(నేడు‘సరోజినీ నాయుడు’ 142వ జయంతి సందర్భంగా)
13 ఫిబ్రవరి 1879న హైదరాబాద్లోని బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో డా: అఘోరనాథ్ చటోపాద్యాయ (నిజామ్ కాలేజ్ ప్రిన్సిపల్) మరియు బరదా సుందరీ దేవి పుణ్యదంపతులకు ప్రథమ సంతానంగా జన్మించిన సరోజినీ నాయుడు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు, ఆంగ్ల రచయిత్రి మరియు కవయిత్రి, నాయకురాలు, పౌరహక్కుల పరిరక్షకురాలు, మహిళాభ్యుదయ నేత, సుస్వర వక్త, గాయని, బాల మేధావి, పరిపాలనాదక్షురాలు, భారత జాతీయ కాంగ్రేస్ ముఖ్య నాయకురాలుగా మనందరికీ చిరపరిచితురాలే. గాత్రానికి ముగ్దుడైన మహాత్మాగాంధీ సరోజినీ నాయుడిని ‘భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)’ అని నామకరణం చేశారు. మెట్రిక్యులేషన్ను యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, కింగ్స్ కాలేజ్ లండన్ మరియు గిర్టన్ కాలేజ్ కేంబ్రిడ్జిల్లో నిజామ్ స్కాలర్షిప్తో ఉన్నత విద్యను అభ్యసించిన సరోజినీ నాయుడు.
1905లో వలసపాలనకు వ్యతిరేకంగా గళమెత్తి, గాంధీ ‘స్వరాజ్య’ పిలుపుకు ఆకర్షితురాలై అనుచరురాలిగా భారత జాతీయ కాంగ్రేస్ ఉద్యమంలో పాల్గొన్నారు. 1925లో భారత జాతీయ కాంగ్రేస్ ప్రథమ మహిళా అధ్యక్షురాలిగా మరియు 1947లో యునైటెడ్ ప్రొవిన్స్ (ప్రస్తుత యూపీ) గవర్నర్గా సేవలు అందించారు. బాలలు, దేశభక్తి, ప్రేమరసం మరియు విషాద గతాల రచయితగా కీర్తిని గడించిన నైటింగేల్ ఆఫ్ ఇండియా వైద్యులు డా: పైడిపాటి గోవిందరాజులు నాయుడిని (కందుకూరి వీరేశలింగం పంతులు సమక్షంలో) 19వ ఏట కులాంతర మరియు ప్రాతాంతర వివాహమాడి ఆదర్శంగా నిలిచారు. 1915 – 1918 మధ్య దేశాన్ని పర్యటించి జాతీయతాభావం, మహిళా వికాసం మరియు సామాజిక అభ్యున్నతి అంశాలలో ప్రసంగించి ప్రజలను చైతన్య పరిచారు. నెహ్రూ, మదన్ మోహన్ మాలవీయ, గోపాలకృష్ణ గోకలే, రబింద్రనాథ్ టాగూర్, అన్నీ బిసెంట్ లాంటి ప్రముఖుల మార్గదర్శకత్వంలో పని చేశారు. ‘ఉప్పు సత్యాగ్రహ’, సహాయ నిరాకరణ మరియు క్విట్ ఇండియా లాంటి ఉద్యమాల్లో ముందు నడిచి 21 నెలలు జైలు పాలైనారు.
సరోజినీ నాయుడు తన 12వ ఏటనే రచనలు ప్రారంభించి మెహర్ మున్నీర్, ది గోల్డన్ త్రిషోల్డ్, ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్, ది ఫాదర్ ఆఫ్ ది డాన్, ది బర్డ్ ఆఫ్ టైమ్, ది బ్రోకెన్ వింగ్స్, ది ఫెదర్ ఆఫ్ ది డాన్, దిస్పెట్రెడ్ ఫ్లూట్ లాంటి పలు కవితా సంకలనాలు రచించి, చక్కటి స్వరంతో గానం చేశారు. పిల్లల అనాథశ్రమాలు మరియు బాలికల విద్యకు పరితపించి, మహిళోద్ధరణకు కంకనబద్దులై 1917లో భారత మహిళా సంఘం ఏర్పాటు చేశారు. యునివర్సిటీ ఆఫ్ లండన్ రూపొందించిన 150 మంది ప్రపంచ ధీరవనితల జాబితాలో చోటు దక్కించుకున్నారు. కైసర్-ఇ-హింద్ బంగారు పతకం, గూగుల్ డూగుల్, భారత కోకిల లాంటి పురస్కారాలను పొందిన సరోజినీ నాయుడు పేరును 5647 ఉల్క లేదా నక్షత్ర శకలానికి పెట్టడం జరిగింది.
ఉర్దూ, తెలుగు, ఆంగ్లం, బెంగాలీ, పార్సీ భాషలు మాట్లాడే సరోజినీ నాయుడు ఆధునిక భారత రూపకర్తల్లో ఒకరుగా సుస్థిర స్థానం దక్కించుకున్నారు. ఐదుగురు పిల్లలకు తల్లి అయిన సరోజినీ నాయుడును మహాత్మా గాంధీ ‘చాకోలేట్ వర్ణపు మిక్కీ మౌస్’ మరియు ‘డియర్ బుల్బుల్’ అనే ముద్దు పేర్లతో పిలిచే వారు. తన 70వ ఏట అనారోగ్యంతో లక్నోలో 02 మార్చి 1949న తుది శ్వాస విడిచారు. నేటి యువతకు, ముఖ్యంగా మహిళలకు ప్రేరణగా నిలిచిన ధీరవనిత సరోజినీ నాయుడు జీవితం మనందరికీ దీపస్తంభంగా నిలిచి సన్మార్గాన్ని చూపాలని కోరుకుందాం.