Take a fresh look at your lifestyle.

యుద్ధ అనాధలకు రక్షణ గొడుగు పడదాం…!

నేడు ‘‘ప్రపంచ యుద్ధ అనాధల దినం’’

యుద్ధాలు ఏ స్థాయిలో జరిగిన అది మిగిల్చే విషాదాలు దీర్ఘకాలం పాటు మానవాళిని వెంటాడుతూనే ఉంటాయి. యుద్ధం చేసిన ఇరు పక్షాలు ఆర్థిక నష్టాలతో పాటు జవాన్లు/సామాన్య జనాల మరణాలు, దీర్ఘకాల జబ్బులు, తీవ్ర గాయాలను తలుచుకొని భావోద్వేగ దెబ్బలతో దుఃఖించాల్సిందే. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరుల కుటుంబాలు అనాధాశ్రమాలుగా మారిపోతున్నాయి. అమరవీరుల కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి ఒడువని కన్నీటి సాగరంలో జీవచ్ఛవాల్లా బతుకులు ఈడుస్తుంటారు. కొరోనా లాంటి మహావిపత్తుల సమయంలో యుద్ధ అనాధల బతుకులు పుండుపై కారం చల్లినట్లు అవుతున్నదాయి. యుద్ధాలు, జాతి వివక్ష పోరాటాలు, అంతర్గత సంఘర్షనల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాల పిల్లలు అనాధలుగా మిగిలి పోతున్నారు. ఇలాంటి యుద్ధం మిగిల్చిన అనాధలకు చేయూతను ఇవ్వడానికి వేదికగా ప్రతి ఏట 06 జనవరి రోజున ‘ప్రపంచ యుద్ధ అనాధల దినం (వరల్డ్ ‌డే ఫర్‌ ‌వార్‌ ఆర్ఫన్స్)’ ‌నిర్వహిస్తున్నారు. యూనిసెఫ్‌ ‌వివరణ ప్రకారం 18 ఏండ్ల లోపు వయస్సు కలిగిన పిల్లలు తల్లితండ్రులను లేదా ఎవరో ఒక్కరిని కోల్పోయినపుడు అనాధలుగా పరిగణించబడతారు.

ఫ్రెంచ్‌ ‌సంస్థ ఆలోచనలతో ప్రారంభమైన ప్రపంచ యుద్ధ అనాధల దినం వేదికగా అనాధ కుటుంబాలకు మేమున్నామనే ధైర్యాన్ని నూరి పోయడం, ఆర్థిక చేయూతను అందించడం, ఉద్యోగ ఉపాధుల్లో ప్రాధాన్యత ఇవ్వడం లాంటి సేవలను అందించాలి. రెండు ప్రపంచం మిగిల్చిన విషాదాలు అనంతమైనవి. చరిత్రి చవి చూసిన రెండు ప్రపంచ యుద్ధాల్లో మిలియన్ల పిల్లలు అనాధలు అయ్యారు. ప్రతి ఏట యుద్ధ అనాధల సంఖ్య క్రమంగా తగ్గుతూ నేడు ఏడాదికి 0.7 శాతానికి చేరింది.

World War Orphans Day

ప్రపంచవ్యాప్తంగా 1990లో 146 మిలియన్ల అనాధలు ఉండగా, 2000లో 155 మిలియన్లు, 2015లో 140 మిలియన్ల యుద్ధ అనాధలు (ఆసియాలో 61 మిలియన్లు, ఆఫ్రికాలో 52 మిలియన్లు, లాటిన్‌ అమెరికాలో 10 మిలియన్లు, యూరెప్‌లో 7.3 మిలియన్ల అనాధలు) ఉన్నారని తేలింది. యుద్ధ అనాధలను సమాజం చిన్న చూపు చూడడం, శ్రమ దోపిడీ చేయడం, సామాజిక భావోద్వేగ వివక్షలకు గురిచేయడం, మానసికంగా కృంగి పోయేలా ప్రవర్తించడం, లైంగిక హింసలకు గురి చేయడం, బడులకు దూరంగా వెట్టి చాకిరీలో ముంచడం లాంటి అమానవీయ చర్యల్లో చిక్కుకొని దుర్భర బతుకులు అనుభవిస్తున్నారు. ‘వార్‌ ‌జోన్ల’లోని అసంఖ్యాక యుద్ధ అనాధల కష్టాలు మరింత వర్ణణాతీతంగా ఉంటాయి.

యుద్ధ అనాథల్ని అక్కున చేర్చుకోవడం, ఉచిత విద్య వైద్య సదుపాయాలు కల్పించడం, అర్హత కలిగిన అనాధలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వడం, మానవీయ కోణంతో వారి కుటుంబాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ, ప్రభుత్వేతర, పౌర సమాజ కనీస బాధ్యతగా భావించాలి. అనాధల వ్యధలున్న సమాజం నరక సమానమని భావిస్తూ అనాధలకు అమ్మనాన్నలుగా, ఆర్థిక వనరులుగా పౌరసమాజం గొడుగు పట్టాలడానికి వెనకడుగు వేయరాదు. కుటుంబ పెద్దను జాతి హితం కోసం కోల్పోయిన కుటుంబాల అనాధలే అసలైన దేశభక్తులుగా పూజించబడాలి. అనాథల్ని అలక్ష్యం చేసిన సమాజంలో అశాంతి నెలకొనవచ్చని మరువరాదు. అనాధ బాలల బంగారు భవిష్యత్తును ఆదిలోనే తుంచరాదు. పిల్లలు దేవుళ్లతో సమానమని నమ్మిన సమాజంలో అనాధల వెతలకు తావుండ కూడదు. అనాధల ఆక్రందనలు జాతికి శాపాలు, అమానవీయతకు సాక్ష్యాలని గుర్తుంచుకోవాలి. దేశాభివృద్ధిలో యుద్ధ అనాధల్ని భాగస్వాములు చేస్తూ, మానవీయతను వికసింప చేద్దాం.

dr burra madhusudhan reddy
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి, విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల, కరీంనగర్‌ – 9949700037

Leave a Reply