Take a fresh look at your lifestyle.

టీఆర్‌ఎస్‌, ‌బీజెపీ పరస్పర ఆరోపణలు.. గందరగోళంలో ప్రజలు

రాష్ట్రంలో అధికారంలోఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌), ‌కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా(బిజెపి)పార్టీల మధ్య కొనసాగుతున్న మాటలయుద్దం ఇటీవల తీవ్ర స్థాయికి చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోలేకపోయిందని టిఆర్‌ఎస్‌ ఆరోపిస్తుండగా, కేంద్రం ప్రకటించిన పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ బిజెపి రాష్ట్ర నాయకత్వం ఆరోపిస్తున్నది. రాష్ట్రంలో తాజాగా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల ప్రచార సమావేశాల్లో ఈ రెండు పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. కేంద్రంనుండి పథకాలు, నిధులు తేవడంలో బిజెపి రాష్ట్ర నాయకత్వం ఏమాత్రం చొరవ చూపించడంలేదని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ విమర్శిస్తుంటే, వొచ్చిన ప్రాజెక్టులకు కావాల్సిన ప్రాథమిక అవసరాలను సమకూర్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్ర నాయకత్వం ఆరోపిస్తున్నది.

మొత్తానికి కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అటు రాష్ట్ర సర్కార్‌, ఇటు కేంద్ర సర్కార్‌ అనుకున్నంతగా భాగస్వామి కాలేకపోయారన్నది దీనివల్ల స్పష్టమవుతోంది. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోఉన్నా నిధుల వితరణ విషయంలోనైతేనేమీ, ప్రాజెక్టుల ఏర్పాటులో నైతేనేమీ దేశ ప్రజలను ఆదుకోవడానికేనన్న ప్రాధమిక విషయానికన్నా రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమయ్యే విధంగా ఈ పార్టీలు విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నాయి. తెలుగు ప్రాంతం రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన నాడు కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉంది. కేంద్రంలో సర్కార్‌ ‌మారినంత మాత్రాన వాటికి కాలదోషం పట్టించడం న్యాయంకాదు.

కాని, కేంద్రం తన హామీ నిలుపుకోకపోవడంతో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల పురోగతికి అవరోధం ఏర్పడుతున్నది. ఐటి హబ్‌గా ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్న హైదరాబాద్‌లో ఇన్‌ఫర్‌మేషన్‌ ‌టెక్నాలజీ ఇన్‌వెస్ట్‌మెంట్‌ ‌రీజియన్‌(ఐటిఐఆర్‌)‌ను ఏర్పాటు చేస్తామని నాటి, నేటి కేంద్ర ప్రభుత్వాలు ముందస్తుగా ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. ఇవ్వాళ రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి దారితీసింది కూడా అదే. వాస్తవానికి ఎప్పుడో 2008లోనే ఈ ప్రాజెక్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖతను వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నెలకొల్పాలనుకున్న ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర విభజనానంతరం కేంద్రంలో అధికారంలోకి వొచ్చిన బిజెపి ప్రభుత్వం దీన్ని సమీక్షించి, మరింత మేలైన పథకాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే ప్రపంచ దేశాల్లోని ఐటి దిగ్గజాలను ఆకర్షిస్తున్న హైదరాబాద్‌లో త్వరలోనే దీని రూపకల్పన జరుగుతుందని భావించారు. తెలంగాణ సర్కార్‌ ‌కూడా హైదరాబాద్‌లోని ఐటి విస్తరణ ప్రాంతాల్లో ఇందుకోసం 49వేల ఎకరాల భూమిని సేకరించి సిద్ధం చేసింది కూడా. ఇప్పుడున్న వాటికి తోడు మరిన్ని కొత్త కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మార్గం సులభమవుతుందని భావించింది. అయితే ఇందుకోసం మొదటి దశలో కేంద్రం కేటాయించిన 165 కోట్లకు అదనంగా మరిన్ని నిధులను కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ విషయమై అనేక సార్లు కేంద్రానికి లేఖలు రాసినట్లు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ అందుకు కావలసిన రైలు, రోడ్డు మార్గాలను అధునీకరించేందుకు వాటిని వినియోగించాల్సిన అవసరముందని చెబుతున్నది.

కాని, రాష్ట్ర బిజెపి నాయకత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను, కేంద్రాన్ని తప్పుతోవ పట్టిస్తున్నదని ఆరోపిస్తోంది. హైదరాబాద్‌ ‌చుట్టూ వివిధ క్లస్తర్లలో ఐటి, హార్డ్‌వేర్‌ ‌పరిశ్రమల ఏర్పాటు జరిగి, వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్న ఈ ప్రాజెక్టు ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని తూర్పార పడుతున్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతో ఈ ప్రాజెక్టుకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలను కూడా రాష్ట్ర సర్కార్‌ ‌కలిగించలేకపోతున్నదన్నది ఆయన ఆరోపణ. విచిత్రమేమంటే కేంద్ర మంత్రి రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ఈ ‌ప్రాజెక్టు విషయంలో కేంద్రం వెనక్కు తగ్గిందని సాక్షాత్తు పార్లమెంటులోనే ప్రకటన చేసిన విషయాన్ని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెబుతుండడం చూస్తుంటే, ఎవరి మాటల్లో వాస్తవమెంత అన్న ఆలోచనలో రాష్ట్ర ప్రజలున్నారు.

కేవలం ఎన్నికల్లో వోటర్లను ఆకట్టుకునేందుకే వీరీవిధంగా పోటీ పడి ప్రకటనలు గుప్పించుకుంటున్నారేగాని, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకువొచ్చే విషయంలో పోటీ పడకపోవడంపట్ల రాష్ట్ర ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన అనేక హామీలను కేంద్రానికి తరచు రాష్ట్రం గుర్తు చేస్తూనే ఉంది. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఖాజీపేట రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ విషయాన్ని అయితేనేమీ, ములుగులో ఏర్పాటు చేస్తామన్న గిరిజన విశ్కవిద్యాలయం విషయంలోనైతేనేమీ రాష్ట్రం లేఖల ద్వారా, ప్రత్యక్షంగా కేంద్రానికి విన్నవించుకుంటోంది. వీటి కోసం కావాల్సిన భూమినికూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, ప్రత్యేకించింది కూడా. అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఆరేళ్ళుగా చేస్తున్న విజ్ఞప్తులపై ఇంతవరకు కేంద్రం స్పందించనేలేదు. ఐటిఐఆర్‌ ‌ప్రాజెక్టుతోపాటు కేంద్రం ఈ ప్రాజెక్టులన్నిటిపైన ఇప్పటికి స్పందించి ఉంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలావరకు తీరేదంటున్నారు రాష్ట్రంలోని నిరుద్యోగులు.

Leave a Reply