Take a fresh look at your lifestyle.

హామీల పేరుతో… వోట్లు దండుకోవడమే టీఆర్‌ఎస్‌ ‌లక్ష్యం

  • ఆదాయం కోసం ఆస్తులమ్మితే ఉన్న పంచె ఊడుతుంది
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌

ఎన్నికల సమయంలో హామీలిచ్చి ఓట్లు దండుకోవడం, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడమే టీఆర్‌ఎస్‌ ‌లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ‌కె.ల్మణ్‌ ‌విమర్శించారు. రాష్ట్రంలో ఆర్దిక మందగమనం అంటూ ఏమీ లేదనీ, ఉన్నదంతా కేసీఆర్‌ ‌మందగమనమేననీ, మాంద్యానికి కారణం కేసీఆర్‌ ‌కుటుంబ దోపిడీయేనని వ్యాఖ్మానించారు. సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు మల్లారెడ్డి, యోగానంద్‌తో కలసి ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వచ్చే ఏడాది రూ.35, 500 కోట్ల అప్పులు చేస్తామని బడ్జెట్‌లో చెప్పారనీ, అంటే రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోని నెట్టివేయనున్నారని పేర్కొన్నారు. ఉన్న ఆస్తులను ఇలాగే అమ్ముకుంటూ పోతే చివరికి ఉన్న పంచె కూడా ఊడుతుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఓవైపు దేశంలో ఆర్థిక మాంద్యం ఉందని అంటూనే మాంద్యం లేనట్లు బడ్జెట్‌ ‌గణాంకాలు ప్రవేశపెట్టడం ఏమిటని ప్రశ్నించారు.

ఆర్థిక మాంద్యం ఉందట…వృద్ధి రేటు బాగుందట…అయినా, ఆదాయం పెరిగిందట వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 40 వేల కోట్లు ఆదాయం ఎలా సమకూరుతుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న ఆదాయ వనరులను సద్వినియోగం చేసుకోవడం, కొత్త వనరులను సృష్టించుకోవడంపై దృష్టి సారించకుండా ఉన్న ఆస్తులను అమ్ముకోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇక నుంచీ వాస్తవ బడ్జెట్‌ ‌ప్రవేశపెడతామని ఆర్నెల్ల కింద చెప్పిన సీఎం కేసీఆర్‌ ఆర్తిక మందగమనం సాకుగా చూపి రూ. 40 వేల కోట్లు తగ్గించారనీ, మరి ఇప్పుడు ఆరు నెలల కాలంలోనే ఆర్థిక మందగమన పరిస్థితులు కొలిక్కి వచ్చేశాయా ? రాష్ట్రంలో పరిస్థితులన్నీ బాగుపడిపోయాయా ? అని నిలదీశారు.

నిరుద్యోగ భృతి పేరిట గత ఏడాది బడ్జెట్లో రూ. 1810 కేటాయించి అందులో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదనీ, కనీసం మార్గదర్శకాలు కూడా సిద్ధం చేయలేదని ఆరోపించారు. ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను కూడా ప్రభుత్వం అత్యంత దారుణంగా మోసం చేసిందనీ, వారికి పీఆర్సీ కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నదని విమర్శించారు. ఈ బడ్జెట్లో కూడా పీఆర్టీసికి సంబంధించిన ప్రస్తావనే లేదనీ, ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడానికి సంబంధించి వారితో కలసి ఉద్యమ పథంలో నడుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు పాలక వర్గాలను నియమించకుండా వాటిని నిర్వీర్యం చేశారనీ, 2017లో ఓఆర్‌ఆర్‌లోని గ్రామాలన్నింటికీ మిషన్‌ ‌భగీరథ నీటిని ఇస్తానన్న హామీని నెరవేర్చకుండానే గత ఎన్నికలలో ఓట్లు ఎలా అడిగారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు రాష్ట్రంలో సాగునీటి రంగంపై మోజు తగ్గిపోయిందనీ, గత బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్లు కేటాయించి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.11000 కోట్లకు కుదించారన్నారు. సీఎం కేసీఆర్‌కు రావాల్సిన కమీషన్లన్నీ అందాయనీ, అందుకే ఆయన బడ్జెట్లో సాగునీటి రంగానికి అతి తక్కువ స్థాయిలో నిధులు కేటాయించారని ఈసందర్భంగా లక్ష్మణ్‌ ‌విమర్శించారు.

Leave a Reply