Take a fresh look at your lifestyle.

నేడు మిక్కిలినేని వర్ధంతి బహుముఖ ప్రజ్ఞాశాలి మిక్కిలినేని

పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలు పోషించి, అందరి మన్ననలను పొంద గలిగిన ప్రముఖ తెలుగు రంగస్థల, సినిమా నటుడు మిక్కిలినేని. అయితే రాధాకృష్ణ మూర్తి, చాలా మందికి చలన చిత్ర నటుడిగా తెలుసు. కొద్ది మందికి రంగ స్థల నటుడిగా తెలుసు. మరికొంత మందికి స్వాతంత్య్ర సమర యోధునిగా, నిజాం వ్యతిరేక ఉద్యమకారునిగా తెలుసు. ఇంకొంత మందికి గ్రంథకర్తగా తెలుసు. కొందరికే  కమ్యూనిస్టుగా బాగా తెలుసు. అందుకే ‘‘బహుముఖ ప్రజ్ఞాశాలి’’ అన్న మాటకు నిలువుటద్దంగా నిలిచారు మిక్కిలినేని.

మిక్కిలినేనిగా సుపరిచితులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (జూలై 7, 1916 – ఫిబ్రవరి 22, 2011) ఆంధప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని లింగాయ పాలెంలో 1914, జులై 7న జన్మించారు. కోలవెన్నులో అమ్మమ్మ దగ్గర పెరిగిన ఆయన నాటకాలపై మక్కువతో రంగస్థలం వైపు మళ్లారు. జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు. జానపద, పౌరాణిక నాటకాల్లో పురుష, స్త్రీ పాత్రలను ధరించి ప్రేక్షకులను ఆకట్టు కున్నారు. బ్రిటిష్‌ ‌పాలకుల వ్యతిరేక పోరాటాలు చేశారు. హేతువాద ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్తగా ఎన్నో ఉద్యమాలను నిర్వహించి, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సహాయ పడ్డారు. అన్యాయం జరుగుతున్న చోట న్యాయ పోరాటం చేయాలని గళం విప్పిన ఆయన…ప్రజానాట్య మండలికి వ్యవస్థాప సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. స్వాత్రంత్ర పోరాటాల్లో పాల్గొని ఐదుసార్లు జైలుకు వెళ్లారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిజాం పాలనకు వ్యతిరేకంగా కొంతకాలం పోరాడారు.

పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం,  కాటమరాజు కథ తదితర 30 చారిత్రక, జానపద కళారూపాల ద్వారా ప్రజలను సమీకరించిన ప్రజానాట్య మండలి 1940లలో నిషేధానికి గురైంది. ఫలితంగా కొందరు సినీ రంగాన్ని ఆశ్రయించారు. వారిలో  మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి వంటి ముఖ్యులున్నారు. సహజంగా సినిమా రంగంపై ఆసక్తితో మిక్కిలినేని అలా ఆ దారి పట్టారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తండ్రి కె.ఎస్‌.‌ప్రకాశరావు దర్శకత్వం వహించిన 1949లో ‘దీక్ష’ సినిమాతో సినిమా కెరీర్‌ని మొదలు పెట్టారు మిక్కిలినేని. 1949లో కేఎస్‌ ‌ప్రకాశ రావు దీక్షతో మొదలై బాలకృష్ణ సినిమా భైరవద్వీపం వరకూ 400లకు పైగా తెలుగు చిత్రాల్లో నటించి, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు.

