Take a fresh look at your lifestyle.

‘‌న భూతో నభవిష్యత్‌…’

  • సిఎం కేసీఆర్‌ ‌చేతుల మీదుగా..
  • రేపు కొండపోచమ్మ సాగర్‌ ‌ప్రారంభోత్సవం
  • ముఖ్య అతిథిగా చిన జీయర్‌ ‌స్వామి
  • భారీగా హాజరుకానున్న వివిఐపిలు, విఐపిలు
  • భారీగా ఏర్పాట్లు…అన్నీ తానై చేస్తున్న మంత్రి హరీష్‌రావు
  • తీరనున్న రైతన్న నీటి కష్టాలు

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని మర్కూక్‌ ‌మండలంలోని పాములపర్తి శివారులో నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్‌ ‌పనులన్నీ పూర్తి చేసుకుంది. మరికొన్ని గంటలలోనే ప్రారంభోత్సవం కానున్నది. ఈ ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చేతుల మీదుగా ప్రారంభం కానుండగా…ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి చిన జీయర్‌ ‌స్వామి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారనీ అత్యంతమైన విశ్వసనీయ వర్గాలు బుధవారమిక్కడ ‘ప్రజాతంత్ర’ ప్రతినిధికి తెలిపాయి. ఈ ప్రాజెక్టును ‘ న భూతో న భవిష్యత్‌ ’ అన్న రీతిలో ప్రారంభోత్సవం చేసేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నీ తానై ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవానికి సుమారుగా 1500మంది అతిథులు హాజరు కానున్నారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు హాజరుకానుండగా..స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కొండపోచమ్మ ఆలయం వద్ద కొందరు..మరికొందరు స్థానికంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Tomorrow Kondapochamma Sagar Opening Ceremony1
కొండపోచమ్మ రిజర్వాయర్‌

ఈ నెల 29న కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దినపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రపంచ ఇంజనీరింగ్‌ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లను చేర్చే అపూర్వ ఘట్టానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు శ్రీకారం చుట్టారు. ఆయన చేతుల మీదుగా శుక్రవారం ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణలో అత్యధిక ఎత్తులోకి గోదావరి నది నీళ్లు చేరనున్నాయి. కొండపోచమ్మసాగర్‌ ‌శిగలో గంగమ్మ కొలువుదీరనుంది. గోదావరి నదిపై లక్ష్మి బ్యారేజి (మేడిగడ్డ) నుంచి వివిధ దశల ఎత్తిపోతల ద్వారా తరలించే నీరు 618 మీటర్ల అత్యధిక ఎత్తులో గల కొండపోచమ్మ సాగర్‌ ‌రిజర్వాయర్‌లోకి చేరుతాయి. 15 టీఎంసీల సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్‌ ‌నుంచి గ్రావిటీ ద్వారా సాగునీటి అవసరాల కోసం నీరు కరువు ప్రాంతాలకు చేరుతుంది.

Tomorrow Kondapochamma Sagar Opening Ceremony2
‌కొండపోచమ్మ రిజర్వాయర్‌ ‌ప్రారంభోత్సవానికి సిఎం కేసీఆర్‌ ‌రానున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి హరీష్‌రావు, ఇతర ఉన్నతాధికారులు

కొండపోచమ్మ ప్రాజెక్ట్ ‌వివరాలు…

  • సామర్థ్యం : 15 టీఎంసీలు
  • కట్ట: 15.8 కిలోమీటర్లు
  • ప్రాజెక్టు వ్యయం : 1,540 కోట్లు
  • మొత్తం ఆయకట్టు : 2,85,280 ఎకరాలు

లబ్ధిపొందనున్న జిల్లాలు: సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, ‌మేడ్చల్‌ ‌మల్కాజిగిరి, యదాద్రి భువనగిరిప్రధాన కాల్వలు: రామాయంపేట, గజ్వేల్‌, ఉప్పరపల్లి, కిష్టాపూర్‌, ‌తుర్కపల్లి, జగదేవ్‌పూర్‌, ‌తుర్కపల్లి(ఎం), శంకరంపేట, సంగారెడ్డి.

పేరుకు కారణమిదే…
అత్యధిక ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు కొండ పోచమ్మ పేరు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. ఉమ్మడి మెదక్‌, ‌వరంగల్‌, ‌నల్గొండ జిల్లాల సరిహద్దులో కొండ పోచమ్మ దేవాలయం ఉంటుంది. దాని సమీపంలోనే కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయం (మల్లన్న గుడి) ఉంటుంది. రెండు దేవాలయాలకు ఎంతో ప్రశస్తి ఉంది. నిత్యం భక్తులతో కళకళలాడే దేవాలయాలు. ఒక గుడికి వచ్చిన భక్తులు మరో గుడికి వెళ్లే సంప్రదాయం ఉంది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నిర్మించే అతి పెద్ద రిజర్వాయర్‌ ‌కు మల్లన్న సాగర్‌ అని, అత్యధిక ఎత్తులో నిర్మించే రిజర్వాయర్‌ ‌కు కొండ పోచమ్మ సాగర్‌ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నామకరణం చేశారు. కొండ పోచమ్మకు ఈ ప్రాంతంలో లక్షల సంఖ్యలో భక్తులున్నారు. నిత్యం వచ్చి పూజలు చేస్తారు. తమను చల్లగా చూసే దేవతగా పేరుంది. కొండ పోచమ్మ సాగర్‌ ‌కూడా ఈ ప్రాంత వ్యవసాయానికి, తాగునీటికి, ఇతర అవసరాలు కూడా తీర్చేదిగా ఉండాలనే ఉద్దేశ్యంతో సిఎం కేసీఆర్‌ అమ్మవారి పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టును ఓ దేవాలయం మాదిరిగా భావిస్తున్న కేసీఆర్‌, అం‌దుకు అనుగుణంగానే ప్రారంభోత్సవానికి స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చండీయాగం, సుదర్శన యాగం, గంగమ్మ పూజలు తదితర కార్యక్రమాలను కొండపోచమ్మ సాగర్‌ ‌ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నారు.

