Take a fresh look at your lifestyle.

సంపాదకుల్లో శిఖరాగ్రాన రాఘవాచారి

నేడు  83వ జయంతి

వృత్తిలో, ప్రవృత్తిలోనూ సిద్ధాంతకర్తగా నిలిచి దాదాపు అర్ధ శతాబ్దం పాటు విశాలాంధ్ర సంపాదకులుగా చైతన్యం రగిలించి ఎందరిలోనూ స్ఫూర్తి నింపిన చక్రవర్తుల రాఘవాచారి 83వ జయంతిన నేడు పత్రికాలోకం, పాఠకలోకం స్మరించుకుని నివాళులర్పిస్తున్నది. 1939 సెప్టెంబరు 10వ తేదీన వరంగల్ జిల్లా శాతాపురంలో సంప్రదాయ కుటుంబంలో పుట్టినా కట్టుబాట్లను తెంచుకుని, కమ్యూనిస్టు భావజాలం వైపు ప్రయాణించి, పత్రికా రంగంలో వేలాది మందికి ఆదర్శప్రాయంగా నిలిచిన అక్షరాల చక్రవర్తి రాఘవాచారి. ఆయనది అక్షర తూణీరం..

రాఘవాచారికి కృష్ణా, గుంటూరు జిల్లాలతో సన్నిహిత అనుబంధం ఉంది. 33ఏళ్ల సుదీర్ఘకాలం విశాలాంధ్ర సంపాదకులుగా పనిచేసిన ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1992 నవంబర్ గుంటూరులో జరిగిన అరసం 11వ రాష్ట్ర మహాసభలో ప్రారంభోపన్యాసంతో ఆకట్టుకున్నారు. కమ్యూనిస్టు రచయిత బొల్లిమంత శివరామకృష్ణ సాహితీ పురస్కారాన్ని 2009లో అందుకున్నారు. ప్రజానాట్య మండలి నేత కందిమళ్ల ప్రతాపరెడ్డితో కలిసి పలు సభల్లో ప్రసంగించారు. తుమ్మల వెంకట్రామయ్య జయంతి సభలో అప్పట్లో ఆయన ప్రసంగం అందరినీ ఆకర్షించింది. గుంటూరులో జరిగిన న్యాయవాదుల సంఘం వార్షికోత్సవ సభలో ముఖ్యఅతిథిగా ప్రసంగించి, న్యాయవాదుల్లో నూతనోత్సాహం నింపారు.  ఆయన షష్టిపూర్తిని విజయవాడలో 1999లో అభిమానులు, మిత్రులు ఘనంగా నిర్వహించారు.

తక్కువగా రాయడం నియమంగా పెట్టుకున్న సంపాదకుడు కనుక విశ్లేషణలోతొందరపాటు ఉండేదికాదు. రాయడంకన్నా ప్రసంగించడానికే ఎక్కువ ఇష్టపడేవారు. సభారంజకంగా ఔచిత్యంతో మాట్లాడగల దిట్ట రాఘవాచారి. విజయవాడ సభలలో వక్తగానే ఎక్కువ పేరుపొందారు. జర్నలిజం క్లాసులు, విశ్వవిద్యాలయాల కార్యక్రమాల్లో ఉపన్యాసాలలో తరచూ పాల్గొనేవారు, ఎవరినీ నొప్పించకపోవడం మాత్రమేకాదు అవసరమైనచోట పదునుగా సమయస్ఫూర్తితో ఛలోక్తి విసిరేవారు. నిబద్ధ, విశే్లషణాత్మక జర్నలిజం ఆయన నైజం. పత్రికా రచనలో తానే మేటి చక్రవర్తిగా వెలుగొందారు. తెలుగు పత్రికా రంగానికి ఆయన చేసిన సేవలను తెలుగువారు నిత్యం స్మరించుకుంటూనే ఉంటారు.  విద్యార్థి దశలోనే ఆయనపై ముఖ్దూం మొహియుద్దీన్‌, శ్రీశ్రీల ప్రభావం పడింది. న్యాయ శాస్త్రంలో విద్యనభ్యసించిన రాఘవాచారి న్యాయవాద వత్తిని కాకుండా పాత్రికేయ రంగాన్ని ఎంచుకున్నారు.

