Take a fresh look at your lifestyle.

మోదీ, కేసీఆర్‌ ‌తోడు దొంగలు

  • యూపీ, రాజస్థాన్‌ ఎన్నికలలో ఓటమి భయంతోనే వ్యవసాయ చట్టాల రద్దు
  • కేసీఆర్‌ ఏనాడైనా రైతుల దీక్షకు మద్దతు పలికారా ? : టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి : త్వరలో యూపీ, రాజస్థాన్‌ ‌రాష్ట్రాలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తుడిచి పెట్టుకుని పోతుందన్న భయంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని టీ పీసీసీ చీఫ్‌ ఎ.‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. మోదీ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం తమ ఘనతేనని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌ ఏనాడైనా రైతుల దీక్షకు మద్దతు ప్రకటించారా అని ప్రశ్నించారు. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో నిర్వహించిన ఉద్యమంలో అమరులైన రైతులకు టీ పీసీసీ ఆధ్వర్యంలో శనివారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ దేశానికి మోదీ, రాష్ట్రానికి కేసీఆర్‌ ‌చీడ పురుగులా తయారయ్యారని వ్యాఖ్యానించారు. మోదీ అప్రజాస్వామిక వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగానే గులాబీ దండు కేసీఆర్‌కు పాలాభిషేకాలు చేస్తున్నదనీ, ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ ముందు సాగిలపడిన సీఎం కేసీఆర్‌ ‌రైతుల దీక్షకు ఎందుకు సంఘీభావం ప్రకటించలేదని నిలదీశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమంలో దాదాపు 700 మంది రైతులు అమరులు అయ్యారనీ, రైతుల చావులకు ప్రధాని నరేంద్ర మోదీనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ ‌దర్నాతో మోదీ దిగి వచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని టీఆర్‌ఎస్‌ ‌నేతలు చెబుతున్నారనీ, అదే నిజమైతే కేసీఆర్‌ ‌మోదీ మెడలు వంచి రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజనూ కొనుగోలు చేసే విధంగా ఎందుకు ప్రయత్నం చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నిక, జీఎస్టీ, ట్రిపుల్‌ ‌తలాక్‌, ‌నోట్ల రద్దు వంటి బిల్లుల ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతిచ్చిన టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఇప్పుడు నిస్సిగ్గుగా తమ ఉద్యమం ఫలితంగానే మోదీ ప్రభుత్వం దిగివచ్చిందని చెప్పుకోవడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌పార్టీ నెలల పాటు పార్లమెంటులో నిర్విరామంగా పోరాడిందనీ, ఈ అంశంపై పార్లమెంటును సైతం స్థంభింపజేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రైతుల దీక్షకు తమ పార్టీ నేతలు వెన్నుదన్నుగా ఉన్నారనీ, కొత్త వ్యవసాయ చట్టాల రద్దుపై రైతుల ఉద్యమానికి అండగా నిలచింది కాంగ్రెస్‌ ‌పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ను గద్దె దించే వరకూ రైతులు విశ్రమించవద్దని ఈ సందర్భంగా రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a Reply