చిన జీయర్‌ ‌స్వామి ముఖ్య అతిథిగా…ప్రత్యేక పూజలతో..
29న ప్రారంభించనున్న ఈ ప్రాజెక్టుకు ముఖ్య అతిథిగా చిన జీయర్‌ ‌స్వామి రానున్నారు. ఆయన ఆధ్వర్యంలో ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయని విశ్వసనీయ సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం…శుక్రవారం ఉదయం 4 గంటలకు ఏక కాలంలో కొండ పోచమ్మ దేవాలయంలో చండీయాగం, కొండపోచమ్మ సాగర్‌ ‌పంపుహౌజ్‌ (‌మర్కూక్‌) ‌వద్ద సుదర్శన యాగం ప్రారంభమవుతాయి. ఇక్కడ ఛైర్మన్‌ ‌రాచమల్ల ఉపేందర్‌రెడ్డి, జగదేవ్‌పూర్‌ ‌మండల రైతుబంధు సభ్యుడు జంబుల శ్రీనివాస్‌రెడ్డి, మర్కూక్‌లో సర్పంచి భాస్కర్‌, ‌కరుణాకర్‌రెడ్డి, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారనీ సమాచారం. అయితే, ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దంపతులు ప్రాజెక్టు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే కొండ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం ఉందనీ తెలుస్తుంది. ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి, మర్కూక్‌ ‌గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు సీఎం కేసీఆర్‌ ‌శంకుస్థాపన చేస్తారు. అనంతరం మర్కూక్‌ ‌వద్ద గల కొండ పోచమ్మ సాగర్‌ ‌కు నీటిని లిఫ్టు చేసే పంపు హౌజు వద్దకు చేరుకుంటారు. 10 గంటల సమయంలో పంపుహౌజు వద్దకు చేరుకునే చినజీయర్‌ ‌స్వామికి కేసీఆర్‌ ‌స్వాగతం పలుకుతారు. అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. అనంతరం పంపుహౌజ్‌ ‌స్విచ్చాన్‌ ‌చేస్తారు. అక్కడి నుంచి ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్‌ (‌నీరు చేరుకునే ప్రాంతం) వద్దకు వచ్చి గోదావరి జలాలకు స్వాగతం పలుకుతారు. గోదావరి గంగమ్మకు పూజలు నిర్వహిస్తారు.

అన్నీ తానై ఏర్పాట్లు చేస్తున్న మంత్రి హరీష్‌రావు..
సిద్ధిపేట జిల్లా మర్కుక్‌ ‌మండలం కొండ పోచమ్మ జలాశయాన్ని ఈ నెల 29న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అన్నీ తానై ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సిఎం కేసీఆర్‌, ‌చిన జీయర్‌ ‌స్వామితో పాటు వందలాది మంది అతిరథ మహారథులు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి హరీష్‌రావుతో పాటు సిఎం కేసీఆర్‌ ‌వ్యక్తిగత సహాకుడు వేముల ప్రశాంత్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్‌ ‌జోయల్‌ ‌డేవీస్‌, ‌కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్‌, ‌కొండ పోచమ్మ సాగర్‌ ఎస్‌ఈ ‌వేణు, ఇతర జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు. కొండపోచమ్మ సాగర్‌ ‌ప్రారంభోత్సవానికి సిఎం కేసీఆర్‌ ‌రానున్న సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించి, కావాల్సిన ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో అక్కడికక్కడే మంత్రి హరీష్‌రావు సమీక్షించారు. కొరోనా నేపథ్యంలో క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికార వర్గాలకు మంత్రి హరీశ్‌ ‌రావు ఆదేశించారు. సిఎం కేసీఆర్‌ ‌రాక సందర్భంగా.. పోలీసు బందోబస్తు, వీఐపీ, వీవీఐపీ, సాధారణ ప్రజానీక వాహనాల పార్కింగ్‌ ‌సదుపాయాలపై పోలీసు కమిషనర్‌ ‌జోయల్‌ ‌డేవీస్‌ ‌తో చర్చించి ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేయాలని సిపి ఆదేశించారు. సిఎం కేసీఆర్‌తో పాటుగా 200 మంది వీవీఐపీ, వెయ్యి మంది వీఐపీ, మీడియాకు బ్లాకుల వారీగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారిక వర్గాలు, నిర్వాహకులకు మంత్రి సూచించారు. సిఎం కేసీఆర్‌ ‌ప్రారంభించడానికి సర్జిపూల్‌ ‌పంప్‌ ‌హౌసులో ఉన్న మోటార్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. కొండ పోచమ్మ సాగర్‌ ‌బండ్‌- ‌కట్టను పరిశీలించి, శాస్త్రోక్తంగా పూజలు జరిపేలా.. వీక్షించేలా అనువైన స్థల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి హరీష్‌రావు చర్చించారు.

Leave a Reply