటలతో పోటీపడి ఓటమిని చవిచూసిన కౌశిక్‌రెడ్డి ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో తనకే టికెట్‌ ‌వొస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తూ వొచ్చాడు. కాని, ఆయనకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు రాష్ట్రంలో వైరల్‌గా మారింది. తనకు టిఆర్‌ఎస్‌ ‌టికెట్‌ ‌తప్పనిసరిగా వొస్తుందని చెప్పిన మాటలు కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చాయి. ఇంతకు క్రితం కూడా కౌశిక్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నాడన్న వార్తలు విస్తృతమయ్యాయి. అయితే అందులో ఏమాత్రం నిజంలేదని కౌశిక్‌రెడ్డి కొట్టిపారేశాడు. కాంగ్రెస్‌ ‌నుండి తానే క్యాండిడేటునని ప్రచారం చేసుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో ఆయన మంత్రి కెటిఆర్‌తో ఒక ఫంక్షన్‌లో సమావేశమైనట్లు వొచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేయలేదు. సరికదా నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడటానికి వెళ్ళినట్లు చెప్పుకొచ్చాడు. కాని, తనకే టిఆర్‌ఎస్‌ ‌టికట్‌ ‌వొస్తుందని నమ్మకంగా ఓ మిత్రుడితో పేర్కొన్న ఆడియో ఇప్పుడు హల్‌చల్‌ ‌చేయడం, ఆ తర్వాత కాంగెస్‌ ‌పార్టీ ఆయనకు షోకాజ్‌ ‌నోటీస్‌ ఇవ్వడం, ఆ తర్వాత ఆయర కాంగ్రెస్‌ ‌పార్టీక• రాజీనామా చేయడం చకచకా జరిగిపోడంతో రాజకీయంగా పరిణామాలు మారే అవకాశం ఏర్పడింది.

గత కొంతకాలంగా కౌశిక్‌రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని టిపిసిసి క్రమశిక్షణా సంఘం పేర్కొంది. దీనిపై గతంలోనే పార్టీ ఆయన్ను వారించినా తన పద్దతిలో మార్పు లేక పోవడంవల్లే షోకాజ్‌ ‌నోటీసు ఇవ్వాల్సి వొచ్చిందని క్రమశిక్షణ సంఘం పేర్కొంటుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ క్యాడర్‌ను కూడా పార్టీ మారేందుకు రహస్యంగా ప్రోత్సహించడంలో భాగంగా, పార్టీ మారేవారికి  డబ్బులు ఎరవేయాలన్న తన ఆలోచనను మరో వ్యక్తితో పంచుకున్న తీరు ఇప్పుడు వైరల్‌ అవుతున్న వీడియోలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని కూడా ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పిన ఆ క్లిప్పింగ్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ ‌వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నది.

కాంగ్రెస్‌ ‌పార్టీకి నిన్నటివరకు అధ్యక్షుడిగా క•నసాగిన కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కౌశిక్‌రెడ్డి సమీప బంధువుకూడా. ఆయన కారణంగానే గత ఎన్నికల్లో కౌశిక్‌రెడ్డికి టికెట్‌ ‌లభించిందంటారు. తాజాగా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని చేపట్టిన రేవంత్‌రెడ్డికి ఇప్పుడు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అ:శం మొదటి సవాల్‌గా మారింది. దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదివేచి చూడాల్సి ఉంది.

ఇదిలాఉంటే  తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖను కూడా టిఆర్‌ఎస్‌ ‌గందరగోళంలో పడేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడినే తన వైపు తిప్పుకోవడం ఆ పార్టీకి పెద్దగా షాకిచ్చినట్లైంది. గడచిన ఏడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నుండి అనేకమంది నాయకులు వివిధ పార్టీల్లో చేరినప్పటికీ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న ఎల్‌. ‌రమణ, పార్టీని పూర్వపు స్థితికి తీసుకురావడానికి తీవ్రంగా కృషిచేశారు. ఈ విషయంలో ఆయన చంద్రబాబునాయుడిని మెప్పించారు కూడా. చంద్రబాబు నాయుడికి రమణ మీద పూర్తి విశ్వాసం ఏర్పడింది. అయితే ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ మారడమే శ్రేయస్కరంగా ఎల్‌. ‌రమణ భావించినట్లు తెలుస్తున్నది. తాజాగా ఆయన టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సభ్యత్వాన్ని కూడా తీసుకున్నారు. ఇక త్వరలో గులాబి కండువ కప్పుకోవాల్సి ఉంది. ఇందుకు ఈ నెల 16న సుముహూర్తం నిర్ణయించినట్లు కూడా వార్తలు వొస్తున్నాయి. అసలే తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న ఈ పార్టీకిప్పుడు సారథిని వెతుక్కునే దుస్థితికి చేరుకుంది. దాంతోపాటు హుజురాబాద్‌ ఉప ఎన్నికకు  కాంగ్రెస్‌, ‌బిజెపితోపాటు అధికార పార్టీల అభ్యర్థులను ధీటుగా ఎదుర్కుని నిలబడే అభ్యర్థిని అన్వేషించుకోవడం కూడా ఇప్పుడా పార్టీకి పెద్ద సవాలుగామారింది.

Leave a Reply