- అవినీతికి దూరంగా సంస్థల పనితీరు
- 49శాతం మండలాలకు నెట్వర్క్ లేదు
- సహకార రంగంపై సమీక్షలో సిఎం జగన్
సహకార వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా కూడా అవినీతి ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సహకార రంగంపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల పనితీరుపై సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరాలు అందజేశారు. కడప, కర్నూలు, అనంతపురం, ఏలూరు డీసీసీబీలు నిర్వీర్య దశలో ఉన్నాయని అధికారులు నివేదించారు. వాటి లైసెన్స్‌లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని తెలిపారు.
45 శాతం పీఏసీఎస్‌లు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయని వెల్లడించారు. 49 శాతం మండలాలకు డీసీసీబీ బ్రాంచ్ నెట్‌వర్క్‌తో అనుసంధానం లేదని, తక్కువగా రుణాలు ఇవ్వడంతోపాటు మోసాలు అధికంగా జరుగుతున్నాయని వెల్లడించారు. కేవలం పంటరుణాలకే పరిమితం అవుతున్నాయని తెలిపిన అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకోవడం లేదని వివరించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ, సహకారశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సహకారశాఖ స్పెషల్ సెక్రటరీ వై మధుసూదనరెడ్డి, కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సోసైటీస్ బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
హకార వ్యవస్థను బలోపేతం చేసి, సమర్ధవంతగా నడపడానికి యాజమాన్య పద్ధతుల్లో ఎన్ఏబిసీఓఎన్ఎస్ సిఫార్సులపై సమావేశంలో చర్చించారు. సమగ్రమైన బ్యాంకు సేవలు కోసం ఆప్కాబ్, డీసీసీబీల నుంచి పీఏసీఎస్‌ల వరకు కంప్యూటరీకరణ చేయాలని సీఎం జగన్ సూచించారు. పీఏసీఎస్‌లు క్రెడిట్ సేవలతో పాటు నాన్ క్రెడిట్ సేవలు కూడా అందించాలని, పీఏసీఎస్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతీ 3 ఆర్బీకేలకు ఒక పీఏసీఎస్ ఉండేలా చూడాలని ప్రతిపాదించారు. ఆప్కాబ్, డీసీసీబీ బోర్డుల్లో నిపుణులైన వారిని నియమించాలని అన్నారు.
వ్యవసాయం, బ్యాంకింగ్, ఆర్థిక, అకౌంటెన్సీల్లో నిపుణులైన వారిని బోర్డుల్లోకి తీసుకురావాలని సిఫార్సు చేశారు. బోర్డుల్లో మూడింట ఒక వంతు మందిని డైరెక్టర్లుగా నియమించాలని, బోర్డులో సగం మంది ప్రతి రెండున్నర సంవత్సరాలకు విరమించేలా ఏపీసీఎస్ యాక్ట్‌కు సవరణ తీసుకురావాలని పేర్కొన్నారు. అలాగే పీఏసీఎస్‌ల్లో కూడా మూడింట ఒక వంతు మంది ప్రొఫెషనల్స్‌ను తీసుకురావాలని, గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ అసిస్టెంట్లను పీఏసీఎస్ సభ్యులుగా తీసుకురావాలని తెలిపారు. ఈ మేరకు చట్ట సవరణకు సీఎం అంగీకారం తెలిపారు. పీఏసీఎస్‌ల్లో క్రమం తప్పకుండా నిపుణులైన వారితో ఆడిటింగ్‌కు నిర్ణయం తీసుకోగా రిపోర్టుల్లో వ్యత్యాసం కనిపిస్తే ఏంచేయాలన్న దానిపైన కూడా కార్యాచరణ ఉండాలని సీఎం అన్నారు. థర్డ్‌పార్టీతో స్వతంత్రంగా విచారణ చేయించాలని ఆదేవఙంచారు.