Take a fresh look at your lifestyle.

ప్రజా పాత్రికేయుడు శంభాజీకి అశ్రునివాళి

 

 ఆయన నిబద్ధత గల జర్నలిస్ట్.. ‌ప్రజా పాత్రికేయుడు. పాఠకులను ఆకట్టుకునే విధంగా వార్తలు, స్టోరీలు రాయడంలో  ఆయనకు ఆయనే సాటి. నిస్వార్థపరుడు. కుంబకోణాల, లంబకోణాల గుట్టులను రట్టు చేసేవాడు. పరిశోధనాత్మక జర్నలిజం ఆయన హాబీ. అంతు చిక్కని ప్రజాసమస్యలకు తన వ్యాసం ద్వారా, తన వార్త ద్వారా ముగింపు పలికేవాడు. ఇతర పాత్రికేయులు ఎవరు రాయని అంశాలను తీసుకొని అద్భుతమైన శైలిలో రాయడం ఆయన ప్రత్యేకత. ఆయన మంచి వక్త. అంతకంటే మంచి కవి, మంచి వ్యాసకర్త. హృదయమున్న జర్నలిస్ట్. ఆరోగ్యాన్ని, కుటుంబ సమస్యలను సైతం లెక్కచేయకుండా వృత్తి ధర్మాన్ని నిర్వహించిన ఘనుడు. ఆయన ఎవరో కాదు లింగంపల్లి శంభాజీ. ప్రజాకవి, గాయకుడు నిస్సార్‌ ‌చనిపోయిన 24 గంటలకే ప్రజాపాత్రికేయుడు లింగంపల్లి శంభాజీ చనిపోవడం జర్నలిస్ట్ ‌సమాజానికి తీరని లోటు. పత్రికా రంగంలో శంభాజీ చేసిన సేవలు ఎవరూ మరువలేనివి. మూడు దశాబ్దాలుగా ఆయన తెలుగు పత్రికా రంగంలో ఆణిముత్యంలా మెరిసాడు. 1968లో కరీంనగర్‌ ‌జిల్లా జమ్మికుంట మండలం అంకుషాపూర్‌ ‌గ్రామంలో జన్మించిన శంభాజీ పువ్వు పుట్టగానే పరిమళించినట్టు విద్యార్థి దశలోనే మంచి కవిగా, వక్తగా, ఉపాధ్యాయునిగా పేరు సంపాదించాడు. అభ్యుదయ భావాలతో సమసమాజ స్థాపన కోసం పోరాటం చేసారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదివి వార్తా దినపత్రిక జర్నలిస్ట్‌గా పత్రికారంగ ప్రవేశం చేశారు. పాఠకులు నచ్చి ప్రజలు మెచ్చే తాజా వార్తలు అందించేవారు. బడుగు బలహీన వర్గాల సమస్యలకు పరిష్కారాలు చూపేవారు. కొంత కాలం ప్రజాతంత్ర తెలంగాణ దిన పత్రికలో పనిచేసిన శంభాజీ మూడు దశాబ్దాల పాటు తేజ టీవి, మెట్రో ఇండియా, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, నవతెలంగాణ  పత్రికలలో పనిచేసి తన శైలిని ఆయా పత్రికా యాజమాన్యాలకు తెలియజేశాడు. ఒక వైపు తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూ మరో వైపు ప్రత్యేక ప్రతినిధి పేరుతో కొన్ని ప్రత్యేక కథనాలను అందించేవారు. మంచి వార్తలు, సంచనల వార్తలు, సమాజానికి మేలు చేసే వార్తలు రాయడంలో శంభాజీ ముందుండేవారు. తను పనిచేసిన వివిధ పత్రికల్లో ఉద్యోగులతో సన్నిహితంగా మెదిలేవాడు. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివే రోజుల్లో కళాశాల వార్షిక పత్రిక ‘‘దర్శన’’ సంపాదకుని పోస్టుకి పోటీపడి ఆ పోస్టును పొందినారు. చక్కని మాటలతో ప్రేక్షకులను, శ్రోతలను మంత్ర ముగ్దులను చేయడం శంభాజీకి వెన్నతో పెట్టిన విద్య. ఆయన మాట్లాడుతుంటే కవిత్వం రాసినట్టు ఉంటుంది. ప్రేమగా, ఆప్యాయంగా పలకరించడంలో ఆయనకు ఆయనే సాటి. విద్యాబ్యాసం పూర్తయ్యాక తెలుగుదేశం పార్టీ విద్యార్థి సంఘ నాయకునిగా శంభాజీ పనిచేసారు. తెలుగు యువత విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షునిగా అప్పటి కమలాపూర్‌ ‌కుర్రోడు మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి శిష్యునిగా కొంత కాలం పనిచేశారు. రాజకీయాల్లో విసిగి వేసారి తన జీవితాన్ని విద్యారంగం వైపు మరల్చినారు. జమ్మికుంట మండల కేంద్రానికి సమీపంలోనే కొత్తపల్లి గ్రామంలో బోధిసత్వ అనే పేరుతో పాఠశాలను స్దాపించినారు. కాని ఆ పాఠశాల నిర్వహణ కష్టంగా మారి పీకల్లోతు నష్టాల్లో పడి హైదరాబాద్‌కి మకాం మార్చారు. కరీంనగర్‌ ‌జిల్లా స్వస్థలం అయినప్పటికీ గత 15 సంవత్సరాలుగా మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి పరిధిలోని ఘట్‌కేసర్‌ ‌మండలం అంకుషాపూర్‌ ‌గ్రామంలో నివసిస్తున్నాడు. గత 2 ఏళ్ళుగా నిమ్స్ ‌వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 10 రోజుల క్రితం మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈనెల 8వ తేదీ రాత్రి మృతిచెందడం పత్రికారంగానికి తీరని లోటు. ఆయన యువ జర్నలిస్టులకు రోల్‌ ‌మోడల్‌గా నిలిచాడు. హైదరాబాద్‌ ‌సనత్‌నగర్‌కు చెందిన లక్ష్మిని ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఆమెహైదరాబాద్‌లోని అరోరా కళాశాలలో ఉద్యోగం చేస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయి వికలాంగురాలిగా ఇంటికే పరిమితమైంది. మరో పక్క అనారోగ్యం పాలైనా శంభాజీ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా పత్రికా రంగాన్ని కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రం సాధించాలని 2005లో ‘జోర్దార్‌ ‌తెలంగాణ’ పేరుతో సంస్థను స్థాపించి ప్ర చారం నిర్వహి ంచారు. శం భాజీకి సంతా నం లేరు. ఆ యన మృతి పత్రికారంగా నికి తీరని లోటు.
 ‌రావుల రాజేశం, లెక్చరర్‌
‌రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ సామాజిక రచయితల సంఘం.

Leave a Reply

error: Content is protected !!