- ఆదానీ వ్యవహరంపై చర్చకు విపక్షాల పట్టు
- ఆందోళనల మధ్య పార్లమెంట్ సోమవారానికి వాయిదా
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 3 : వరుసగగా రెండోరోజూ ఆదానీ వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. ఉభయసభల్లో చర్చకు విపక్షం పట్టుబట్టగా తొలుత మధ్యాహ్నం 2గంటల వరకు ..తరవాత సోమావారానికి ఉభయసభలు వాయిదా పడ్డాయి. దేశ ఆర్థకిరంగాన్ని కదిపేస్తున్న ఈ ఘటనపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గౌతమ్ అదానీ వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. మార్కెట్‌లలో అదానీ గ్రూప్ డీలాపడినందున ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎల్‌ఐసీ భారీగా నష్టపోయే ప్రమాదం ఉండటంతో లోక్‌సభలో, రాజ్యసభలో అదానీ వ్యవహారంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అంశాలపై కూడా చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
దాంతో ఉభయసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. లోక్‌సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ సభను అదుపులో పెట్టే ప్రయత్నం చేసినా సాధ్యంకాలేదు. దాంతో లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదాపడ్డాయి. తర్వాత రెండు సభలు ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో మార్పు కానరాలేదు. దాంతో ఉభయసభలను ఈ నెల 6వ తేదీ సోమవారానికి వాయిదా వేశారు. అదానీ గ్రూప్ మోసంపై చర్చ జరపాలన్న ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం కూడా వాయిదాపడ్డాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వారి అభ్యర్థనలను లోక్‌సభ స్పీకర్ నిరాకరించారు.
సభ్యులు నిరాధారమైన ఆరోపణలు చేయకూడదంటూ ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ కూడా వాయిదా తీర్మానాలను తోసిపుచ్చడంతో ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2.30 గంటల వరకు, లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే చాంబర్‌లో 16 ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం కూడా సమావేశమయ్యాయి. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించాయి. అదానీ కుంభకోణంపై అమెరికా పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేపట్టాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.