Take a fresh look at your lifestyle.

టిఆర్‌ఎస్‌ – ‌బిజెపి ప్రత్యక్ష యుద్ధమేనా? మాట మాత్రానికే ముక్కోణ పోటీ

“ఈ ‌జి హెచ్‌ఎం‌సి ఎన్నికలను బిజెపి తమ భవిష్యత్తుకు పునాదులేసుకుంటుండగా, టి ఆర్‌ ఎస్‌ ‌ప్రస్తుత పునాదులను మరింత పటిష్ఠం చేసుకునే పక్రియలో మునిగిపోయింది. నగరం పట్టును వీడకుండా రాష్ట్ర, జాతీయస్థాయిలో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఎంఐఎం కృషి చేస్తున్నది. ఇక గత వైభవం మాత్రం మిగిలిన కాంగ్రెస్‌, ‌తెలుగుదేశం పార్టీలు ఉనికి నిలబెట్టుకునే కసరత్తులో మునిగిపోయాయి. కమ్యూనిస్టులు ఉన్నామనిపించుకుంటుండంగా, గతంలో నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం ఉన్న కొన్నిపార్టీలు కనుమరుగయ్యాయి.”

నందిరాజు రాధాకృష్ణ
ఒక స్థానిక ఎన్నికకు ఇంత హంగామా, ఇంత రాధ్హాంతమా.? గతంలో గ్రామ పంచాయతీ నుంచీ నగరపాలక సంస్థల వరకూ ఎన్నో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కేవలం స్థానికుల ప్రమేయం మినహా ఎమ్మెల్యేల ప్రమేయం కూడా ఉండేది కాదు. పార్టీల ప్రస్తావనే ఎరుగరు. అటువంటిది ఈసారి హైదరాబాద్‌ ‌మహానగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికలు మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు చావో రేవో గా భావిస్తున్నాయో ఓటర్లకు అర్ధం కావడంలేదు. ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ ఒక నగర పార్టీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాకరంగా భావిస్తూ పార్లమెంట్‌ ఎన్నికల స్థాయిలో ప్రచారం చేస్తూ, మానిఫెస్టోలు ప్రకటిస్తూ తాము నిద్ర పోకుండా ప్రత్యర్ధులకు నిద్ర లేకుండా, ప్రజలను నిద్ర పోనీకుండా వీరంగం సృష్టిస్తున్నాయి.

ఈ జి హెచ్‌ ఎం ‌సి ఎన్నికలను బిజెపి తమ భవిష్యత్తుకు పునాదులేసుకుంటుండగా, టి ఆర్‌ ఎస్‌ ‌ప్రస్తుత పునాదులను మరింత పటిష్ఠం చేసుకునే పక్రియలో మునిగిపోయింది. నగరం పట్టును వీడకుండా రాష్ట్ర, జాతీయస్థాయిలో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఎం ఐ ఎం కృషి చేస్తున్నది. ఇక గత వైభవం మాత్రం మిగిలిన కాంగ్రెస్‌, ‌తెలుగుదేశం పార్టీలు ఉనికి నిలబెట్టుకునే కసరత్తులో మునిగిపోయాయి. కమ్యూనిస్టులు ఉన్నామనిపించుకుంటుండంగా, గతంలో నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం ఉన్న కొన్నిపార్టీలు కనుమరుగయ్యాయి. నిన్న మొన్నటివరకు సఖ్యతగా, సమస్యలకే పరిమితమై పరస్పరం సుహృధ్భావం ప్రదర్శించుకున్న రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధినాయకులు సైతం కేవలం స్థానిక ఎన్నికలసమయంలో బద్ధ విరోధులుగా ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలతో చౌకబారు ప్రచారాలకు పాల్పడటం విజ్ణులైన ఓటర్లు గమనిస్తునే ఉన్నారు. బి.జె.పి – టి.ఆర్‌.ఎస్‌. ‌తమ ఆర్ధిక, మానవ వనరులన్నిటినీ రంగంలో దింపాయి.

ఎన్నికల ప్రచారానికి టి ఆర్‌ ఎస్‌ 17 ‌మంది మంత్రులను, 85 మంది ఎమ్మెల్యేలను, 32 మంది ఎమ్మెల్సీలను, 14 మంది ఎంపీలను.. ఇతరత్రా పదవుల్లోఉన్న వారందరినీ ప్రచారంలో చాపకింద నీరులా దించేసింది. కోటలో ఆసీనులైన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు అన్నీ తానై వ్యూహరచన చేస్తూ కింది శ్రేణులకు ఆదేశాలు ఆదేశాలు జారి చేస్తుండగా, ఆయన కుమారుడు, రాష్ట్రమంత్రి కె తారకరామారావు ప్రత్యక్షంగా ఎన్నికల రంగంలో సైనిక శ్రేణికి నాయకుడై వ్యవహరిస్తున్నారు. దుబ్బాకలో విశ్వరూపం ప్రదర్శించిన మంత్రి కె హరీష్‌ ‌రావు ఆర్భాట, పటాటోపం కనబడకుండా తన ప్రాంతానికి పరిమితమయ్యారు. సచివులు, ఇతరులు గ్రేటర్‌ ‌పరిధిలోని అన్ని శాసన సభ నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రంగంలో ఉన్న సిటింగ్‌ ‌కార్పొరేటర్లు ఫలితాలు తమకు పునర్జన్మ అన్నట్లు శ్రమిస్తున్నారు
ఇక బిజెపి తనకున్న శక్తియుక్తులను ప్రదర్శిస్తూ, బిజెపి రాష్ట్రంలో తనకున్న బలగం అంతటినీ రంగంలో నింపేసింది. కరీంనగర్‌ ఎం‌పి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ప్రత్యక్ష పర్యవేక్షణలో కేంద్ర హోమ్‌ ‌సహాయమంత్రి జి కిషన్‌ ‌రెడ్డి, ఎంపీలు అర్వింద్‌ ‌ధర్మపురి, సోయం బాబూ రావు, ఇటీవల దుబ్బాకనుంచీ ఎన్నికైన రఘునందనరావు ఒక ఎం.ఎల్‌.‌సి. ఎన్‌. ‌రామచంద్రరావు, డి కె అరుణ స్థానిక కేడర్లు అహరం శ్రమిస్తున్నారు. ఇప్పటికి కేంద్ర మంత్రి జవదేకర్‌, ‌బిజెవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, రాష్ట్ర అధ్యక్షుడు జి భరత్‌ ‌కుమార్‌ ‌కార్పొరేషన్‌ ‌పరిధిలో విస్త్రుత పర్యతనలు చేస్తూ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. పార్టీ లో అత్యంత కీలక వ్యక్తి కేంద్ర, హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షాను, పార్టీ అధ్యక్షుడు జగత్‌ ‌ప్రకాష్‌ ‌నడ్దాను, వీలైతే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారు.

