హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వారికి మొండిచేయి చూపింది. దళిత బంధు తరహాలోనే గిరిజనుల కోసం త్వరలో గిరిజన బంధు అమలు చేస్తామని గతేడాది సెప్టెంబర్‌లో ఆదివాసీ, జంజారాల ఆత్మీయ సభలో సిఎం కెసిఆర్ ప్రకటించినా..ఆ ప్రసావన బడ్జెట్‌లో లేదు. 2023–24 బడ్జెట్‌లోలో గిరిజన బంధు కోసం నిధులు కేటాయిస్తారని ఆదివాసీలు, గిరిజనులు ఆశగా ఎదురు చూశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ ఊసెత్తలేదు. ఇక 2018 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన నిరుద్యోగ భృతి హావి• కార్యరూపం దాల్చడం లేదు. అధికారంలోకి వొచ్చి నాలుగేళ్లు దాటినా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి కూడా నిరుద్యోగ భృతి అందించలేదు. 2022-23 బడ్జెట్లో నిరుద్యోగభృతి కోసం రూ. 3 వేల కోట్లు కేటాయించినా.. ఆ ఏడాది మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో ఈ పథకానికి ప్రభుత్వం అటకెక్కించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.