Take a fresh look at your lifestyle.

పాలనలో పారదర్శకత.. ప్రజల పట్ల బాధ్యత..

డైనమిజానికి నిలువెత్తు నిర్వచనం.. కలెక్టర్‌ ‌మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌

రాజకీయనాయకుల ఒత్తిళ్లు.. పై అధికారుల టార్గెట్లు.. వేటికి తలొగ్గని నైజం ఆయనది. ఒక్క మాటలో చెప్పా లంటే ఆయన ఆదర్శ అధికారి. మన సంతా సేవాభావాన్ని అల వర్చుకొన్న ఆయనే.. జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ ‌మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌. ‌పాలనలో తనదైన ముద్ర వేయడమే కాదు.. ప్రజాసేవలోనూ ఆయన ముందుంటారు. ప్రభుత్వ ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేయడంతో పాటు, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించి ‘శభాష్‌’ అనిపించుకున్న అబ్దుల్‌ అజీమ్‌ 2020 ‌ఫిబ్రవరి 2 నుంచి జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పాలన కొనసాగిస్తుండడంతో.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయి.

collector Mohammed Abdul Azeem

ప్రస్తుత విపత్తువేళ.. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా జిల్లాలోని 11 మండలాల్లో కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ ‌పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పరిస్థితిని అదుపు చేసేందుకు ఆయన శక్తి మేరకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ ‌చాపకింద నీరులా ప్రవహిస్తున్నా.. అడవుల జిల్లా జయశంకర్‌ ‌భూపాలపల్లిలో మాత్రం నియంత్రణలో ఉన్నది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆయన కష్టపడుతూ జిల్లా ప్రజలకు అండగా నిలిచారు. ముఖ్యంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో కాబోయే ‘అమ్మల’ కు అండగా ఉండేందుకు డెలివరీ కేసులపై ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌ ‌మాసంలో ఎంతమంది ప్రసవాలకు సిద్ధంగా ఉన్నారో వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా జాబితా తయారు చేయించి అందుకనుగుణంగా ప్రణాళిక రూపొందించారు. గర్భిణులను ఆస్పత్రికి తరలించడం నుంచి.. డెలివరీ అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి అన్నిరకాల వసతులను కలెక్టర్‌ ‌కల్పించారు.

ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో అంటు వ్యాధులు ప్రబలకుండా ఆయన ముందస్తు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర మున్సిపల్‌, ఐటీశాఖమంత్రి కేటీఆర్‌ ‌సూచన మేరకు ప్రతి ఆదివారం ఉదయం ‘పదిగంటలకు పది నిముషాలు’ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ‌విజయవంతం చేస్తున్నారు. అబ్దుల్‌ అజీమ్‌ ‌స్వయంగా చెత్తా, చెదారాన్ని తొలగిస్తున్నారు. ఎవరికి వారు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అంటు వ్యాధులు దరిచేరవని ఆయన సూచిస్తున్నారు. ఇష్టం ఉన్నచోట పనిచేస్తే కష్టం అనిపించదనే అజీమ్‌ ‌పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను జిల్లాలో విజయవంతం చేశారు. ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామాలు తిరుగుతూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రధానమైన తాగునీరు, సాగునీరు, కరెంటు, ఎరువులు, విత్తనాల వంటి సమస్యలు తీర్చారు. అక్రమ వ్యాపారాలను నియంత్రించారు. హరితహారం కార్యక్రమాన్ని నిత్య కృత్యం చేశారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలకు అప్పగించారు.

జిల్లాలో జాతీయ, గ్రామీణ ఉపాధిహామి పనులను రికార్డు స్థాయిలో కొనసాగించారు. అలాగే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేసే విధంగా కలెక్టర్‌ ‌చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని వలస కార్మికులను అన్నివిధాలా ఆదుకున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులు, వారి పిల్లలకు పునరావాస కేంద్రాల్లో వసతి కల్పించారు. టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామానికి చెందిన పది మంది రైతులు వరదల్లో చిక్కుకోగా హెలిక్యాప్టర్ల సహాయంతో వారిని రక్షించారు. అలాగే వైద్యం అందక అర్థరాత్రి ఇబ్బందులు పడుతున్న మొగుళ్ళపెల్లి మండలం, మేదరమెట్ల గ్రామానికి చెందిన పైడిమల్ల వర్ష అనే నిండు గర్భిణికి ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో సుఖప్రసవం జరిపించి అబ్దుల్‌ అజీమ్‌ ‌తనసేవాతత్ఫరతను చాటుకున్నారు.

