Take a fresh look at your lifestyle.

రంగంలోకి ‘ట్రబుల్‌ ‌షూటర్‌’..?

‌పోతిరెడ్డిపాడుపై…హరీష్‌ అ‌స్త్రం ప్రయోగిస్తున్న కేసీఆర్‌

తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం ప్రారంభమైంది. పోతిరెడ్డిపాడు అంశం ఈ తాజా వివాదానికి కారణమైంది. ఇదే అంశంపై రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు రాష్ట్రాల మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా స్నేహ సంబంధాలు నెలకొన్నాయి. విభజన సమస్యలు మొదలుకొని ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఏ సమస్య అయినా తామే పరిష్కరించు కోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌ ‌గతంలో పలు అంశాలపై చర్చించుకున్న సందర్భంగా ఒక నిర్ణయానికి వచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు కోసం కొత్త ఎత్తి పోతల పథకాన్ని చేపట్టాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. పోతిరెడ్డిపాడు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమకు తాగునీటి సరఫరా కోసం రోజుకు మూడు టీఎంసీల నీటిని సరఫరా చేసేలా ఏపీ ప్రభుత్వం జీవో 203ని జారీ చేసింది. అంతేకాకుండా ఈ  ప్రాజెక్టు నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి సైతం జారీ చేసింది.

ఈ క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం మరింతగా రాజుకుంది. జగన్‌ ‌నిర్ణయం ఏపీలో సీఎం జగన్‌కు పూర్తిగా మైలేజి పెంచేదిగా ఉండగా, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మాత్రం ఇది రాజకీయంగా తలనొప్పిగా తయారైంది. అందివచ్చిన అవకాశంగా భావించిన రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌, ‌బీజేపీ, టీజేఎస్‌, ‌వామపక్ష పార్టీలు సీఎం కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ‌నిర్లక్ష్యం కారణంగా ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడుపై కొత్త ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందని ధర్నాలు, దీక్షలతో తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌  ‌మంత్రి టి.హరీష్‌రావును రంగంలోకి దింపారు. గతంలో భారీ నీటిపారుదల శాఖను నిర్వహించిన హరీష్‌ ‌రావుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని నదులు, నీటి లభ్యతతో పాటు సాగు, తాగు నీటి వనరులపై స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన హయంలో పలు భారీ సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి కావడంతో పాటు మిషన్‌ ‌భగీరథ ప్రాజెక్టును కూడా దాదాపుగా పూర్తి చేశారు. ఈ కారణంగానే పోతిరెడ్డిపాడు విషయంలో హరీష్‌ను రంగంలోకి దింపాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఈ అనుభవంతోనే హరీష్‌ ‌పోతిరెడ్డిపాడుపై ఏపీ ప్రభుత్వం కొత్త ఎత్తిపోతల పథకం ద్వారా రాష్ట్రానికి జరుగనున్న అన్యాయంపై గొంతెత్తారు. 805 అడుగుల స్థాయిలో లిఫ్ట్ ‌పెడుతున్నారంటే తెలంగాణపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఏమిటో అర్థమవుతున్నదని కుండబద్దలు కొట్టారు. కృష్ణా నదీ యాజమాన్యాల బోర్డు అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతున్నదనీ, గతంలోనే ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు అంశానికి సంబంధించి  పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాల విమర్శల నుంచి గట్టెక్కించే విధంగా వ్యవహరించే విధంగా హరీష్‌రావుకు తెరవెనక సీఎం కేసీఆర్‌ ‌మార్గనిర్దేశం చేస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్గాలలో చర్చ జరుగుతున్నది.

Leave a Reply