Take a fresh look at your lifestyle.

ఎన్ని రోజులైనా రిమాండు చేసుకోండి… ఇక కాంగ్రెస్‌ ‌శ్రేణులు భయపడరు

  • టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి ఘాటు, సంచలన వ్యాఖ్యలు
  • ఫోన్ల హ్యాకింగ్‌పై సుప్రీం జడ్జితో విచారణ చేపట్టాలి : టిపిసిసి నేత నాయిని

సిద్ధిపేట, జూలై 22 (ప్రజాతంత్ర ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా బ్యూరో): ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని సంగారెడ్డి ఎమ్మెల్యే, టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి ఘాటైన, సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్‌ ‌శ్రేణులపై రాష్ట్రంలోని కొందరు పోలీసు అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనీ…45 రోజులు రిమాండు చేసుకుంటారో, 3నెలల పాటు రిమాండు చేసుకుంటారో చేసుకోండి. ఇక మీదట కేసులకు, రిమాండ్లకు కాంగ్రెస్‌ ‌శ్రేణులెవరూ భయపడే ప్రసక్తే లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న మాపై పోలీసులు అతిదారుణంగా వ్యవహరిస్తున్నారనీ మండిపడ్డారు. ప్రజా పోరాటాలు చేస్తున్న మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సిఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే పోలీసులతో అంతు చూస్తామనీ హెచ్చరించారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నేతలైన సోనియా, రాహుల్‌గాంధీతో పాటు మరికొందరు ముఖ్య నేతల ఫోన్స్ ‌ట్యాపింగ్‌పై కాంగ్రెస్‌ ‌పార్టీ ఇచ్చిన ఛలో రాజ్‌భవన్‌ ‌మార్చ్‌లో భాగంగా ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్‌ ‌శ్రేణులనుద్దేశించి జగ్గారెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులు ఎలాంటి పోరాటాలు చేసినా సెక్షన్లు, చట్టాలంటూ రిమాండు చేస్తున్నారనీ, రిమాండు చేస్తే కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు, కార్యకర్తలు పోరాటాలు ఆపేస్తారునుకుంటున్నారనీ, ఆపకపోగా ఉద్యమాలు, పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై మరోసారి పోలీసులు అనుమతి ఇవ్వకుంటే ఏకంగా రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అంటే పోలీసులకు మజాక్‌ అయింది, మా ఓపిక నశిస్తుందన్నారు. ప్రజా సమస్యలు, ఫోన్ల ట్యాపింగ్‌పై శాంతియుతంగా గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇస్తామనీ చెప్పినప్పటికీ అత్యుత్సాహంతో పోలీసులు మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని ప్రధానమంత్రి మోదీ, రాష్ట్రంలోని సిఎం కేసీఆర్‌ ‌వారి వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం పోలీస్‌ ‌యంత్రాంగాన్ని వాడుకుంటున్నారనీ జగ్గారెడ్డి ఆరోపించారు.

ఫోన్ల హ్యాకింగ్‌పై జ్యుడీషియల్‌ ‌విచారణ కమిటీ వేయాలి: టిపిసిసి నేత నాయిని డిమాండు
కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేతలైన సోనియా, రాహుల్‌గాంధీతో పాటు మరికొంత మంది నేతలు, జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లను కేంద్ర ప్రభుత్వం హ్యాకింగ్‌ ‌చేస్తుందనీ, ఈ విషయమైన సుప్రీం కోర్టు జడ్జితో జ్యుడీషియల్‌ ‌కమిటీ చేసి సమగ్రమైన విచారణ చేపట్టాలని గజ్వేల్‌కు చెందిన టిపిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి డిమాండు చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ పిలుపు మేరకు ఛలో రాజ్‌భవన్‌కు వెళ్లకుండా కాంగ్రెస్‌ ‌నేతలు నాయిని యాదగిరి, బయ్యారం మల్లారెడ్డి, సర్ధార్‌ఖాన్‌, ‌ప్రశాంత్‌ ‌రాచకొండ, గుంటుకు శ్రీను, బెజగామ శివారెడ్డి, నల్లా శ్రీధర్‌రావు, మునగరి రాజిరెడ్డి, జమాల్‌పూర్‌ ‌విఠల్‌ ‌తదితరులను ముందస్తుగా గజ్వేల్‌ ‌పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా టిపిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి మాట్లాడుతూ… ఛలో రాజ్‌భవన్‌ ‌మార్చ్‌కు వెళ్లనీయకుండా ముందస్తుగా పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామనీ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడుతుందనీ మండిపడ్డారు. కేంద్రం, రాష్ట్రం విదేశాలకు చెందిన సైబర్‌ ‌నేరగాళ్లతో చేతులు కలిపి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల ఫోన్లను ట్యాపింగ్‌ ‌చేయడం సిగ్గు చేటన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపై నిఘాపెట్టి, వారి వ్యక్తిగత స్వేచ్చను హరించేస్తున్న ప్రధానమంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని నాయిని యాదగిరి డిమాండు చేశారు.

Leave a Reply