Take a fresh look at your lifestyle.

ఎపిలో నెత్తురోడిన రోడ్లు

  • వేర్వేరు ప్రమాదాల్లో చిన్నారి సహా 8 మంది మృతి
  • సహాయక చర్యలు చేపట్టిన పోలీస్‌ ‌సిబ్బంది

విజయవాడ : ఎపిలో రోడ్లు నెత్తురోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఓ చిన్నారి సహా మొత్తం 8మంది మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం ఎడిబి రోడ్డు ఇండస్టియ్రల్‌ ఏరియా వద్ద లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదు నెలల చిన్నారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఉదయాన్నే తాళ్లరేవు మండలం పెద్దవలస నుండి ఓ కుటుంబం గృహ శంకుస్థాపనకు కారులో రాజమహేంద్రవరం వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో నలుగురు మృత్యువాత పడ్డారు. పోలీసులు వెంటనే చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇకపోతే గుంటూరు జిల్లాలోని కొల్లూరులో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన గ్రావెల్‌ ‌చిప్స్ ‌లారీ బొల్తా పడింది.

ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కొల్లూరు ఎస్టీ కాలనీకి చెందిన వీరంకి దాసు, జట్టి దినేష్‌గా పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లా అద్దంకి శివారు గరటయ్య కాలనీ సపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా…మరో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. జగ్గయ్యపేట గట్టు భీమవరం గాంధీజీ కళాశాల వద్ద విజయవాడ నుంచి ఖమ్మం వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్ప గాయాలపాలయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని టోల్‌ ‌ప్లాజా ఆంబులెన్స్‌లో జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply