నేడు తృణముల్ – భారతీయ జనతా పార్టీలు ప్రధాన శత్రువులుగా తయారైన వేళ ఎన్నికలు జరుగ నున్నాయి. తృణముల్ కోటలో భాజపా పాగా వేయడానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. రెండు పార్టీల ముమ్మర ప్రచారాలు, పార్టీ మార్పిడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల బెంగాల్లో పర్యటించిన అమిత్ షా సమక్షంలో తృణముల్ ప్రముఖ నాయకులు మంత్రి సుదేంధు అధికారి, యంపి సునిత్ మోండల్, తృణముల్ యంయల్ఏలు, కమ్యూనిష్టులు, కాంగ్రేస్ నాయకులు క్యూకట్టి భాజపాలో చేరి రాజకీయ కాక పుట్టించారు. ఈ ఏడాది మే నెలలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. తృణముల్, భాజపా, సిపిఎం, కాంగ్రేస్ పార్టీలు ఎన్నికలలో గెలవడానికి ఎత్తులు, పై ఎత్తులు ఎప్పుడో మొదలెట్టాయి. నాడు అటల్ బిహారి వాజ్పాయ్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో తృణముల్ నేత మమతా బెనర్జీ కేంద్రమంత్రిగా పని చేశారు. అయితే నేడు తృణముల్ – భారతీయ జనతా పార్టీలు ప్రధాన శత్రువులుగా తయారైన వేళ ఎన్నికలు జరుగ నున్నాయి. తృణముల్ కోటలో భాజపా పాగా వేయడానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. రెండు పార్టీల ముమ్మర ప్రచారాలు, పార్టీ మార్పిడులు జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవల బెంగాల్లో పర్యటించిన అమిత్ షా సమక్షంలో తృణముల్ ప్రముఖ నాయకులు మంత్రి సుదేంధు అధికారి, యంపి సునిత్ మోండల్, తృణముల్ యంయల్ఏలు, కమ్యూనిష్టులు, కాంగ్రేస్ నాయకులు క్యూకట్టి భాజపాలో చేరి రాజకీయ కాక పుట్టించారు. మమతా బెనర్జీని ఓడించి పశ్చిమ బెంగాల్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని మోదీ-షా పావులు కదుపుతున్నారు. కమ్యునిస్టుల కంచుకోటను బద్దలుకొట్టి, తృణముల్ జెండా ఎగురవేసిన మమతా బెనర్జీ ప్రజాదరణ తక్కువ అంచనా వేయడం సరికాదని భాజపా అగ్ర నాయకులకు తెలుసు.
గత ఏడాదిలో 15 మంది తృణముల్ ఎంయల్ఏలు, 3 సిపియం ఎంయల్ఏలు, 2 కాంగ్రేస్ ఎంయల్ఏలు, ముస్లిమ్ లీడర్లు భాజపా తీర్థం పుచ్చుకుని సంచలనం కలిగించారు. 2016 పశ్చిమ బెంగాల్ అసెృబ్లీ ఎన్నికల్లో ఏడుగురు భాజపా సభ్యులు మాత్రమే ఎన్నికైనారు. 2014 ఎన్నికల్లో ఇరువురు భాజపా యంపీలు నెగ్గగా, 2019లో 18 భాజపా యంపీలు గెలిచి,పార్టీకి ఊతం ఇవ్వగా, తృణముల్ బలం 34 నుంచి 22కు పడిపోయింది. ముస్లిమ్ ఓటర్లు సిపియం నుంచి దూరం కావడంతో ఓటింగ్ శాతం 29.9 నుంచి 7.5 కి తగ్గింది. 2019 లోకసభ ఎన్నికల్లో భాజపా ఓట్ల శాతం పూర్వపు 17 నుంచి 40.2 కి పెరగడంతో భాజపా ఉత్సాహం రెట్టింపు అయింది, తృణముల్ ఓటు శాతం 39 నుంచి 43 కు మాత్రమే పెరిగింది. భాజపా ఎన్నికల ప్రచారంలో బెంగాల్‌ను పునరుత్తేజం చేస్తూ ‘సోనార్ బంగ్లా (బంగారు బంగ్లా)’ చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. ముస్లిమ్‌ల మద్దతు పొందిన తృణముల్ పార్టీకి గండి కొట్టేలా ఏఐయంఐయం, ఇతర ముస్లిమ్ పార్టీల అభ్యర్థులు ఓట్లు చీల్చే అవకాశం కూడా ఉంది.
ఇప్పటివరకూ ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ తిరుగులేని నాయకురాలుగా అనేక మార్లు రుజువు చేసుకుంది. తృణముల్ కోటలో భాజపా పాగా వేయడానికి చాలా చెమట శ్రమ పడాలి. ప్రభుత్వ వ్యతిరేకత, ముస్లిమ్‌లు యంఐయం వైపు చూడడం, హిందుత్వ భానజాల వ్యాప్తి వంటి అవాంతరాలను మమత ఎదుర్కొని రాబోయే ఎన్నికల్లో కష్టపడాల్సి ఉంది. ఎండ తీవ్రతతో పాటు అసెంబ్లీ ఎన్నికల వేడికూడా పార్టీలు, ప్రజలు భరించాల్సిఉంటుంది. . మోదీ మమత మధ్య పోటీ తీవ్ర స్థాయిలో జరుగనుంది. ఇరుపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తృణముల్ కోటను భాజపా బద్దలు కొట్టడం అంత సులువు కాదు. మమత కూడా భాజపా బలాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. రాజకీయ దిగ్గజ పార్టీలు అభ్యర్థుల పోటీ రసవత్తరంగా ఉండబోతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రజాస్వామ్యం గెలిచేలా ప్రశాంత వాతావరణంలో నీతివంతంగా ఎన్నికలు జరగాలి.

జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్ – 99497 00037