Take a fresh look at your lifestyle.

నేటి నుంచి సమ్మక్క – సారలమ్మ జాతర

today onwards, Sammakka - Saralamma Jataratoday onwards, Sammakka - Saralamma Jatara
భారీ బందోబస్తు, అధికార యంత్రాంగమంతా జాతరలోనే..
  • భారీ బందోబస్తు, అధికార యంత్రాంగమంతా జాతరలోనే..
  • జనసంద్రమైన మేడారం – కిటకిటలాడుతున్న జంపన్నవాగు

కుంభమేళాను తలపించేలా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభమైంది. జాతరకు ముందే లక్షలాదిగా భక్తులు మేడారం చేరుకొని తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజు, జంపన్నలు బుధవారం గద్దెనెక్కడంతో జాతర ప్రారంభం కానుంది. జాతర ప్రాంతమంతా భక్తుల కోలాహలంతో కిక్కిరిసిపోయింది. బుధవారం సారలమ్మ, గురువారం సారక్క గద్దెలను ఎక్కనుండడంతో తెలంగాణలోని రహదారులన్నీ మేడారం వైపే సాగుతున్నాయి. వేలు, లక్షలు కాదు.. కోటానుకోట్ల భక్త జనం మేడారంవైపు సాగుతున్నారు. జంపన్న వాగులో జలకాలాడి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. సమ్మక్క సారాలమ్మ కళ్లారా దర్శించుకునేందుకు భక్త జనం బారులు తీరుతున్నారు. కుంభమేళా తర్వాత దేశంలో జరిగే అతి పెద్ద జాతర ఇదే.

నేటి నుంచే కీలక ఘట్టం మొదలు…
కోట్లాది మంది భక్తులు ఎదురు చూసే ఈ మహజాతరలో తొలి ఘట్టం సమ్మక్క భర్త పగిడిద్దరాజును పెళ్లి కుమారుడిగా తయారు చేయడంతో ప్రారంభమైంది. పెనక వంశానికి చెందిన పూజారులతో పాటు పూను గొండ్ల గ్రామస్తులు నిష్ఠతో ఈ పూజలు నిర్వహిస్తారు. ముందుగా తలపతి (పూజారుల పెద్ద) ఇంట్లో అమ్మవారికి తీసుకుని వెళ్లేపానుపు (పసుపు, కుంకుమ, కొత్త వస్త్రాలు) సిద్ధం చేస్తారు. ఉదయం పానుపును డోలి వాయిద్యాల నడుమ ఆలయానికి తరలించి పూజలు నిర్వహించారు. దేవుని గుట్ట నుంచి తీసుకువచ్చిన వెదురు కర్రతో పగిడిద్దరాజు పడిగెను సిద్ధం చేస్తారు. శివసత్తుల పూనకాలు, దేవుని మహిమతో తన్మయత్వం పొందిన పూజారులు పడిగెను ఆలయ ప్రాంగణంలోని గద్దెపై ప్రతిష్టిస్తారు. సుమారు 2 గంటలు పెళ్లి కుమారుడిగా భక్తులకు దర్శనం ఇచ్చే పగిడిద్దరాజును దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం పూజారులు తలపతి ఇంట్లో సిద్ధం చేసిన పానుపుతో పాటు పడిగెను తీసుకుని కాలినడకన అటవీ మార్గాన బయలుదేరారు. పస్రా చేరుకున్నాక పగిడిద్దరాజుకు నేరుగా సమ్మక్క కొలువుదీరిన చిలుకల గుట్టపైకి చేరుకుంటారు. ఇక్కడ వారి ఇరువురికి ఆదివాసీ సంప్రదాయంలో ఇరు పూజారులు ఎదుర్కోళ్లు, వివాహం జరిపిస్తారు.
5న సారలమ్మ, 6న సమ్మక్క….
సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు 3 కిలోమీటర్ల దూరంలోని ఈ కుగ్రామంలో చిన్న ఆలయంలో ప్రతిష్టించబడిన సారలమ్మ 5న బుధవారం సాయంత్రం మేడారంలోని గద్దె వద్దకు చేరుతుంది. కడుపు పండాలని కోరుకునేవారు.. దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వందలాది మంది తడి బట్టలతో గుడి ఎదుట సాష్టాంగ నమస్కారాలతో వరం పడతారు. సారలమ్మను మోస్తున్న పూజారిని దేవదూతగా భావిస్తారు. సారలమ్మ జంపన్నవాగు గుండా నేరుగా మేడారంలోని తల్లి సమ్మక్క దేవాలయానికి చేరుకుంటుంది. సారలమ్మ కొలువుదీరిన మరుసటి రోజున అంటే 6న గురువారం సాయంత్రం వేళ సమ్మక్క గద్దెపైకి వస్తుంది. ఆ రోజు ఉదయమే పూజారులు చిలకలగుట్టకు వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై పూజలు చేస్తారు. అనంతరం సమ్మక్క పూజామందిరం నుంచి వడరాలు, పసిడి కుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. సాయంత్రం వేళలో చిలకలగుట్టపై కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు బయలుదేరుతారు. జాతర మొత్తానికి ప్రధానమైన సమ్మక్క ఆగమనం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. తల్లికి ఆహ్వానం పలు కుతూ చిలకలగుట్ట వద్దకు వెళ్తారు. సమ్మక్క కొలువైన ప్రదేశానికి చేరుకున్న పూజారులు అక్కడ పూజలు చేస్తారు. తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన పూజారి మైకంతో పరుగున గుట్ట దిగుతాడు. అక్కడ పోలీసులు రక్షణ ఏర్పాట్లు చేస్తారు. జిల్లా ఎస్పీ తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపి అధికార వందనంతో స్వాగతం పలుకుతారు.

మూడో రోజు మొక్కులు….
గద్దెలపై ఆశీనులైన సమ్మక్క-సారలమ్మ జాతరలో మూడో రోజు (7వ తేదీ) భక్తులకు దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. కోర్కెలు తీర్చమని వేడుకుంటారు. కోర్కెలు తీరినవారు కానుకలు చెల్లిస్తారు. ఆడపడుచులుగా భావిస్తూ పసుపుకుంకుమలు, చీరె,సారెలు పెడతారు. ఒడి బియ్యం పోస్తారు. తలనీలాలు సమర్పించుకుంటారు. ఎత్తు బంగారం (బెల్లం) నైవేద్యంగా పెడ తారు. ఆరోజంతా లక్షలాదిమంది గద్దెలవద్ద అమ్మవార్లను దర్శించు కుంటారు. కనులారా వీక్షించి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన అశేష భక్తజనానికి దర్శనం ఇచ్చిన సమ్మక్క-సారలమ్మ నాలుగో రోజున   సాయంత్రం తిరిగివన ప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగిసిపోతుంది.

మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు….
అర్రెం వంశీయుల ఆరాధ్య దైవం, సమక్క భర్త అయిన పగిడిద్దరాజు సోమవారం మేడారం పయనమయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ గ్రామం నుంచి అర్రెం వంశీయులు పగిడిద్దరాజును తీసుకుని కాలినడకన బయలుదేరారు.

Tags:

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply