- డబ్ల్యూహెచ్ఓ ప్రతిపాదనను తిరస్కరించిన చైనా
- కొరోనా అనంతరం ఆరోగ్య సమస్యలు..అధ్యయనంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి
- కోలుకున్న తర్వాత ఆలోచన, ఏకాగ్రతపై ప్రభావం
కోవిడ్-19 మహమ్మారి మూలాలపై మరోసారి దర్యాప్తు జరపాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రతిపాదనను చైనా శుక్రవారం తోసిపుచ్చింది. ఈ వ్యాధి ఎలా ప్రారంభమైందో తెలుసుకోవడానికి రాజకీయ ప్రయత్నాలకు బదులుగా శాస్త్రీయ కృషికి మద్దతిస్తామని తెలిపింది. చైనా వైస్ ఫారిన్ మినిస్టర్ మా ఝఓక్సు శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ, కొరోనా వైరస్ ప్రారంభం గురించి తెలుసుకోవడానికి రాజకీయంగా జరిగే ప్రయత్నాలను, తాము వ్యతిరేకిస్తామన్నారు. ఈ వైరస్ మూలాలను గుర్తించేందుకు సహకరించడానికి చైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. సహకరించడానికి ఎప్పుడూ తిరస్కరించలేదన్నారు. అయితే దర్యాప్తునకు రాజకీయ రంగు పులమడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ జాయింట్ రిపోర్టులో చెప్పినట్లుగా ఈ మహమ్మారి మూలాలపై ఫాలో-అప్, సప్లిమెంటరీ రీసెర్చ్ చేస్తున్నామని చెప్పారు. తదుపరి పరిశోధనను శాస్త్రవేత్తలు మాత్రమే నిర్వహించాలన్నారు. కేవలం జూనోటిక్ ఆరిజిన్స్, వ్యాప్తి మార్గాల గురించి మాత్రమే పరిశోధన జరగాలని చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ గత నెలలో ఓ ప్రతిపాదన చేసింది.
చైనాలో కొరోనా వైరస్ మూలాలను గుర్తించే రెండో దశ అధ్యయనాలు జరగాలని పేర్కొంది. చైనాలోని వూహన్, బీజింగ్‌లలో ఉన్న ప్రయోగశాలలు, మార్కెట్ల ఆడిట్ జరగాలని తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ గురువారం విడుదల చేసిన ప్రకటనలో, ప్రస్తుత పరిస్థితిని అన్ని ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా చూడాలని పిలుపునిచ్చింది. కొరోనా వైరస్ మహమ్మారి మూలాలను వేగంగా గుర్తించేందుకు అన్ని ప్రభుత్వాలు సహకరించాలని కోరింది. భవిష్యత్తులో మహమ్మారులను సృష్టించగలిగే రోగ కారకాల విషయంలో చేపట్టవలసిన ఉమ్మడి కార్యాచరణను రూపొందించేందుకు ఏకతాటిపైకి రావాలని కోరింది. కోవిడ్-19 వైరస్ మొదట చైనాలోని వూహన్‌లో 2019లో కనిపించింది. ఆ తర్వాత యావత్తు ప్రపంచానికి విస్తరించింది. ఓ శతాబ్దంలో అత్యంత దారుణమైన మహమ్మారిగా ప్రపంచాన్ని వేధిస్తుంది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా దాదాపు 43 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
కొరోనా అనంతరం ఆరోగ్య సమస్యలు..అధ్యయనంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి
న్యూఢిల్లీ, ఆగస్ట్ 13 : కొరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా పలు రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వీటికి సంబంధించిన వివరాల్ని సేకరించేందుకు తాజాగా జరిగిన అధ్యయనంలో పలు అంశాలు వెలుగులోకి వొచ్చాయి. ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన పరీక్షల సర్వేలో పాల్గొన్న వారిలో కోవిడ్ తక్కువగా సోకిన వారు.. తీవ్రత ఎక్కువగా ఉన్న వారున్నారు. తీవ్ర స్థాయిలో కోవిడ్ బారిన పడిన వారికి సంబంధించి కొత్త విషయం వెలుగు చేసింది. ఈ ఆన్ లైన్ పరీక్షలో కోవిడ్ తీవ్రస్థాయిలో వొచ్చిన వారంతా తక్కువ మార్కులు తెచ్చుకున్నట్లుగా గుర్తించారు. ముఖ్యంగా వీరంతా లాజికల్ క్వశ్చన్లకు సమాధానాలు ఇచ్చే విషయంలో తీవ్రమైన ఇబ్బందులకు గురైనట్లుగా గమనించారు. తమకు అందిన డేటా మీద మరింత లోతుగా అధ్యయనం చేసినప్పుడు..
హాస్పిటళ్లలో చేరి వెంటిలేటర్ల సాయంతో శ్వాస పొందిన వారంతా.. విషయాల్ని గ్రహించటంలో ఇబ్బందులకు గురవుతున్నట్లుగా తేల్చారు. వారిలో విషయ గ్రహణ నైపుణ్యంతో పాటు ఆలోచన, ఏకాగ్రత విషయంలోనూ వారికి సమస్యలు ఎదురవుతున్నట్లుగా తేల్చారు. తగ్గిన ఏకాగ్రత..విషయ గ్రహాక శక్తిని పాయింట్ల లెక్కలో చెప్పాలంటే ఐక్యూ సామర్థ్యంలో వారికి ఉండే దానిలో ఏడు పాయింట్ల మేర తగ్గినట్లుగా గుర్తించారు. ఈ సమస్యను చూసినప్పుడు..కొరోనా బారిన పడటం ఎంత ప్రమాదకరమన్న విషయం అర్థమవుతుంది.