గతంలో చెప్పిందే ఇప్పుడు నిజమైందన్న రాములమ్మ
తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి మరోమారు టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతేడాది తాను చెప్పిందే ఇప్పుడు జరిగిందంటూ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ మేరకు గతేడాది డిసెంబరు 4న ఫేస్బుక్లో తాను చేసిన పోస్టుకు తాజాగా విమర్శలు జోడించి మరో పోస్టు షేర్ చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు రెండు సియామీ కవలలని తాను ఆ రోజు చెప్పానని, టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి ఇప్పుడు దానిని నిజం చేశాయని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 100 డివిజన్లలో గెలుస్తామని బీరాలు పలికిన టీఆర్ఎస్ నేతలు చివరికి మూడో వంతు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని డిసెంబరు 4 నాటి ఫేస్బుక్ పోస్టులో విజయశాంతి పేర్కొన్నారు.
విపక్షాలకు సమయం ఇవ్వకుండా రోజుల వ్యవధిలోనే ఎన్నికలకు వెళ్లి కుట్ర చేశారని ఆరోపించారు. తక్కువ సీట్లు వచ్చినా మేయర్ పదవికి వచ్చిన ఢోకా లేదని, ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారని అన్నారు. కానీ, ఎంఐఐ మద్దుతు లేకుండా టీఆర్ఎస్కు మేయర్ పదవి దక్కేలా లేదని పేర్కొన్నారు.ఇన్నాళ్లూ కవలల్లా ఉంటూ వచ్చిన ఈ పార్టీలకు ’కమల’ పరీక్ష ఎదురైందని ఎద్దేవా చేశారు.
మేయర్ పదవి విషయంలో ఎంఐఎం మద్దతు లేదని టీఆర్ఎస్, తాము తల్చుకుంటే సర్కారును రెండు నెలల్లో కూల్చుతామని ఎంఐఎం బీరాలు పలికాయని, చివరి వరకు ఈ రెండు పార్టీలు ఇదే మాటపై ఉంటాయా? అని ప్రశ్నించారు. చివరికి కవలల అసల రంగు బయటపడుతుందని అన్నారు. అప్పుడు తాను చెప్పినట్టుగానే ఇప్పుడు జరగడంతో నాటి విషయాన్ని గుర్తు చేస్తూ విజయశాంతి తాజాగా మరో పోస్టు చేశారు.