Take a fresh look at your lifestyle.

పోడు గర్జనకు సిద్ధమవుతున్న ఆదివాసీలు

గిరిజన, ఆదివాసీలకు పోలీసు, ఫారెస్టు అధికారులమధ్య పోడుపై జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని మరింత ఉధృతం చేసేందుకు ‘ఆదివాసీ గిరిజన సంఘాల పోడు గర్జన’ పేర తమ హక్కుల సాధనకు మరింతగా ఉద్యమించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. వార్తల్లో నేడు వివాదగ్రస్తమై ప్రధాన చర్చనీయాంశంగా మారిన మంచిర్యాల జిల్లా కోయపోషగూడెం నుండి ఈ నెల పదవ తేదీన పాదయాత్రను కొనసాగించాలని కూడా పోరుగర్జన నిర్ణయించింది. పదమూడవ తేదీన పాదయాత్ర ఉట్నూరుకు చేరుకోగా, అక్కడ ఐటిడిఏ కార్యాలయం ముందు ‘ఆదివాసీల పోరుగర్జన’ సభను నిర్వహించడం ద్వారా తమ హక్కుల సాధన పోరుబాటకు నాంది పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

కోయపోషగూడెం అటవీ ప్రాంతంలో సాగుచేసుకుంటున్న గిరిజన, ఆదివాసులపై అక్రమంగా కేసులు బనాయించడమేకాకుండా, వారిని జైలుపాలుచేసిన ప్రభుత్వంపై పోరాటం సాగిస్తామని ఆదిలాబాద్‌ ‌జిల్లా జైలునుండి శనివారం బేయిల్‌పై విడుదలైన పన్నెండు మంది మహిళలు ఈ సందర్భంగా శపథం చేశారు. మహిళలమన్న కనికరం లేకుండా, కట్టుకున్న దుస్తులు ఊడిపోతున్న గొరగొర గుంజుకుపోయి అరెస్టులు చేసిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకునేవరకు తాము విశ్రమించేదే లేదని ‘ఇంద్రవెల్లి అమరవీరుల స్ఠూపం’వద్ద ఆ పన్నెండు మంది మహిళలు ప్రతినబూనారు. అలాగే తాము సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలను సాధించుకునే వరకు తమ పోరుబాటను వీడేది లేదని మహిళలు తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఒక దగ్గర పోడు వ్యవసాయం విషయంలో నిత్యం ఘర్షణలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. దాదాపు 17వ శతాబ్ధకాలంనుండి కేవలం అడవులనే నమ్ముకుని జీవనం వెళ్ళదీసుకుంటున్న ఆదివాసీ, గిరిజనులకు మరో ఉపాధి లేకపోవడంతో ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. ముందుగా అటవీ ఉత్పత్తులైన బంక, తేనే, ఇప్పపువ్వు, వంట చెరుకులను పోగుచేసుకుని అమ్ముకుంటున్న ఆదివాసీలు, క్రమేణ పోడు వ్యవసాయం చేసుకోవడానికి అలవాటు పడ్డారు. అడవిలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చిన్న చిన్న పొదలు, మొక్కలను చదునుచేసి వ్యవసాయం చేసుకోవడం ఆరంభించారు. ఎప్పుడైతే భూమి ధరలు పెగుతూ వొస్తున్నాయో గిరిజనేతరులకు ఆ భూములపై కళ్ళు పడ్డాయి. అందుకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు లభించడంతో బినామీ పేర పోడు విస్తీర్ణం పెరుగూ వొ చ్చింది. తెలంగాణలో మొత్తం అటవీ విస్తీర్ణం 26 లక్షల 90వేల 370 హెక్టార్లుగా ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇందులో పోడు వ్యవసాయం పేర 2 లక్షల 94వేల 693 హేక్టార్ల అటవీ ప్రాంతం ఆక్రమణలో ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఇందులో గిరిజనేతరుల ఆక్రమణలో ఉన్న భూమే ఎక్కువ కావడంతో తరచు ఈ వివాదం చెలరేగుతున్నది. రెవెన్యూ అధికారులకు, ఫారెస్టు అధికారుకు మధ్య సమన్వయం లేకపోవడం.

ఈ రెండు శాఖలు రాజకీయనాయకులకు అనుకూలంగా మసలటంవల్ల ఏనాటికి ఈ వివాదానికి ఫుల్‌ ‌స్టాప్‌ ‌పడకుండా పోతోందన్న వాదన ఉంది. దీంతో పాలక పక్షానికి, ప్రతిపక్షానికి ఇదొక రాజకీయ అస్త్రంగా మారుతున్నది. నలభై నుండి వంద ఏళ్ళుగా పోడు భూమిని నమ్ముకుని తరతరాలుగా బతుకుతున్న గిరిజన, ఆదివాసీలకు ప్రభుత్వాలు వాగ్ధానం చేసిన మేరకు చట్టప్రకారం పట్టాలివ్వకపోవడంతో తరచూ వారికీ అటవీశాఖ అధికారుల మధ్య వివాదాలు చోటుచేసుకోవడం, లాఠీచార్జీలు, రాళ్ళదాడులు, కాల్పులు, మరణాలతో యుద్దవాతారణాన్ని తలపిస్తున్నాయి. దశాబ్ధాలుగా ఇదే భూమిని నమ్ముకుని పిల్లా పాపలతో కాలం వెళ్ళదీసుకుంటున్న తమను వెళ్ళిపొమ్మంటే ఎక్కడికని వెళ్తాం.. ఏంచేసుకుని బతుకుతామని బోరుమంటున్నారు ఆదివాసీ గిరిజనులు. పోలీసుల సహాయంతో అటవీశాఖ అధికారులు వారి గుడిసెలను ధ్వంసం చేయడం, ఉన్న పాత్రలు, సామగ్రిని చిందరవందర చేయడం, పొలాన్ని దున్నుకోకుండా అడ్డుపడడం, వేసిన పంటను నాశనం చేస్తుండబంతో వారు తిరగబడటం, వీళ్ళు లాఠీలకు పనిచెప్పడం, చిన్నపెద్ద ఆడ మగ అన్న భేదం లేకుండా బూటుకాళ్ళతో ఇష్టం వొచ్చినట్లు తన్నటం, కేసులు బనాయించడం, జైళ్ళచుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పడంతో వారు మరింతగా రెచ్చిపోతున్నారు.

