తహసిల్డార్ కార్యాలయాల్లో సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలి
అధికారులకు సిఎస్ ఆదేశం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ మేరకు ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించాలని రెవెన్యూ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ధరణి పోర్టల్ పై రెవెన్యూ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసంగిస్తూ రాష్ట్ర సిఎం 29న ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నారని ముఖ్యమంత్రి అంచనాల మేరకు ధరణి పోర్టల్ ద్వారా సులభంగా, పారదర్శకంగా ఎటువంటి విచక్షణ అధికారాలు లేకుండా వేగంగా ప్రజలకు సేవలందించాలని రెవెన్యూ సిబ్బందిని కోరారు.
ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ వెంటనే జరుగుతోందని అన్నారు. ధరణి దేశంలోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని అన్నారు. ధరణి పోర్టల్ పనితీరుపై సిఎస్ రెవెన్యూ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్లాట్ బుకింగ్, సిటిజన్ ఓపెన్ పోర్టల్ సక్సెసర్ మాడ్యూల్స్, పార్టిషన్ మాడ్యూల్స్‌పై వివరించారు. తహసీల్దార్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ల విధులు, బాధ్యతలపై వివరించారు. రిజిస్ట్రేషన్ సేవలతో రెవెన్యూ అధికారుల బాధ్యత మరింత పెరిగిందని వారు రెవెన్యూ విధులతో పాటు జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుందని అన్నారు.