- మానవ హక్కులకు విఘాతం కల్గిస్తున్నాయి
- నోటీసులు జారీచేసిన జాతీయ మానవహక్కుల కమిషన్
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం తీసుకోచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన దీక్ష ఇప్పటికే పలుసార్లు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. రాజస్థాన్, హరియాణా, యూపీ సహా కేంద్ర ప్రభుత్వానికి తాజాగా నోటిసులు జారీచేసింది. ఈ ఆందోళనలు మానవ హక్కులకు విఘాతం కల్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే కమిషన్ ఈ ఆందోళన ప్రభావాన్ని ముదింపు చేయాలని ఆదేశిస్తుందని తెలిపింది. రైతుల ఆందోళనల కారణంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి చాలాదూరం ప్రయాణించాల్సి వొస్తుందని ప్రజలు ఆరోపించారు. రాష్ట్ర సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతుల ఆందోళనలపై యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ ప్రభుత్వ ఎన్సిటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్లు, యూపీ, హర్యానా, రాజస్థాన్ కమిషనర్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీనిపై వెంటనే నివేదికలు సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ జారీ చేసిన నోటీసుల్లో ఆదేశించింది.
శాంతియుత పద్ధతుల్లో ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసే ఆందోళనలు కమిషన్ గౌరవిస్తుందని తెలిపింది. కాగా, పారిశ్రామిక రంగంపై ఆందోళనల ప్రభావాన్ని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్’ లెక్కించి అక్టోబర్ 10 లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అదే విధంగా, కోవిడ్-19 ప్రోటోకాల్ ఉల్లంఘనల ప్రభావాన్ని‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ’ కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక రూపంలో అందించాలని తెలిపింది. గతంలో ఆందోళన జరిగే ప్రదేశం వద్ద మానవ హక్కుల కార్యకర్త గ్యాంగ్ రేప్‌కు గురైన ఘటనపై ఝజ్జర్ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రైతుల ఆందోళనల కారణంగా సాధారణ ప్రజా జీవనానికి, జీవనోపాధికి కల్గిన విఘాతంపై ‘ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్’(యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ) అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశాలను జారీచేసింది.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) కేంద్రంతోపాటు రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. రైతుల నిరసనలతో 9 వేల కంటే ఎక్కవ చిన్న, మధ్యతరహా, పెద్ద కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. రైతుల నిరసనలతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రయాణికులు, రోగులు, దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల నిరసనలపై జాతీయ మానవహక్కుల కమిషన్‌కు పలు ఫిర్యాదులు రావడంతో దీనిపై తగు చర్యలు తీసుకుని నివేదికలు సమర్పించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది.