Take a fresh look at your lifestyle.

బిజెపికి ప్రత్యామ్నాయం కోసం తృణముల్‌ ప్రయత్నాలు ..

జాతీయ స్థాయిలో భారతీయ జనతాపార్టీకి ప్రత్యమ్నాయంగా ఎదిగేందుకు అఖిల భాతర తృణముల్‌ ‌కాంగ్రెస్‌(‌టిఎంసి) పావులు కదుపుతుంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బిజెపిని గద్దె దించడమే ప్రధానమని ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెబుతున్నది. కాగా 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని మట్టి కరిపించేందుకు భావ సారూప్యత గల ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఐక్యం చేసే ప్రయత్నంలోనే ఇప్పుడు ఆమె ఉన్నారు. తాజాగా ముంబయి పర్యటించిన నేపథ్యంలో అదే విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు మీడియా సమావేశంలో ఆమె చెప్పారు. బిజెపికి ప్రత్యామ్నాయంగా విపక్షాలతో ఒక కూటమిని ఏర్పాటు చేయాలన్నది కొంతకాలంగా దేశంలోని రాజకీయ వర్గాల్లో నానుతున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇదే అంశంతో 2018లో రాజకీయ వర్గాల్లో కొంత సంచలనాన్ని కలిగించిన విషయం తెలియంది కాదు. కాంగ్రెస్‌, ‌బిజెపియేతర రాజకీయ కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అంతటితో ఆగకుండా ప్రాంతీయ పార్టీలను సంఘటిత పర్చేందుకు వివిధ రాష్ట్రాల్లో ఆయన పర్యటించారు. ఆయన కలుసుకున్న వారిలో మమతా బెనర్జీ కూడా ఉన్నారు. తన ఆలోచన పట్ల ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు కూడా అప్పట్లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌చెప్పుకొచ్చారు. అలాగే జార్ఖండ్‌ ‌ముఖ్యమంత్రి హేమంత్‌ ‌సోరేన్‌ ‌లాంటి మరికొందరిని కలుసుకున్నారు. ఆ తర్వాత ఎందుకో ఆయన ఆ ఆలోచనను వదిలివేసినట్లు కనిపించింది. కాగా ఇటీవల వరి కొనుగోలు విషయంలో కేంద్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంబన ఇరు పక్షాల మధ్య విభేదాలకు దారితీసింది.

వ్యవసాయ రంగానికి మద్దతుగా అవసరమైతే జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని చేపడుతానని సిఎం కెసిఆర్‌ ‌ప్రకటించినప్పుడు దీన్ని అవకాశంగా ఆయన మరోసారి ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలు చేపట్టే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాలు భావించాయి. అయితే ఈ విషయంలో మమతా బెనర్జీ ఒక అడుగు ముందుకు వేసినట్లు కనిపిస్తున్నది. ప్రాంతీయ పార్టీలన్నీ కలిస్తే బిజెపిని ఓడించడం పెద్ద సమస్యేమీ కాదని ఆమె ఇటీవల ప్రకటించారు. అయితే ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమికి నాయకత్వం వహించే విషయంపైన మాత్రం గుమ్మనంగా మాట్లాడింది. అలాగే విపక్షాల పిఎం అభ్యర్థి విషయాన్ని కూడా అప్పటి రాజకీయ పరిస్థితిని బట్టి రాష్ట్రాలే నిర్ణయిస్తారనడాన్ని బట్టి రాబోయే ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలను సన్నద్ధం చేసే ప్రక్రియను చురుగ్గానే సాగిస్తున్నట్లు కనిపిస్తున్నది. మరోవంక ఇంతవరకు పశ్చిమ బెంగాల్‌ ‌వరకే పరిమితమైన తన పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలు కూడా చురుగ్గా సాగిస్తున్నది. అందులో తెలంగాణ రాష్ట్రమేమీ మినహాయింపుకాదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఓటమి లక్ష్యంగా ముందుకు సాగడంలో భాగంగానే ఈ మధ్య కాలంలో వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో తనవంతు పాత్ర పోషించే విధంగా పావులు కదుపుతుంది మమతా. అందులో భాగంగానే 2023లో త్రిపురలో జరుగనున్న ఎన్నికల్లో బలపడే ప్రయత్నం చేస్తుంది. తాజాగా మేఘాలయలో మాజీ ముఖ్యమంత్రి ముఖుల్‌ ‌సంగ్మాతో పాటు పన్నెండు మంది ఎంఎల్‌ఏలు నవంబర్‌ 24‌న టిఎంసి తీర్థం తీసుకున్నారు.

గోవాలో 2022లో జరిగే ఎన్నికల్లో కూడా తన సత్తా చాటుకునే ప్రయత్నాన్ని ఇప్పటి నుండే టిఎంసి ప్రారంభించింది. ఆలాగే మణిపూర్‌, అరుణాచల్‌‌ప్రదేశ్‌లలో ఇప్పటికే పార్టీ గుర్తింపును తెచ్చుకుంది కూడా. కాగా దిల్లీ సిఎం అరవింద కేజ్రీవాల్‌, ఒడిశా సిఎం నవీన్‌ ‌పట్నాయక్‌లతో మంచి సంబంధాలను నెలకొల్పుతున్నారు. ఇలా వివిధ రాష్ట్రాలతో రాజకీయ సంబంధాలను ఏర్పరుచుకుంటున్న మమతా, దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కున్న స్థానాన్ని తప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారాన్ని కోల్పోయిన తర్వాత దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అధికంగా పరాజయాలనే మూటగట్టుకుంటున్నది. అలాంటి కాంగ్రెస్‌కు దూరం పాటించడమేగాక, ఆ పార్టీలోని సీనియర్‌ ‌నాయకులను ఆకర్షించే పనిలోఉంది టిఎంసి. అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుస్మితాదేవ్‌ (అస్సాం)ను టిఎంసి లోకి ఆహ్వానించి ఆమెకు రాజ్యసభ స్థానం కల్పించింది. అలాగే మరికొందరు సీనియర్‌లను, రెండవ శ్రేణి నాయకులను టిఎంసిలో చేర్చుకుని వారికి ప్రాధాన్యమైన పదవులను కల్పించడం ద్వారా తమ పార్టీలో చేరిన వారిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయమని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తుంది. దేశ రాజకీయాల్లో ఫ్రైర్‌ ‌బ్రాండ్‌గా పేరున్న మమతా బెనర్జీ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కుంటుందేగాని తలవంచదన్న పేరుంది. ఆ పేరే ప్రాంతీయ పార్టీలను సంఘటిత పరిచే అవకాశాన్ని ఆమెకు కలిగిస్తున్నాయి. మొత్తానికి రానున్న 2024 ఎన్నికలు దేశ రాజకీయాల్లో సంచలనాత్మక మార్పుకు కారణంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply