మానావాళి మనుగడకు చెట్లు ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన భాద్యత ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న 6వ విడత కార్యక్రమంలో భాగంగా మంత్రి శుక్రవారం జడ్పి చైర్మెన్ కుసుమ జగదీష్, ఎమ్మెల్యే ధనసరి సీతక్క, కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య, ఐటిడిఏ పివో జండెడ్ హన్మంత్ కుండిబా, డిఎఫ్వో ప్రదీప్ కుమార్ శెట్టితో కలసి ములుగు మండలంలోని జాకారం, బండారుపల్లి, కలెక్టర్ కార్యాల యం, అటవి శాఖ కార్యాలయం, వెంకటాపూర్ మండలంలోని ఎల్లారెడ్డి పల్లి, తహశీల్దార్ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ చెట్లు కనుమరుగు కావడం వలన పూర్తి స్థాయిలో వర్షాలు పడటంలేదని, పర్యావరణం దెబ్బతింటున్నదని అన్నారు.
రాష్ట్రాన్ని పచ్చని తెలంగాణ చెయ్యాలనే ఉద్దెశంతో ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతి సంవత్సరం హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి కోట్లాది మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని, మొక్కలు నాటే కార్యక్రమంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. ములుగు జిల్లాలో గతంలో ఏ విధంగా దట్టమైన అడవులు ఉన్నాయో అదే తరహాలో అడవులను పెంచి పచ్చని జిల్లా గా మార్చాలని సూచించారు. ప్రతి ఇంటికి ఉచితంగా పలు రకాల మొక్కలను పంపిణి చెయ్యాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమాలలో ఏఎస్పి సాయి చైతన్య, డిఆర్వో కె. రమాదేవి, డిఆర్డివో పారిజాతం, డివిజనల్ అటవి శాఖ అధికారి నిఖిత, డిపిఆర్వో గౌస్ పాషా, ఎంపిపి గండ్రకోట శ్రీదేవి సుధీర్, జడ్పిటిసి సకినాల భవాణి, ఆయా గ్రామాల సర్పంచ్లు, అధికారులు పాల్గోన్నారు.