- బీజేపీలో చేరనున్న టీ పీసీసీ కోశాధికారి గూడూరు..?
- ఫలించని ఉత్తమ్ రాయబారం
గ్రేటర్ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కోశాధికారి, ఏఐసిసి సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేశాలని నిర్వహించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీని వీడనున్న గూడూరు బీజేపీలో చేరాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. దాదాపు 39 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిల్లో సేవలు అందించిన గూడూరు కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరుపొందారు. రాష్ట్రానికి వచ్చే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల పర్యటనల వ్యవహారాలను చూడటం, బహిరంగ సభలకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో పాటు వాటిని విజయవంతం చేయడంలో గూడూరు కీలక పాత్ర పోషించారు.
పలు సందర్భాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. విద్యార్థి దశ నుంచే క్రియాశీల రాజకీయాలలో ప్రవేశించిన గూడూరు పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యుఐతో పాటు కాంగ్రెస్ పార్టీ యువజన్థ విభాగం నాయకునిగా పనిచేశారు. కాంగ్రెస్‌కు గూడూరు చేసిన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం 2015లో ఆయనను టీ కాంగ్రెస్ కోశాధికారిగా నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం తన వంతు కృషి చేశారు.
ఒకటి రెండు రోజుల్లో ఆయన పార్టీకి రాజీనామా విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది., కాగా, టీ పీసీసీ కోశాధికారి గూడూరు పార్టీకి రాజీనామా చేయనున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. పార్టీని వీడవద్దని ఉత్తమ్ నచ్చజెప్పగా గూడూరు అందుకు నిరాకరించినట్లు తెలిసింది. బీజేపీకి చెందిన జాతీయ నేతలు గూడూరుతో పార్టీలో చేరే విషయంపై బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారనీ, ఆ పార్టీలో చేరే విషయాన్ని ఒకటి రెండు రోజుల్లో గూడూరు స్వయంగా ప్రకటించనున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.