Take a fresh look at your lifestyle.

నేడు యథావిధిగా ‘పూరీ’ రథయాత్ర

భక్తులు లేకుండా నిర్వహించేందుకు ‘సుప్రీమ్‌’ అనుమతి

ఒడిశాలో అత్యంత వైభవంగా జరిగే పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీమ్‌ ‌కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో కట్టుదిట్టమైన భద్రత, ఆంక్షల మధ్య మంగళవారం సాయంత్రం యాత్రను నిర్వహించనున్నారు. తొలిసారిగా భక్తులకు అనుమతి లేకుండా రథయాత్రను నిర్వహించబోతున్నారు. కొరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కేవలం నిర్వాహకులు, పూజారుల సమక్షంలో మాత్రమే జరుపుకోవాలని ఆంక్షలు విధిస్తూ.. సుప్రీం కోర్టు ఇంతకుముందు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకుంది. స్థానికులతో మాత్రమే రథయాత్ర నిర్వహించుకోవచ్చని సోమవారం తాజాగా తీర్పు ఇచ్చింది. పరిస్థితులను బట్టి రథయాత్ర నిర్వహించాలా వద్దా అన్న విషయాన్ని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీంకోర్టు ఇటీవలే స్టే విధించింది. జగన్నాథ రథ యాత్ర నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, అనుమతి ఇవ్వాలని కేంద్రం, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును కోరాయి. దీనిపై కోర్టు విచారణ జరిపి పూరీ జగన్నాథ రథయాత్రకు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది.

కానీ కేవలం పూరీలో మాత్రమే జగన్నాథ రథయాత్ర నిర్వహించాలని సుప్రీంకోర్డు ఆదేశించింది. కరోనా వ్యాప్తి కారణంగా భక్తులు లేకుండానే యాత్ర నిర్వహించాలని సూచించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఈ రథయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని, రథ యాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు మంగలవారం సాయంత్రం పూరీ జగన్నాథ రథ యాత్ర ప్రారంభం కానుంది. రథయాత్రలో లక్షలాది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, దీనికి అనుమతి ఇస్తే వైరస్‌ ‌ప్రబలే ప్రమాదం ఉందని, ఈ వేడుకను నిలిపేయాలని గత గురువారం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని అడ్డుకోవద్దని, ఆ తీర్పుపై రివ్యూ చేయాలని కోరుతూ 21 మంది పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో వాటిపై సోమవారం విచారణ చేపట్టింది. దీనిపై పిటిషనర్లతో పాటు సోలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతా వాదనలు వినిపించారు.

పూరీ జగన్నాథుడి రథయాత్ర కోట్ల మంది భక్తుల నమ్మకానికి సంబంధించిన అంశమని, శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అడ్డుకోవద్దని తుషార్‌ ‌మెహతా కోరారు. కరోనా దృష్ట్యా ఈసారి ప్రజలు లేకుండానే నిర్వహించేందుకు అనుమతించాలని కోరారు. కొరోనా టెస్టులు చేసిన అనంతరం నెగెటివ్‌ ‌వచ్చిన వాళ్లు మాత్రమే జగన్నాథుడి ఆలయంలో పని చేస్తున్నట్లు తెలిపారు. సంప్రదాయం ప్రకారం జూన్‌ 23‌న రథయాత్రలో పూరీ జగన్నాథుడు బయటకు రాకుంటే, మరో 12 ఏళ్ల పాటూ రాకూడదని కోర్టుకు వివరించారు. దీనిని పరిగణనలోకి తీసుకుని కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా స్థానికులతో రథయాత్ర నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో వైరస్‌ ‌ప్రబలకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆలయ కమిటీ అత్యంత జాగరూకతతో రథయాత్రను నిర్వహించవచ్చని సుప్రీమ్‌ ‌కోర్టు స్పష్టం చేసింది. పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందనుకుంటే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం రథయాత్రను నిలిపేస్తూ నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది.

Leave a Reply