Take a fresh look at your lifestyle.

నాటక రంగానికి పోణంగి అప్పారావు ఎనలేని సేవలు

నేడు .. పోణంగి శ్రీరామ అప్పారావు వర్ధంతి

తెలుగు నాటక రంగానికి పోణంగి శ్రీరామ అప్పారావు చేసిన సేవలు సాటి రానివి. అంతేకాదు ఉపాధ్యాయునిగా, ఉపన్యాసకునిగా, పరిపాలనా దక్షునిగా, రచయితగా, పరిశోధకునిగా ఆచార్య పోణంగి శ్రీ రామ అప్పారావు చేసిన కృషి అనన్య సామాన్యం. తెలుగు జాతికి, కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహా మనీషి పోణంగి.

పోణంగి శ్రీరామ అప్పారావు (జూలై 21, 1923 – జూలై 2, 2005) నాటకకర్త, అధ్యాపకులు, నాట్యశాస్త్రం అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. అప్పారావు 1923, జూలై 21 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు తాలూకా, బందపురంలో జన్మించారు. కొవ్వూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో, విజయవాడ శ్రీరాజా రంగయ్యప్పారావు కళాశాలలో, ఆంధ్ర విశ్వ విద్యాలయంలోను విద్యాభ్యాసం చేశారు.

తెలుగు నాటక వికాసం‘ అనే అంశంపై పరిశోధన చేసి 1961 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ ‌పట్టా స్వీకరించారు. తెలుగు నాటక రంగాన్ని గురించిన సర్వ సమగ్రమైన గ్రంథమిది. 1967లో ఈ గ్రంథం వెలువడిన నాటినుంచి నాటక రంగానికి ప్రామాణిక గ్రంథంగా విరాజిల్లుతుంది. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.

భీమవరం, రాజమండ్రి, కడప, శ్రీకాకుళం, మద్రాసు కళాశాలలో, మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఉపన్యాసకులుగా, హైదరాబాద్‌ ‌న్యూ గవర్నమెంట్‌ ‌కాలేజ్‌ ‌ప్రిన్సిపాల్‌ ‌గా, పాఠ్య పుస్తకాల ప్రత్యేకాధికారిగా, సాంస్క్రతిక శాఖ ప్రత్యేకాధికారిగా, తెలుగు అకాడమీ – అంతర్జాతీయ తెలుగు సంస్థల స్థాపక డైరెక్టర్‌ ‌గా, ప్రథమ ప్రపంచ తెలుగు మహా సభల ప్రధాన కార్యదర్శిగా, సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్‌ ‌గా, ఆయా పదవులకే వన్నె తెచ్చారు.

రాష్ట్ర సంస్కృతిక వ్యవహారాల శాఖ సంచాలకునిగా, తెలుగు అకాడమీ, అంతర్జాతీయ తెలుగు సంస్థ (అదే శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంగా మారింది) వ్యవస్తాపక సంచాలకునిగా అప్పారావు ఎనలేని సేవలందించారు. గతంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రప్రధమ అంతర్జాతీయ తెలుగు మహా సభలకు ప్రధాన కార్యదర్శి హోదాలో నిర్విరామంగా శ్రమించి, ‘‘నభూతో నభవిష్యతి’’ గా విజయ వంతం చేశారు. ఆనాటి ముఖ్య మంత్రి జలగం వెంగళరావు, విద్యా మంత్రి మండలి వెంకట కృష్ణారావు నేతృత్వంలో తెలుగుజాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా అంతర్జాతీయ తెలుగు మహా సభలకు రూపకల్పన చేసి, తర్వాతి మహా సభలకు మార్గ నిర్దేశనం చేశారనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. అప్పారావు 1987 లో కలకత్తాలో జరిగిన విశ్వ ఉన్నయన్‌ ‌సంసద్లో రాష్ట్ర నాట్య సామ్రాట్‌ ‌బిరుదును, 1990లో హైదరాబాదు యువ కళావాహిని వారిచే నాటక రత్న బిరుదాన్ని, 1992 లో శ్రీకాళహస్తి భరతముని ఆర్టస్ అకాడెమీ వారిచే కళారత్న బిరుదాన్ని అందుకున్నారు.

భరతముని సంస్కృతంలో వ్రాసిన నాట్య శాస్త్రాన్ని డాక్టర్‌ ‌పి.ఎస్‌.ఆర్‌. అప్పారావు తెలుగు లోకి అనువదించారు. నాట్యంలోని వివిధ అభినయాలపై సవివరంగా ఎన్నో పుస్తకాలు రచించారు. నాట్యంలో శిక్షణ ఇచ్చే గురువులకు, నృత్యం నేర్చుకునే కళాకారులకు అవి ప్రామాణిక పాఠ్య గ్రంధాలుగా గుర్తింపు పొందాయి. అలనాటి నాటక రంగ ప్రముఖుల జీవిత విశేషాలను సేకరించి, గ్రంధస్తం చేశారు. ఎన్నో ప్రభుత్వ, ప్రయివేటు, స్వచ్చంద సాంస్కృతిక సంస్థలు ఆయనను గౌరవించి సత్కరించాయి. దేశ, విదేశాలలో నాట్య శాస్త్రం.పైన, రంగస్థల విషయాలపైన పరిశోధనలు చేసి, అనేక ప్రసంగాలు చేశారు.తాజ్‌ ‌మహల్‌ (‌నాటిక), విశ్వభారతి (నవల), వేణువు (పద్యాత్మక గద్యము), నాట్యశాస్త్రము (గుప్తభావ ప్రకాశికా సహితము – జాతీయ బహుమతి పొందిన గ్రంథం), నాటక రచనా ప్రయోగములు (సిద్ధాంత గ్రంథము), తెలుగు నాటక వికాసము (డాక్టరేట్‌ ‌పట్ట పరిశోధన వ్యాసము) తదితరాలు ఆయన ఇతర రచనలు.

‘నాట్యశాస్త్ర ‘గ్రంథానికి దివంగత ప్రధాని పండిట్‌ ‌జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ చేతుల మీదుగా కేంద్ర సాహిత్య అకాడమీ జాతీయ అవార్డును అందుకొన్నారు.

నాటకరంగ పరిశోధనలో విశేషంగా కృషి చేసిన అప్పారావు 2005, జూలై 2 న ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల …
9440595494

Leave a Reply