ఎన్నికల్లో కీలక శక్తిగా ప్రాధాన్యత సంచరించుకున్న ఎం.ఐ.ఎం ముఖ్యంగా పాతబస్తీకి పరిమితమై పర్టీకి సర్వం తానైన ఎం.పి, పార్టీ అధ్య్క్షుడు అసదుద్దిన్‌ ఒవైసీ నేతృత్వంలో ఆ పార్టీ ఏడుగురు ఎమ్మెల్యేలు అహ్మద్‌ ‌బీన్‌ అబ్దుల్లా బలాల, జాఫర్‌ ‌హుస్సైన్‌, ‌కౌసర్‌ ‌మొహియుద్దిన్‌, ‌ముంతాజ్‌ అహ్మద్‌ ‌ఖాన్‌, అక్బరుద్దిన్‌ ఒవైసి, సయ్యద్‌ అహ్మద్‌ ‌పాషా ఖాద్రి, మహమ్మద్‌ ‌మౌజంఖాన్‌, ఇరువురు ఎం.ఎ.సి.లు మీర్జా రియాజ్‌ ఉల్‌ ‌హసన్‌, ‌సయ్యద్‌ అమినుల్‌ ‌హసన్‌ ‌జాఫ్రి, సిటింగ్‌ ‌కౌన్సిలర్లు.. ఎం.ఐ.ఎం. పోటీలో ఉన్న 51 డివిజన్లలో ప్రచారంలో తలమునకలై తమ ఆధిపత్యం నిలుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎన్నికల్లో ఎం ఐ ఎం – తె రా స మిత్ర పక్షాలని అందరికీ తెలిసిన విషయం కాబట్టి, బిజెపి ఎత్తుగడ ఎదుర్కోనే ఉమ్మడి వ్యూహంలో భాగంగానే తమకెటువంటి పొత్తులు లేవని ఇరుపార్టీల నేతలు ప్రకటించారని, అంతర్గత అవగాహనతోనే ఉభయ పార్టీల నాయకులు పరస్పరం సవాళ్ళు విసురుకుంటున్నారని ఓటర్ల్లకు అర్ధమై గుంభనంగా ఉన్నారు.

ఇక కాంగ్రెస్‌ ‌విషయానికోస్తే పరువు నిలబెట్టుకోవాడానికట్లు పోటెలో ఉన్నా ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్‌ ‌రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపి రేవంత్‌ ‌రెడ్డి చేరో దిక్కులో విడివిడి ప్రచారాల్లో మునిగిపోయారు. గాంధీ భవన్‌ ‌సమావేశాలకు పరిమితమైన నాయకులు కొందరు కాగా, ఇరువురు నేతల వెనుక రెండు బృందాలుగా కార్యకర్తలు విడిపోయారు. ఎన్నికల బాధ్యతల్లో ప్రకటించిన మల్లు భట్టివిక్రమార్క, పొన్నం ప్రభాకర్‌, ‌జీవన్‌రెడ్డి ప్రచార ప్రభావం కనభడలేదు. భాగ్యనగరంలో పట్టుకోల్పోయిన తెలుగుదేశంలో ఓటర్లను ప్రభావితం చేసే స్థాయి నాయకులెవరూ కనబడడక వాతావరణం స్తబ్దుగా ఉంది. ఇక పరిమితంగా పోటీ చేస్తున్న ఉభయ కమ్యూనిస్ట్ ‌పార్టీల చప్పుడే ఇప్పటివరకూ వినబడడంలేదు. పార్టీ నేతలెవరూ రంగంలోకి దిగిన దాఖలాలు లేవు. ఊరేగింపులు, ఇంటింటి సందర్శనలతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల కమిషన్‌ ‌ప్రకటించిన ఖరారైన అభ్యర్ధుల జాబితా ప్రకారం టి ఆర్‌ ఎస్‌ 150, ‌బి జె పి 149, కాంగ్రెస్‌ 146, ‌టి డి పి 106, ఎం ఐ ఎం 51, సి పి ఐ 17, సి పి ఎం 12 డివిజన్లలో పోటీ లో నిలవగా ఇతర పార్టీలు 76, ఇండిపెండెంట్లు 415 డివిజన్లలో బ్యాలెట్‌ ‌పేపర్‌ ‌పై మిగిలారు. డిసెంబరు 1వ తేదీన 74 లక్షల ఓటర్లు అభ్యర్ధుల భవితవ్యం తేల్చాల్సి ఉంది.

Leave a Reply