మంచిర్యాల జిల్లా కోయపోషగూడెంలో అదేజరిగింది. ఇక్కడ ఆదివాసీ గిరిజనులు 2002 నుండి పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. తాజగా గత నెల ఫారెస్టు అధికారులు వారిని ఖాలీచెయ్యమన్నారు. వారు కాళ్ళావేళ్ళా పడినప్పటికీ వారి గుడిసెలను ధ్వంసం చేశారు. వారిపై లాఠీప్రయోగం చేశారు. మహిళను గుంజుకుంటూ తీసుకువెళ్ళారు. కనీసం వారి బట్టలు ఊడిపోతున్నా పట్టించుకోలేదన్నది వివాదగ్రస్తమయింది. మహిళపట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు కాంగ్రెస్‌పార్టీకి చెందిన ములుగు ఎంఎల్‌ఏ ‌సీతక్క తీవ్ర విమర్శ చేశారు. ఇందుకు కారకుడైన ఫారెస్టు ఉన్నతాధికారిపైన తక్షణం చర్యతీసుకోవాలని అమె డిమాండ్‌ ‌చేశారు. ఇదిలా ఉంటే ఇది కేవలం కోయపోషగూడెం సమస్యేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతామంతా ఇదే పరిస్థితి. గిరిజన ఆదీవాసీల సంఖ్య ఎక్కువగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాతో పాటు ఖమ్మం, మహబూబాబాద్‌, ‌ములుగు, వరంగల్‌ ‌ప్రాంతాల్లో ఈ సమస్యలు తరుచు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. తాజాగా ఆసిఫాబాద్‌ ‌జిల్లాలోని కాగజ్‌నగర్‌ ‌రెవెన్యూ డివిజన్‌ ‌పరిధిలో ఇటీవల ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడిన విషయం తెలియందికాదు. పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పంటవేసుకోవడాన్ని ఫారెస్టు అధికారులు అడ్డగించారని ఓ రైతు వంటికి నిప్పంటించుకునే ప్రయత్నం చేసిన విషయం వెలుగులోకి వొచ్చింది. నల్లగొండ జిల్లా సాగర్‌ ‌నియోజకవర్గం సుంకిశాల తండాలో తాము పోడు చేసుకున్న దాదాపు యాభై ఎకరాల భూమిలో ఫారెస్టు అధికారులు మొక్కలు నాటుతుండడాన్ని అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావర్ణం చోటుచేసుకుంది.

అలాగే భదాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సుమారు యాభై ఏళ్ళ నుండి సాగుచేసుకుంటున్న సుమారు నలభై ఎకరాల పోడు భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవడంతో అక్కడ వివాదం మొదలయింది. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసిన పోడు వివాదాలే కనిపిస్తున్నాయి. ఇది వర్షాకాల సీజన్‌ ‌కావడంతో అటు వ్యవసాయానికి భూమిని దున్నడానికి ఆదివాసుల ప్రయత్నాలు, ఇటు ఫారెస్టు అధికారులు అటవిని విస్తృతం చేయాలని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతుండడంతో ఘర్షణకు దారితీస్తున్నది.

వాస్తవంగా పోడు భూముల విషయంలో 2006 అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) ‌కింద కొందరికి ప్రభుత్వం పట్టాలిచ్చింది. అయితే ఇంకా వేలాది దరఖాస్తులు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సమస్యను తానే స్వయంగా పరిష్కరిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై 2021లో అత్యున్నత స్థాయి కమిటీకూడా వేశారు. కాని, సమస్య ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది.  రాష్ట్రంలో ప్రస్తుతం 24 శాతంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతంగా పెంచాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అయితే ఇప్పటికే పదిశాతం వరకు కబ్జాలకోరల్లో ఉందని పర్యావరణవేత్తలంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రధానంగా అటవీ హక్కుల సమస్యకు ముందుగా పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి. ఇందులో రాజకీయ పార్టీలు, నేతల ప్రమేయంలేకుండా చూడాలి. రెవెన్యూ, అటవీశాఖ అధికారులమధ్య సమన్వయం ఉండేలా చూడాలి. ముఖ్యంగా ఫారెస్టు అన్నది కేంద్ర పరిధిలోనిదవటంవల్ల అటవీ హక్కుల చట్ట సవరణకు కేంద్రంకూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంటుందని పర్యావరణ వేత్తలు చెబుతన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ సమస్యకు మార్గం సులభం చేసినప్పుడే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

Leave a Reply