Take a fresh look at your lifestyle.

విశ్వప్రగతి మార్గనిర్ధేశకులు ఉపాధ్యాయులు

నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం

విద్యార్ధులకు ఉపాధ్యాయులకు మధ్య గల సంబంధం కేవలం తరగతి గదులకే పరిమితమయ్యే గురుశిష్య సంబంధం మాత్రమే కారాదు. విజ్ఞానాన్ని ప్రపంచం నలుచెరగులా వ్యాపింప చేసి,అభివృద్ధికి నిచ్చెనలా,ఆలంబనలా ఉపయోగ పడే విధంగా ఉండాలి. ఉపాధ్యాయులు నవ ప్రపంచ నిర్మాతలు.విద్యార్ధులకు మార్గనిర్ధేశకులు.విశ్వానికి వెలుగు రేఖలు ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల హక్కులను బాధ్యతలను గుర్తు చేస్తూ, వారిని గౌరవించే ప్రక్రియలో భాగంగా యునెస్కో తీర్మానం ప్రకారం 1994 సంవత్సరం నుండి ప్రతీ ఏటా అక్టోబర్‌ 5 ‌వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుగుతున్నది. ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవానికి ఫ్రాన్స్ ‌రాజధాని పారిస్‌ ‌నాందీ వాక్యం పలికింది.అజ్ఞానమనే అంధకారం నుండి విజ్ఞానమనే వెలుగు వైపు పయనింప చేసే శక్తి కేవలం ఉపాధ్యాయులకే సాధ్యం. ప్రపంచ ప్రగతి సాధన ఉత్తమ విద్య ద్వారా మాత్రమే సాధ్యం. ఉత్తమ నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పి, విద్యార్థుల్లో నైపుణ్యానికి ఉపాధ్యాయులు,విద్యావంతులు కృషి చేయాలి. కంఠస్థం చేయడం వలన కంఠశోష తప్ప ప్రయోజనం శూన్యం.దురదృష్ట వశాత్తూ ఈనాటికీ ప్రపంచంలో చాలా మందికి విద్యావకాశాలు గగనకుసుమంలా మారాయి. కొన్ని దేశాల్లో స్త్రీలకు చదువుకునే స్వేచ్ఛ లేదు. మరికొన్ని దేశాల్లో కుటుంబాల ఆర్ధిక స్థోమత సరిగా లేక, చదువుకునే అవకాశాలు మృగ్యమైపోతున్నాయి. బాలకార్మికులుగా,వీధి బాలల్లా మిగిలి పోతున్నారు. ఒక వైపు ఇలాంటి పరిస్థితులు తాండవిస్తుంటే,మరొకవైపు నాణ్యత లేని విద్యల వలన ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతున్నాయి. నైపుణ్యం లోపించిన చదువుల వలన ప్రపంచ ప్రగతి సాధ్యం కాదు.ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పడం లో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేసి, విద్యార్ధులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి.

విద్య యొక్క ప్రాధాన్యతను పెంచే విధంగా సంస్కరణలు రావాలి. నిజమైన విద్యకోసం పాటుపడాలి. సాంకేతిక రంగాన్ని చెడిపోవడానికే వినియోగించుకునే విద్యార్థుల ధోరణిలో మార్పురావాలి. వాస్తవ ప్రపంచానికి దూరంగా, రంగుల లోకంలో విహరిస్తూ పెనుభారంగా తయారైన యువత చాలా ప్రమాదకరం. ఊహల్లో తేలియాడే ప్రపంచానికై ఉర్రూతలూగుతున్న యువతను సంస్కరించాలి. తల్లిదండ్రుల దృక్పథంలో కూడా మార్పు రావాలి.తల్లి దండ్రులు ఒక స్థాయి వరకు తమ పిల్లలను తమ వద్దే పెరిగేటట్టు చూడాలి. బాహ్య ప్రపంచంలోని అనైతిక ధోరణుల వలన కలిగే పర్యవసానాల గురించి తెలియచెప్పాలి. ఉపాధ్యాయులు కూడా తమ వృత్తి పట్ల అంకితభావం ప్రదర్శించాలి. బావితరాన్ని మేథాశక్తి సుసంపన్నులుగా తయారు చేయడంలో వారి పట్ల గురుతరమైన బాధ్యత ఉంది.’’విద్యాలయం’’ అనే ఉద్యానవనంలో విజ్ఞానంతో విరబూసిన పువ్వులే విద్యార్థులు. శూన్యంలో నుంచి శక్తి జనించదు, ఉపాధ్యాయుల ఆలోచనల్లోనే నిజమైన శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి సాధనకై ఉపాధ్యాయులు నిరంతర విద్యార్ధులై శ్రమించాలి. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి. ఉపాధ్యాయుల ధ్యాసంతా విద్యార్థులపై కేంద్రీకరించినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. విద్యార్ధులను నాణ్యమైన విద్యాబోధనతో అన్నిరంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం… విలువలతో ఉత్తమపౌరులుగా తయారు చేయడం. అందుకు అనువైన పరిస్థితులను ప్రభుత్వాలు నెలకొల్పాలి.

ఏదేశమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే ప్రజలకు సజావుగా జీవించడానికి మౌలిక సదుపాయాలు అందుతాయి.జీవనోపాధి లభిస్తుంది. ప్రజలంతా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవించగలిగినప్ఫుడే అలజడులు,అరాచకాలు తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడి, శాంతి భద్రతలు నెలకొని, దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. వీటన్నింటికీ మూలాధారం విద్య. విద్య అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. విద్య ద్వారా సాధించలేని దంటూ ఏదీ లేదు. అలాంటి నాణ్యమైన విద్య దేశంలో ప్రతీ ఒక్కరికీ అందాలి.సక్రమమైన విద్యల వలన విద్యావంతులు విభిన్న రంగాల్లో తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి దేశాభివృద్ధిని శిఖరాగ్ర భాగంలో నిలబెట్టగలరు మనిషి పరిపక్వత కు విద్య అవసరం.విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రావాలి. విద్యార్ధులను అన్నిరంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దాలి. అప్పుడే మనం ఆశించిన నిజమైన దేశాభివృద్ధి,ప్రపంచాభివృధ్ది సాధ్యపడుతుంది. విద్యార్ధులంతా చక్కని విద్యసాధనతో విలువలతో కూడిన నవ ప్రపంచాన్ని సృష్టించడమే ప్రపంచ ఉపాధ్యాయదినోత్సవం ముఖ్య లక్ష్యం.
– సుంకవల్లి సత్తిరాజు,(సామాజిక విశ్లేషకులు), సంగాయగూడెం, ప.గో.జిల్లా,ఆం ధ్రప్రదేశ్‌-‌మొబైల్‌: 9704903463.

Leave a Reply