ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 19 న ‘ప్రపంచ సికిల్సెల్ ఎనీమియా దినోత్సవం’’ జరుపుకుంటాము. ఈ రోజున ఈ వ్యాది మరియు చికిత్సా పద్దతుల గురించి ప్రజలలో అవగాహన కలిగిస్తారు. వంశపారంపర్యంగా వచ్చే జబ్బు సికిల్సెల్ ఎనీమియా జీవితాంతం వెంటాడే సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 లక్షల మంది దీనితో పుడుతున్నారని ఒక అంచనా. వీరిలో సగం మంది ఐదేళ్ల లోపే మరణిస్తూ ఉండడం విచారకరం. ప్రపంచవ్యాప్తంగా సికిల్సెల్ ఎనీమియా జబ్బు కారక జన్యు గలవారిలో 50 శాతానికి పైగా మన దేశానికి చెందిన వారే ఉన్నారు. సికిల్సెల్ ఎనీమియా జబ్బు తో పుట్టిన పిల్లలలో 20 శాతం మంది రెండేళ్ల లోపే మరణిస్తున్నారు. అంతేకాదు 30 శాతం మంది 20 ఏళ్లకు ముందే చనిపోతున్నారు. సికిల్సెల్ ఎనీమియా ఆర్థికంగా వెనుకబడిన వారు ముఖ్యంగా గిరిజన తెగల వారు ఎక్కువగా ఈ వ్యాధికి గురి అవుతున్నారు.
మన శరీరం లో ప్రతి కణం పని చేయాలంటే ఆక్సిజన్, పోషకాలు అవసరం. ఇవి రక్తం ద్వారా ప్రతి కణానికి అందుతాయి మరి రక్తం సరఫరా సరిగా కాకపోతే శరీర వ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోతుంది. అవయవాలు దెబ్బతిని రకరకాల సమస్యలు వస్తాయి. సాధారణంగా గా ఎర్ర రక్త కణాలు మృదువుగా, గుండ్రంగా ఉంటాయి. సికిల్సెల్ జబ్బు బాధితుల్లో ఇవి కొడవలి లేదా నెలవంక రూపంలోకి మారిపోతాయి.
జిగురుగా గట్టిగా తయారవుతాయి. ఫలితంగా సరిగ్గా కదలలేక సూక్ష్మ రక్త నాళాల్లో చిక్కుకొని పోవడం వలన రక్తం సరఫరా నెమ్మదిస్తుంది. తగినంత ఆక్సిజన్ పోషకాలు కణాలకు అందక తీవ్రమైన నొప్పి రక్తహీనత ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు మొదలవుతాయి. సికిల్సెల్ అనీమియా లక్షణాలు అందరిలో ఒకేలా ఉండాలని ఏమి లేదు. మనిషిని బట్టి లక్షణాలు మారిపోతూ ఉండవచ్చు. పక్షవాతం , రక్తహీనత నిస్సత్తువ, చాటి సమస్యలు, ఊపిరి తిత్తులలో అధిక రక్తపోటు, ఆయాసం, కామెర్లు పితాశాయంలో రాళ్ళు వంటివి వస్తాయి. తరచుగా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. రక్తసరఫరా దెబ్బతినడం వలన కాళ్ళు చేతులలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే ప్లీహం ( స్ప్లీన్) దెబ్బతింటుంది. కాబట్టి ఎక్కువగా వ్యాధుల బారిన పడుతారు. ఎదుగుదల కుంటుపడుతుంది. కొందరిలో చూపు కూడా తగ్గే అవకాశం ఉండి.
సికిల్ సెల్ అనీమియాకు ఎముక మజ్జ మూల కణ మార్పిడి ఒక్కటే సమర్థవంతమైన చికిత్స. దీన్ని చాలా వరకు 16 ఏళ్ల లోపు వాళ్లకి చేస్తారు. ఆ తర్వాత చేస్తే ముప్పు పెరుగుతుంది. కొందరికి ప్రాణాపాయము తలెత్తవచ్చు. పైగా ఎముక మజ్జ మార్పిడి దొరకడం చాలా కష్టం. అందువల్ల చికిత్సతో నొప్పి వంటి ఇతరత్రా లక్షణాలను తగ్గించడానికి దుష్ప్రభావాలను నివారించడానికి ప్రాధాన్యం ఇస్తారు. చాలా వరకు సైకిల్ సెల్ జబ్బు చిన్న వయసులోనే బయటపడుతుంది. రకరకాల సమస్యలు ఎదురవుతాయి. తగు జాగ్రత్తలు, జన్యు కౌన్సిలింగ్ తీసుకుంటే, దీనిని చాలా వరకు నివారించుకోవచ్చు. సైకిల్ సెల్ జన్యు కారక జన్యువులు కలవారు సంతానం కోసం ప్రయత్నించటానికి ముందు జన్యు నిపుణులను సంప్రదించి ముందస్తు పరీక్షలు చేయించుకోవడం మంచిది.
జీవనశైలి మార్పులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు కొత్త ఎర్ర రక్తకణాల తయారీకి ఫోలిక్ యాసిడ్ విటమిన్ లు చాలా అవసరం కాబట్టి ప్రతిరోజూ పోలిక్ యాసిడ్ మాత్రలతో పాటు తాజా రకరకాల రంగుల కూరగాయలు. పండ్లు. తీసుకోవడం మంచిది. శరీరంలో నీటి శాతం తగ్గితే నొప్పులు తలెత్తే అవకాశం ఉంది. అందువలన రోజంతా తగినంత నీరు తాగటమే ఉత్తమం. ఇన్ఫెక్షన్ వంటివి వస్తే ఆలస్యం చేయకుండా తగు చికిత్స తీసుకోవాలి. పరిశుభ్రత పాటించడం ధూమపానం మద్యపానానికి దూరంగా ఉండటం మంచి ఆహారపు అలవాట్లు పాటించడం జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉండటం, ప్రతిరోజూ శారీరక వ్యాయామం చేయడం, ఉప్పు కారం తగ్గించి సాధారణ భోజనానికి అలవాటుపడితే జీవనశైలి చక్కగా ఉంటుందని, సికిల్సెల్ అనీమియా అర్థం చేసుకోవడం, అప్పుడే దీనితో వచ్చే సమస్యలను, మరణాలను నివారిం చుకోవడం సాధ్యమవుతుందని వైద్యులు అభి ప్రాయపడుతున్నారు.
