Take a fresh look at your lifestyle.

నేడు టిఆర్‌ఎస్‌ఎల్పీ మేధో మథనం

నేడు టిఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం కాబోతున్నది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎంఎల్యేలు, పార్టీ కార్యవర్గ సభ్యులు విధిగా హాజరు కావాలని పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్లు తెలుస్తున్నది. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో త్వరితగతిన జరుగుతున్న అనేక మార్పుల నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశం అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ముఖ్యంగా మునుగోడు ఎన్నికలో తమ గెలుపు ఖాయమన్న ధీమాతోఉన్న బిజెపి ఇక్కడ ఓటమిని దిగమింగుకోలేకపోతున్నది. దానికి తోడు ఎంఎల్‌ఏల కొనుగోలు అంశం ఆ పార్టీని మరింతగా వేధిస్తున్నది.. ఈ అంశం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కాషాయ జండా ఎగురవేయడంలో వేసిన ఎత్తుగడల రహస్యాలను బయట పెట్టేదిగా ఉండడం ఇప్పుడాపార్టీకి కక్కలేక మింగలేకుండా ఉంది. ఇంత అవమానానికి గురిచేసిన తెరాసను మట్టి కరిపించాలన్న దృఢ నిశ్చయంతో ఆ పార్టీ ఉంది.

అందుకు కావాల్సిన రంగాన్ని సిద్ధం చేసేపనిలో ఇప్పుడాపార్టీ ఉంది. ఎంతోకాలంగా తెలంగాణపై కాషాయ జండా ఎగురవేయాలన్న లక్ష్యంగా రాజకీయాలు నెరుపుతున్న బిజెపికి ఈ సంఘటనలు మరింత పట్టుదలను పెంచాయి. తాజాగా తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ మాటలే అందుకు తార్కాణం. ప్రధాని పదవి చేపట్టినప్పటినుండి తెలంగాణకు అనేకమార్లు వొచ్చినప్పటికీ, ఏనాడు కూడా తాజా పర్యటనలో మాట్లాడినంత ఘాటుగా ఆయన స్పందించిందిలేదు. ఎక్కడైతే అన్యాయాలు జరుగుతుంటాయో అక్కడ బిజెపి తప్పక ఆవిర్భవిస్తుందని చెప్పడంలోనే రానున్న ఎన్నికలకోసం ఇప్పటినుండే ఇక్కడ రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. తెలంగాణ ప్రజలు పట్టుదలలోనూ, పౌరుషంలోనూ, తమకు కావాల్సినదాన్ని సాధంచుకోవడంలోనూ వారికి వారే సాటి అంటూ ఇక్కడి ప్రజలను ఆకట్టుకునే ప్రసంగం చేసారాయన.

అయితే టిఆర్‌ఎస్‌ అం‌దుకేమీ తీసిపోనట్లుగా పార్టీని సమాయత్తంచేసే పనిలో పడింది. కేంద్రంతో అమితుమీ తేల్చుకునే రీతిలో పోరాటానికి సిద్ధమవుతున్నది.విభజన హామీలను, వివిధ సందర్భాల్లో కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలను ఏకరువు పెడుతూ దోషిగా కేంద్రాన్ని నిలదీసే పనిలో ఉంది. బిజెపిని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలను కేంద్రంపై పోరాటానికి సన్నద్ధం చేసే పని కొనసాగించే ప్రక్రియ కొనసాగింపుకు రంగం సిద్ధం చేస్తున్నది. ముఖ్యంగా మార్చిన తమ పార్టీపేరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడమన్నది ఇప్పుడు దానిముందున్న తక్షణ కర్తవ్యం. మునుగోడు ఎన్నిక నాటికే టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా ఎన్నికల కమిషన్‌ ఆమోద ముద్ర వేస్తుందనుకున్నారు. అదే పేరుతో ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేయడంద్వారా కొత్త పేరుతో ప్రారంభం చేసినట్లు అవుతుందనుకున్నారు. కాని, ఎన్నికల కమిషన్‌ ఆమోద ముద్ర వేయడంలో ఆలస్యం కావడంతో టిఆర్‌ఎస్‌ ‌పేరుతోనే ఎన్నికల్లో పోటీ పడి విజయాన్ని కైవసం చేసుకున్నది.

టిఆర్‌ఎస్‌ ఎం‌త పాపులర్‌ అయిందో వొచ్చే ఎన్నికలనాటికి బిఆర్‌ఎస్‌ను అంత పాపులర్‌ ‌చేయాలన్న ప్రయత్నంలోనే ఇప్పుడా పార్టీ ఉంది. నేడు జరిగే టిఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో ప్రథానంగా ఈ విషయంపైన చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. మునుగోడు ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికారంలో ఉండికూడా టిఆర్‌ఎస్‌ ‌చాలా శ్రమ పడాల్సి వొచ్చింది. ఆ నియోజకవర్గంలో బిజెపికి మొదటినుండి అంతగా ప్రధాన్యంలేక పోయినా గట్టి పోటీనిచ్చింది. అయితే పార్టీ తరఫున పోటీ పడిన వ్యక్తి నియోజకవర్గపు పాతకాపు కావడం ఆ పార్టీకి కలిసి వొచ్చిన అవకాశమే అయినా, బిజెపి కేంద్ర, రాష్ట్ర నాయకులంతా కట్టకట్టుకుని రావడాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో అందుకు ధీటైన ప్రణాళికను రూపొందించే పనిలో టిఆర్‌ఎస్‌ (‌బిఆర్‌ఎస్‌) ఉం‌ది.

ఈ క్రమంలో బిఆర్‌ఎస్‌ ‌పేరుతో ఎన్నికల రంగంలోకి దిగితే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారన్న విషయంలో కూడా కొంత ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళితే ఎలా ఉంటుందన్న చర్చ కూడా నేడు జరిగే సమావేశంలో చర్చించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు ఎన్నికలు ఎప్పుడు వొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ఈ ‌సమావేశంలో అప్రమత్తంచేసే అవకాశాలు లేకపోలేదు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో , అ తర్వాత కూడా వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం రాష్ట్రంలో ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పరస్పర దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఎంఎల్‌ఏ ‌రసమయి బాలకిషన్‌పై జరిగిన దాడి అయితేమీ, వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ అధినేత్రి షర్మిలపై దాడికి జరిగిన ప్రయత్నాలను చూస్తుంటే తమిళనాడు రాజకీయాలు గుర్తుచేసేవిగా ఉన్నాయి. వీటిపైనకూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఏదిఏమైనా ఈ సమావేశం టిఆర్‌ఎస్‌ ‌లేదా బిఆర్‌ఎస్‌ ‌భవిష్యత్‌ను నిర్దేశిస్తుందన్నది స్పష్టం.

Leave a Reply