Take a fresh look at your lifestyle.

సికింద్రాబాద్‌ ‌బోయిన పల్లిలో విషాదం

  • నాలాలో పడి ఏడేళ్ల బాలుడు మృత్యువాత
  • కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు

హైదరాబాద్‌,‌జూన్‌5:  ‌సికింద్రాబాద్‌ ‌బోయిన పల్లి పీఎస్‌ ‌పరిధిలో విషాదం చోటుచేసుకుంది. చిన్న తోకటలో నాలాలో 8 ఏళ్ల బాలుడు పడి మృత్యువాత పడ్డాడు. ఆడుకుంటూ వెళ్లి నిర్మాణంలో ఉన్న నాలాలో ఆనంద్‌సాయి అనే బాలుడు పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో ఆనంద్‌ ‌సాయి మృతదేహాన్ని బయటకు తీశారు. నిర్మాణం చేస్తున్న నాలాకు ఎలాంటి పైకప్పు లేక పోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఇంటిముందు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి నాలాలో పడిపోయాడు. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న డిజాస్టర్‌ ‌టీం.. బాలుడి కోసం మూడు గంటలు శ్రమించినా ఫలితం లేకపోయింది.

బాలుడు పడిపోయిన కొద్దిదూరంలోనే రెస్క్యూ టీం సభ్యులు బాలుడి డెడ్‌ ‌బాడీని గుర్తించారు. నాలాకు రక్షణ గోడ లేకపోవడంతోనే బాబు చనిపోయాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో కటుఉంబ సభ్యుల రోదను మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. పసిబాలుడు మృతి చెందడంతో కాలనీ వాసులు కూడా తీవ్ర దుఃఖంలో మునిగారు.  గతేడాది కూడా సుమేధా అనే చిన్నారి నాలాలో పడి చనిపోయింది. ఆ చిన్నారి మృతికి మున్సిపల్‌ ‌మంత్రి కేటీఆర్‌ ‌కారణమంటూ సుమేధా తల్లి కేసు కూడా పెట్టింది. అయినా కూడా నాలాల చుట్టూ రక్షణ వలయాలు ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గతేడాది వరద ముంపు నేపథ్యంలో జీహెచ్‌ఎం‌సీ అప్రమత్తమైంది. జూన్‌ ‌మొదటి వారంలో నైరుతి రుతు పవనాలు వస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో ముందస్తు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. జోన్లు, సర్కిళ్ల వారీగా 300కు పైగా మాన్‌సూన్‌ ‌బృందాలను రంగంలోకి దింపింది.

రూ.32.9 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. వర్షం పడినప్పుడు సంస్థలోని ఇంజనీరింగ్‌ ‌మెయింటెనెన్స్ ‌విభాగం, విపత్తు స్పందన బృందాలు (డీఆర్‌ఎఫ్‌) ‌సంయుక్తంగా వరద నీటి తొలగింపు, ఇతర సహాయక చర్యలు చేపడతాయని అధికారులు చెబుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో షిఫ్టుల వారీగా 24 గంటలూ బృందాలు అందుబాటులో ఉండేలా జీహెచ్‌ఎం‌సీ చర్యలు చేపట్టింది. వర్ష సూచన ఉందన్న సమాచారం రాగానే క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్‌ ‌విభాగం అధికారులు బృందాలను అప్రమత్తం చేశారు. వరద నీరు నిలిచే ప్రధాన రహదారులు, ముంపు ప్రాంతాలపై ఈ బృందాలు ప్రత్యేక దృష్టి సారించనున్నాయి. కొన్ని బృందాలకు ప్రత్యేకంగా కొన్ని కారిడార్లు కేటాయించి ఆ మార్గంలో నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించే బాధ్యతలు అప్పగించారు. తరచూ నీరు నిలిచే ప్రాంతాలు 138 ఉన్నట్టు గుర్తించారు. ఆ ఏరియాల్లో నీటిని స్టాటిక్‌ ‌టీంలు తొలగిస్తాయి. క్యాచ్‌పిట్ల వద్ద ఉన్న చెత్తా చెదారం తొలగించి వరద సాఫీగా వెళ్లేలా చూస్తారు.

Leave a Reply