collector Mohammed Abdul Azeem

రైతును రాజు చేయాలనే లక్ష్యంతో కలెక్టర్‌ ‌నియంత్రిత సాగు విధానాన్ని ప్రొత్సహిస్తున్నారు. దీనికి కర్షకుల నుంచి సానుకూల స్పందన లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ప్రతి సంవత్సరం రూ.10వేలు ఇస్తున్నారు. రైతులు ఏ కారణం చేత మరణించినా మృతుడి కుటుంబానికి భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ద్వారా రూ. 5లక్షల బీమా సొమ్ము అందిస్తున్నారు. అంతేగాక వివిధ రకాల పెన్షన్లను అర్హులకు అందిస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన కులవృత్తి దారులకు ఉపాధి పనులు కల్పించారు. పేద ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ, కంటి వెలుగు పథకాలను విజయవంతం చేశారు. అలాగే నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారు. పారిశుధ్యంపట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మిషన్‌ ‌భగీరథ పథకం ద్వారా దాదాపు జిల్లా అంతటా ఇంటింటికీ స్వచ్చమైన తాగునీరు అందించడంలో కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ ‌సఫలీకృతమయ్యారు. దీంతో ప్రజలు అబ్దుల్‌ అజీమ్‌సాబ్‌.. ‌మీ సేవలకు సలామ్‌ అం‌టూ నీరాజనాలు పలుకుతున్నారు.

2020 ఆగస్టు 7న ఉదయం 11 గంటల సమయంలో జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ ‌ప్రయాణిస్తున్న వాహనం కలెక్టరేట్‌ ‌ప్రధాన ద్వారం వద్ద ద్విచక్ర వాహనంపై వస్తున్న అమెజాన్‌ ‌కొరియర్‌ ‌బాయ్‌ ‌రాజేష్‌ని డీకొంది. వెంటనే కలెక్టర్‌ ‌వాహనం దిగి గాయపడిన బాధితుడిని చెట్టునీడన కూర్చోబెట్టి ఓదార్చారు. నీకేంకాదులే.. నేనున్నానంటూ భరోసా కల్పించారు. అంతేగాక కలెక్టర్‌ ‌సీసీ శివ సహాయంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే మెడనొప్పితో బాధపడుతున్న జిల్లా కలెక్టర్‌ ‌బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరాతీశారు. ఆ తర్వాతే పోలీస్‌ అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనలమేరకు కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ ‌హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షతగాత్రుడి ఆరోగ్య పరిస్థితిపై సీసీ శివ, ఆర్‌ఐ ‌దేవేందర్‌, అదనపు కలెక్టర్‌ ‌వై.వి. గణేష్‌ ‌నిత్యం వాకబు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన రాజేష్‌ని సింగరేణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా కలెక్టర్‌ ‌వాహనం ఆగకుండా వెళ్లిపోయింది అనే తప్పుడు వార్త కథనం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇసుక మాఫియాదారులు, భూకబ్జాదారులు, కావాలనే తెరవెనుక ఉండి తప్పుడు వార్తలు రాయించారనే ప్రచారం జరుగుతున్నది. ఇది జిల్లా పాలనాధికారి అబ్దుల్‌ అజీమ్‌ ‌వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నది. మానవత్వానికి మచ్చుతునక అయిన అబ్దుల్‌ అజీమ్‌ ‌వాహనం ఆపకుండా వెళ్లిపోయాడనే అపవాదు ఆయనను కలిచివేసింది. ఒక ఆదర్శ పౌరసేవకుడికి అవసరమైన అన్ని సద్గుణాలు కలిగిన కలెక్టర్‌పై తప్పుడు వార్త ప్రచురితం కావడంతో జిల్లా అధికార యంత్రాంగమంతా బగ్గుమన్నది. జిల్లా ప్రజలు సర్వత్రా నిరసనలు వ్యక్తం చేయడంతోపాటు కలెక్టర్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌ ‌తెరపైకి వచ్చింది.

మనసున్న మారాజు.. భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ అం‌టూ.. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నిరసనలు, ధర్నాలు, ఆందోళనలకు ఉపక్రమించారు. వెంటనే అప్రమత్తమైన జిల్లా కలెక్టర్‌ ‌వారిని నిలువరించారు. అంతేగాక ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నా కలెక్టర్‌ ‌సున్నితంగా వారి మాటలను తిరస్కరిస్తున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం పాటుపడుతున్న కలెక్టర్‌పై ఇలాంటి అసత్యపు కథనాలు ప్రచురించడం సరికాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ‘పంచాయితీలు’ పక్కన బెట్టి సమాజాబివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌ ‌పిలుపునివ్వడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. కరోనా కష్టకాలంలో ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు వద్దంటూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారంటే ఆయనలోని మంచితనాన్ని అర్థం చేసుకోవచ్చు. పాలనలో అడ్డంకులు ఎదురైనా, తన హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని ఆయన ఎప్పుడూ కోల్పోలేదు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులైన పత్రికలు సామాజిక బాధ్యత మరవొద్దనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ సర్వీసులో ఆదర్శ అధికారులకు అగ్నిపరీక్షలు తప్పవుకదా.. కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌సాబ్‌ ! ‌మీ నిబద్ధతకు జోహార్లు.. మీ పట్టుదలకు సలామ్‌.

గడ్డం కేశవమూర్తి
సీనియర్‌ ‌జర్నలిస్ట్, ‌రచయిత వరంగల్‌,
‌రాష్ట్ర విశిష్ఠ పురస్కార గ్రహీత, 8008794162

Leave a Reply