Take a fresh look at your lifestyle.

గిరిజన హక్కుల కార్యకర్త.. ఫాదర్‌ ‌స్టాన్‌ ‌స్వామి మృతి

ఆయన భీమా కోరేగావ్‌ ‌కేసులో నిందితుడు
గిరిజన హక్కుల కార్యకర్త, భీమా కోరేగావ్‌ ‌కేసులో తలోజా జైలులో ఉన్న ఫాదర్‌ ‌స్టాన్‌ ‌స్వామి (84) సోమవారం కన్నుమూశారు. అక్టోబర్‌, 2020 ‌నుంచి తలోజా జైలులో ఉన్న స్టాన్‌ ‌స్వామి పార్కిన్‌సన్స్ ‌బాధితుడే కాకుండా కొన్ని రోజుల క్రితమే కొరోనా బారిన పడడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. కోవిడ్‌ ‌నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో చేర్పించి ఆదివారం నుంచి వెంటిలేటర్‌ ‌మీద ఉంచి చికిత్స అందిస్తుండగా.. సోమవారం ఆయన మృతి చెందారు. భీమా కోరేగావ్‌ ‌కేసులో జైలులో ఉన్న స్టాన్‌ ‌స్వామికి గతంలో ఎన్‌ఐఏ ‌కోర్టు బెయిల్‌ ‌మంజూరు చేయలేదు. పార్కిన్‌సన్స్ ‌వ్యాధితో బాధపడుతున్న ఆయనకు చివరకు ఆహారం తీసుకోవడానికి కనీసం సిప్పర్‌ ‌కూడా అనుమతించకపోవడం పట్ల గతంలో అనేక విమర్శలు వొచ్చాయి.

మహారాష్ట్రలోని పుణె సమీపంలో భీమా కోరెగావ్‌ ‌వద్ద జనవరి 1, 2018న జరిగిన హింసాత్మక ఘటనలు అంతకు ముందు రోజు, ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌సభ్యులు చేసిన రెచ్చ గొట్టే ప్రసంగాల తరువాతనే జరిగాయని ఎన్‌ఐఏ ‌పేర్కొంది. వారు దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని, మావోయిస్టులకు ఆర్థిక సాయం అందించారని అభియోగాలు మోపుతూ అందుకు తగ్గ సాక్ష్యాలు తమ దర్యాప్తులో బయటపడ్డాయని తెలిపింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మేధావులను ఏకం చేసే బాధ్యతను నవ్‌లఖా నిర్వహించేవారని చెప్పింది. ఫాదర్‌ ‌స్టాన్‌ ‌స్వామి మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారని, ఇతర కుట్రదారులతో సంప్రదింపులు జరుపుతుండేవారని ఎన్‌ఐఏ ఆరోపించగా ఆ ఆరోపణలను స్టాన్‌ ‌స్వామి ఖండించారు.

Leave a Reply