- హాకీలో స్పెయిన్‌పై 3-0 తేడాతో భారత్ విజయం
- బాక్సింగ్‌లో క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా
- పతకాల వేటలో భారత్ అథ్లెట్ల విఫలం..అడుగంటుతున్న ఆశలు
టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. గ్రూపు-ఏ మూడో మ్యాచ్‌లో స్పెయిన్‌ను 3-0 తేడాతో మట్టికరిపించింది. ఆస్ట్రేలియా చేతిలో ఆదివారం 1-7 తేడాతో ఘోర పరాజయం తర్వాత అద్భుతంగా పుంజుకున్న మన్దీప్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు ఈ మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్‌లోనే రెండు గోల్స్ చేసింది. మ్యాచ్ 14వ నిమిషంలో సిమ్రన్‌జిత్ సింగ్ తొలి గోల్ చేసి బోణీ కొట్టాడు. ఆ తర్వాత రూపిందర్ పాల్ రెండు గోల్స్(15ని, 51ని)తో భారత్‌ను స్పష్టమైన ఆధిక్యంలో నిలబెట్టాడు. ప్రత్యర్థి స్పెయిన్ ఏ దశలోనూ భారత్‌ను నిలువరించలేకపోయింది. దీంతో భారత జట్టు 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఇక తొలి మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
బాక్సింగ్‌లో క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా
టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ మహిళల 69 కిలోల బాక్సింగ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో జర్మనీకి చెందిన నాదినె ఎపెట్జ్పై 3-2తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. తదుపరి మ్యాచ్‌లో గెలిస్తే లవ్లీనాకు పతకం ఖాయం. లవ్లీనా పతకానికి అడుగు దూరంలో ఉంది. తొలి మ్యాచ్‌లో బై లభించడంతో లవ్లీనా నేరుగా ప్రిక్వార్టర్‌కు దూసుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో 12 ఏళ్ల అనుభవం ఉన్న ప్రత్యర్థి నాదినెపై లవ్లీనా విజయం సాధించింది. దీంతో ఒలింపిక్స్ అరంగేట్రంలోనే లవ్లీనా అదరగొట్టింది. ఇక్కడ యాధృచ్చికం ఏంటంటే.. వీరిద్దరికీ ఇదే తొలి ఒలింపిక్స్.
పతకాల వేటలో భారత్ అథ్లెట్ల విఫలం.. అడుగంటుతున్న ఆశలు
ఒలింపిక్స్‌లో చానూకు తప్ప మరో పతకం మన ఖాతాలో పడలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇండియన్ అథ్లెట్లు ఒక్కొక్కరుగా ఉత్త చేతులతో వెనుదిరుగుతున్నారు. తొలి రోజే వి•రాబాయి చాను సిల్వర్‌తో మెరవడం తప్ప తర్వాతి మూడు రోజులూ ఇండియన్ టీమ్‌కు తీవ్ర నిరాశాజనకమైన ఫలితాలే వొచ్చాయి. నాలుగో రోజైన మంగళవారం కూడా పరిస్థితి అలాగే ఉంది. షూటర్లు మరోసారి తీవ్రంగా నిరాశపరిచారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్లలోనూ ప్రతికూల ఫలితాలే వొచ్చాయి. మంగళవారం చెప్పుకోదగిన విజయం ఏదైనా ఉందంటే అది తొలిసారి ఒలింపిక్స్‌తో తలపడుతున్న బాక్సర్ లవ్లీనా విజయమే.