ఐదుసార్లు జైలుకు వెళ్లిన స్వాతంత్య్ర సమర యోధుడు, కమ్యూనిస్టు. గ్రంథాలయ, హేతువాద ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్త, నాటకరంగ నటులు, ‘ఆంధ్రుల నటరత్నాలు’ తదితర రచనలను చేసినవారు, ప్రజానాట్య మండలి వ్యవస్థాపక సభ్యులు, ‘తెలుగువారి జానపద కళారూపాలు’ గ్రంథ రచయిత. ‘మన పగటి వేషాలు’, ‘ఆంధ్రుల నృత్యకళావికాసం’ తదితర పరిశోధనాత్మక గ్రంథ రచయిత మిక్కిలినేని. ఆయన వంటి నూనూగు మీసాల కుర్రాళ్లను అప్పటి సంక్షుభిత సమాజం రాటుదేల్చింది. అంతర్జాతీయంగా ఫాసిస్టులకు, దేశీయంగా బ్రిటిష్‌ – ‌నైజాం నియంతృత్వానికి, ఆంధ్ర ప్రాంతంలో జమీందారీల అణచి వేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ రూపొందించిన కళాసైన్యం ప్రజానాట్య మండలి. ఆ వాతావరణంలో భార్య సీతా రత్నాన్ని మిక్కిలినేని ఎనభై ఏళ్లనాడు నాటక రంగానికి పరిచయం చేసిన ప్రజా కళాకారులు.
కపిలవాయి రామనాథ శాస్త్రి శిష్యరికంలో ‘మిక్కిలినేని’ ఇంటి పేరుగల వారికి గర్వకారణంగా  బహుముఖంగా ఎదిగి,  ఫిబ్రవరి 22, 2011 తేదీన మంగళవారం మిక్కిలినేని విజయవాడలో తన 95వ ఏట మరణించారు.

- Advertisement -

నాటక రంగానికి చెందిన 400 మంది కళాకారులను ‘నటరత్నాలు’ శీర్షిక ద్వారా తెలుగు పాఠకులకు పరిచయం చేసిన ప్రత్యేకత మిక్కిలినేనిదే.  వీధినాటకాలు – జముకుల కథలు – బురక్రథలు ప్రదర్శించిన పాత రోజులను మరవకుండా, పాత స్నేహితాలను పునరావిష్కరించుకుంటూ తెలుగు నేల నాలుగు చెరగులా తిరిగి స్వయంగా తెలుసుకున్న సమాచారంతో ‘ఆంధ్ర నాటకరంగ చరిత్ర’ రచించారు.
నటరత్నాలు (1980, 2002), ఆంధ్ర నాటకరంగ చరిత్ర, తెలుగువారి జానపద కళా రూపాలు, ప్రజా పోరాటాల రంగస్థలం, ఆంధ్రుల నృత్య కళా వికాసం, తెలుగు వారి చలన చిత్ర కళ  తదితర రచనలు చేశారు. నాటకాల్లో అనుభవం ఉండటంతో ఏ పాత్ర ఇచ్చినా ఆయన లీనమై నటించే వారు. దీంతో దర్శక నిర్మాతలు ఆయన కోసమే ప్రత్యేకంగా పాత్రలు రాసేవారు. ఐదు దశాబ్దాలపాటు సినీరంగంలో సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలను పోషించిన ఆయన సుమారు 400 చిత్రాలలో నటించారు. భైరవద్వీపం ఆయన చివరి చిత్రం. నందమూరి తారక రామరావుతోనే ఏకంగా 150 సినిమాల్లో నటించడం ఓ రికార్డు.

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మరణంతో జీవించి వున్న తెలుగు సినీ కళాకారుల్లో తానే పెద్ద అన్నారు డా. అక్కినేని నాగేశ్వరరావు. నాటక రంగానికి, జానపద కళలకు వీరు చేసిన సేవలకు ఆంధ్ర విశ్వ విద్యాలయం కళా ప్రపూర్ణ పురస్కార మిచ్చింది. తెలుగు విశ్వ విద్యాలయం ఎన్‌.‌టి.ఆర్‌ ఆత్మగౌర పురస్కారంతో ఆయనను  సన్మానించింది. 1999లో తెలుగు విశ్వ విద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం లభించింది.

రామ కిష్టయ్య సంగన భట్ల,
  9440595494

Leave a Reply