తనదైన శైలిలో ఎన్నెన్నో వినూత్నమైన సంపాదకీయాలు రాసి ఆ పత్రికకు గొప్ప సొబగులు తెచ్చారు. చరిత్ర లోతుల్ని శోధించి గంభీరంగా మాట్లాడే నేర్పు ఆయన సొంతం. రాఘవాచారి నిరంతర విద్యార్థి. ఆయన అధ్యయనం విస్తారం.. వైవిధ్యభరితమైనది. సంస్కతం, తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ఆయన పండితుడు. ప్రాచీన సాహిత్యం, మార్క్సిస్ట్‌ గ్రంథాలపై ఆయనకు గట్టి పట్టు ఉండేది. రాఘవాచారి సంపాదకీయాలపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. ఆయన జీవితకాలంలో ఎవరి పైనా ఆగ్రహం వ్యక్తం చేయడం, కేకలు వేయడం, నిష్ఠూరంగా మాట్లాడటం, ద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడం, చెడుగా మాట్లాడటం చూడలేదని సన్నిహితంగా మెలిగినవారు చెపుతారు. విలువలు, నైతికతలోనూ ఆయన ఎక్కడా రాజీ పడలేదు. ఏటా విజయవాడలో, హైదరాబాద్ లో నిర్వహించే పుస్తక మహోత్సవాల్లో ఆయన ప్రతీరోజు స్టాళ్లనూ సందర్శించి పుస్తక విక్రేతలను, పాఠకులనూ ప్రోత్సహించేవారు.

సిసలైన సంపాదకుడు, లోతయిన అధ్యయనశీలి, ఆకట్టుకునే వక్త, సంభాషణా చతురుడు, మృదువైన స్నేహశీలి, ఆకర్షణీయమైన స్ఫురద్రూపి. ‘విశాలాంధ్ర’దినపత్రికకు మూడు దశాబ్దాలకు పైగా విజయవాడనుంచే సంపాదకత్వం వహించడంతోపాటు, బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత కూడా విజయవాడలోనే ప్రధానంగా ఉన్నందున రాఘవాచారిని చాలామంది విజయవాడ  వ్యక్తిగా పరిగణిస్తారు. జీవితంలో విలువలకు గాక జీతమే విలువైనదనుకుని ఉంటే అయన ప్రధాన తెలుగు పత్రికలకే కాదు ఇంగ్లీషు పత్రికలకు సైతం ఎడిటర్ అయి ఉండేవారు. ఎక్కడికక్కడ త్యజిస్తూ, చాలా సాధారణ జీవితం సాగించారు.

‘కార్పొరేట్ పత్రికలు ఆయన్ను సంపాదకుడిగా రావాలంటూ ఆహ్వానించినప్పటికీ సున్నితంగా తిరస్కరించడం ఆయనకున్న నిబద్ధతను చెబుతుంది. అందుకే ఆయన జీవితాంతం కమ్యూనిస్టుగానే బతికారు.  జీవితంలో, వత్తిలో పాటించిన విలువలు చిరస్మరణీయం. తక్కువగా రాయడం నియమంగా పెట్టుకున్న సంపాదకుడు కనుక విశ్లేషణలో తొందరపాటుతనం ఉండేదికాదు. రాయడంకన్నా ప్రసంగించడానికే ఎక్కువ ఇష్టపడేవారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి చక్కని వేదిక అయ్యింది. ఉషశ్రీ వారికి మంచి మిత్రులు. యువతరానికి ఆయన జీవితం ఎంతో స్ఫూర్తి. చివరిదాకా ప్రజలకోసం అంకితమయ్యారు.  జర్నలిస్టుగా, సామాజిక వేత్తగా రాఘవాచారి అందించిన సేవలను గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రెస్‌ అకాడమీకి చక్రవర్తుల రాఘవాచారి పేరు స్థిరపరచి ఆయనను సముచితరీతిలో గౌరవించింది.

—  నందిరాజు రాధాకృష్ణ. సీనియర్ పాత్రికేయుడు

98481 28215   

Leave a Reply