Take a fresh look at your lifestyle.

మొదటి ప్రమాద స్థాయిని మించి ప్రవహించే దిశగా.. భదాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి

అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్‌ అనుదీప్‌
ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ భాగాన ఉన్న ప్రాజెక్టులు అన్నీ నిండి ప్రమాద స్ధాయిని మించి ఉండటంతో ఆయాప్రాంతాల అధికారులు నీటిని దిగువ భాగానికి విడుదల చేస్తున్నారు. ఈ కారణంగా భద్రాచలంకు వరదనీరు పోటెత్తింది. దీంతో శుక్రవారం సాయంత్రానికి భదాద్రి వద్ద గోదావరి 30 అడుగులకు చేరుకుంది. ఇది క్రమంగా పెరుగుతూ శనివారం సాయంత్రంకు 43 అడుగులకు చేరుకుంటే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఇది క్రమంగా పెరుగుతూ 53 అడుగులకు చేరుకుని మూడవ ప్రమాద హెచ్చరికకు చేరుకునే అవకాశం ఉందని భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ అధికారులను హెచ్చరించారు. ఎప్పటికప్పుడు వరద పరిస్ధితిని గమనిస్తూ ఉండాలని ఆదేశాలు జారీ చేసారు. రాత్రి సమాయాల్లో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముంపుకు గురయ్యే గ్రామాలను ముందుగానే పునరావాస ప్రాంతాలకు తరలించాలని కోరారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువప్రాంతాల నుంచి వొస్తున్న వరదనీరు ఎక్కువుగా ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పునరావాస కేంద్రాలో ఉండే బాధితులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను కోరారు.

శనివారం సాయంత్రం వరకు 53 అడుగులకు చేరుకుంటుందని కలెక్టర్‌ అం‌చనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అధికారులను అప్రమత్తంచేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీచేసారు. ఇప్పటికే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలెక్టర్‌ అనుదీప్‌ ‌కలిసి శుక్రవారం సాయంత్రం భద్రాచలం పట్టణంలోనే లోతట్టు ప్రాంతాలు, కరకట్ట, బ్రిడ్జి వద్ద నుండి గోదావరిని పరిశీలించారు. వరద తాకిడిని అధిగమించేందుకు అధికారులకు సూచనలు చేసారు. అలాగే అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సీఎం కేసిఆర్‌ ‌గారు స్వయంగా చెప్పారు కాబట్టి అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. చెరువులు, కుంటలు, వాగుల వద్ద బలహీనంగా ఉన్న కట్టలను గుర్తించి తెగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఇంకో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతున్నందున తగిన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని, ఇక ముందు కూడా జరగకుండా చూడాలన్నారు.జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సిబ్బంది, డాక్టర్లు అందుబాటులో ఉండాలని, ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్యం ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని డియం&హెచ్‌ఓను ఆదేశించారు. వీలైతే ఎక్కడికక్కడే ర్యాపిడ్‌ ‌టెస్టస్ ‌చేయాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో విష జ్వరాలు ప్రబలే పరిస్థితులు అధికంగా ఉంటాయి కాబట్టి, మలేరియా, డెంగ్యూ, ఇతర విష జ్వరాలు రాకుండా చర్యలు తీసుకోవలన్నారు. ఒకవేళ ఎవరైనా తీవ్ర జ్వరంతో బాధపడితే అది విస్తరించక ముందే వారిని గుర్తించి తక్షణమే వైద్యం అందించాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్యం ఎప్పటికప్పుడు చేపట్టాలని, పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించరాదని అధికారులను హెచ్చరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సరెండర్‌ ‌చేస్తామని హెచ్చరించారు. ఏ అధికారి కూడా సెలవులు పెట్టవద్దని కలెక్టర్‌ ఇప్పటికే ఆదేశాలు జారీచేసారు.

Leave a Reply