Take a fresh look at your lifestyle.

నడిచే విజ్ఞాన సర్వస్వం కపిలవాయి లింగమూర్తి

నేడు… కవి కేసరి జయంతి

కపిలవాయి లింగమూర్తి (మార్చి 31, 1928 నవంబర్‌ 6, 2018) ‌పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు. పద్య రచనతో ఆయన ప్రస్థానం ఆరంభమైనా కథా రచన, విమర్శ ప్రక్రియతో వెలుగులోకి వచ్చారు. జానపద సాహిత్యం, పాలమూరు జిల్లా లోని దేవాలయాలపై విస్తృత పరిశోధనలు చేశాడు. 70 కి పైగా పుస్తకాలు రచించాడు. ఈయనకు కవి కేసరి అనే బిరుదు ఉంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేటు అందుకున్న తొలివ్యక్తి కపిలవాయి లింగమూర్తి. ఆయన అచ్చంపేట తాలుకా, బల్మూర్‌ ‌మండలం, జినుకుంటలో మాణిక్యమ్మ, వెంకటాచలం దంపతులకు మార్చి 31, 1928కు సరియైన ప్రభవ నామ సంవత్సరం మాఘ శుద్ధ నవమి నాడు జన్మించారు. ఆయనకు రెండున్నరేళ్ళ వయసులో తండ్రి మృతి చెందడంతో మేనమామ పెద లక్ష్మయ్య దగ్గర పెరిగారు. పాఠశాల విద్యను ఉర్దూ మాధ్యమంలో పూర్తి చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్‌ ‌పరీక్షలు రాసి తెలుగులో విశారద ప్రమాణ పత్రాన్ని సంపాదించారు. అనంతరం ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి ఎం.ఏ. (తెలుగు) పట్టా పొంది 1954లో నాగర్‌ ‌కర్నూల్‌ ‌జాతీయోద్యమ పాఠశాలలో తెలుగు పండితునిగా చేరారు.

ఆ తర్వాత 1972 లో పాలెం శ్రీవేంకటేశ్వర ప్రాచ్య డిగ్రీ కళాశాలలో ఉపన్యాసకుడుగా చేరి దశాబ్దం పాటు సేవలందించి 1983లో ఉద్యోగ విరమణ పొందారు. లింగమూర్తి నడిచే విజ్ఞాన సర్వస్వంగా పేరుపొందారు. పలుగ్రంథాలు, పరిశోధనలు రచించి సాహితీవేత్తగా పేరు పొందాడు. కపిలవాయికి తెలుగు విశ్వవిద్యాలయం 26.8.2014 న గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. 30.08.2014 రోజున విశ్వ విద్యాలయం 13వ స్నాతకోత్సవంలో చాన్స్‌లర్‌, ‌రాష్ట్ర గవర్నర్‌ ‌నరసింహన్‌ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు యూనివర్సిటీ నుంచి తొలి గౌరవ డాక్టరేట్‌ ‌పొందిన వ్యక్తిగా కపిలవాయికి ఈ ఘనత దక్కింది. 1954 నుంచి 1983లో పదవీ విరమణ పొందే వరకు నాగర్‌కర్నూల్‌ ‌లోని జాతీయోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి, అక్కడే స్థిరపడ్డారు. అనేక స్థలచరిత్రలు, దేవాలయాల కథలకు ఆయన ప్రాణంపోశారు. మొత్తం 70 రచనలు ముద్రితమయ్యాయి. 11రచనలు ద్విముద్రితాలు, 25 రచనలు ముద్రించాల్సి ఉంది.

సమైక్యరాష్ట్రంలో తెలంగాణ కవులు, సాహితీ వేత్తలకు అన్యాయం జరిగింది. జీవోలు తెలుగులో రావాలి. పాఠశాలల్లో తెలుగు బోధించాలి అని సూచనలు చేశారు. ఆయన శతాధిక రచనలు చేశాడు. కపిలవాయి లింగమూర్తి కావ్యాలు, గీతాలు, శతకాలు, వచన సాహిత్యం, స్థల చరిత్రలు, బాల సాహిత్యం మొదలగు వివిధ సాహిత్య ప్రక్రియలలో రచనలు చేశారు. ఈ రచనలపై పలువురు విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికి వీరి రచనలపై వివిధ విశ్వ విద్యాలయాలలో ఆరు సిద్ధాంత గ్రంథాలు రూపొందినవి. 1992లో కవితా కళానిధి, పరిశోధనా పంచానన, 1996లో కవికేసరి, 2005లో వేదాంత విశారద,2010లో గురు శిరోమణి, 2012లో సాహిత్య స్వర్ణ సౌరభ కేసరి, సాహితీ విరాణ్మూర్తి తదితర బిరుదులు, సత్కారాలు పొందారు.

కపిలవాయి లింగమూర్తికి సాహిత్య రంగంలో చేసిన విశేషకృషికి గుర్తింపుగా రాష్ట్ర స్థాయిలో అనేక సందర్భాలలో సన్మానాలు జరిగాయి. 1983లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వీరిని సన్మానించారు. తరువాత నారా చంద్రబాబు నాయుడు, వై.యస్‌. ‌రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నకాలం లోనూ వారిచే సన్మానాలు పొందారు. తెలంగాణ రాష్ట్ర సమితి దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయనను సన్మానించారు. నలుగురు ముఖ్యంత్రులచే సన్మానింపబడిన ఏకైక తెలుగు కవి, పరిశోధకులు కపిలవాయి లింగమూర్తి. ఇంకా తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభాపురస్కారం, బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం, బ్రౌన్‌ ‌సాహిత్య పురస్కారం, నోరి నరసింహశాస్త్రి పురస్కారం, కందుకూరి రుద్రకవి పురస్కారం, పులికంటి సాహితీ పురస్కారం, బి.ఎన్‌.‌శాస్త్రి స్మారక పురస్కారం మొదలైన ఎన్నో సత్కారాలను పొందాడు.

వెన్నెల సాహిత్య అకాడమీ కపిలవాయి లింగమూర్తి జీవితం, సాహిత్య సృజన, పరిశోధనలపై కవితా కళానిధి కపిలవాయి లింగమూర్తి పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. దీనికి 2011లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఉత్తమ రెండో డాక్యుమెంటరీ చిత్రంగా నంది అవార్డును ప్రకటించింది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply