పార్టీలోకి చేరేందకు కుట్రలు: నిరంజన్
హైదరాబాద్,ప్రజాతంత్ర: ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుల ఫోన్ సంభాషణ వింటే అశ్చర్యం వేస్తోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీలు ఎంతటికైన దిగజారుతాయనడానికి ఈ కేసు నిదర్శనమన్నారు. సిట్ విచారణలో రాష్ట్రంలో ఉన్న చాలా మంది నాయకుల పేర్లు.. ఫోన్ సంభాషణలు బయటకు వచ్చాయ న్నారు. ఆయా కేసుల్లో వారి ప్రమేయం లేకున్నా భయపెట్టి బీజేపీ పార్టీలో చేర్చుకునే కుట్ర జరుగుతోందని విమర్శించారు. తప్పుడు దారులు తొక్కి ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. 2014 ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇలాంటి కార్యక్రమాలకు తోవ చూపారన్నారు. ఇప్పుడు బీజేపీ అనుసరిస్తోందన్నారు.
ఇతర పార్టీలోని నేతల్ని కేసుల పేరుతో భయపెట్టి బీజేపీ చేర్చుకోవడం సరైంది కాదన్నారు. మోదీ, అమిత్ షా తర్వాత బీజేపీలో బీఎల్ సంతోష్ పేరు ఫాంహౌస్ కేసులో వచ్చిందన్నారు. సంతోష్, రామచంద్ర భారతి చర్చలు జరిపినట్లు సిట్ విచారణలో తేలిందని, సిట్ విచారణలో తేలిన విషయాలపై ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ స్పష్టత ఇవ్వాలని నిరంజన్ డిమాండ్ చేశారు.